చాలా విషయాల్లో మోడీఫోబియా ఏదో కనిపిస్తోంది… తను పాలనపరంగా అనేక పిచ్చి నిర్ణయాలు తీసుకోవచ్చుగాక, ఇప్పటికీ సుపరిపాలన చేతగాకపోవచ్చుగాక… కానీ తన ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించాల్సిందే అనే ధోరణి మాత్రం ఓరకంగా పైత్యమే… ప్రతి దాన్నీ మోడీ మెడలో వేసి బదనాం చేయడం పిచ్చితనమే… కొత్తగా కేంద్రం ప్రతిపాదిస్తున్న సినిమా సర్టిఫికేషన్ చట్టంపై కొందరు గగ్గోలు చూస్తే అదే నిజమనిపిస్తోంది… కోలీవుడ్ యాంటీ మోడీ సెక్షన్ దగ్గర నుంచి బాలీవుడ్ దాకా పలువురు స్పందిస్తూ… కొత్త చట్టాన్ని తిట్టేస్తున్నారంటే… కనీసం వాళ్లు ఫీల్డ్‌కు సంబంధించినవాళ్లు, వాళ్ల భయసందేహాలను వ్యక్తం చేస్తున్నారులే అనే సమర్థన ఉంటుంది… అసలు ఫీల్డుతో సంబంధం లేనివాళ్లు కూడా మోడీ నిరంకుశత్వం, అరాచకం, దుర్మార్గం, భావప్రకటన స్వేచ్చకు గండి అంటూ రాసేస్తున్నారు, వీడియోల్లో ఏదేదో చెప్పేస్తున్నారు… నిజానికి ఆ చట్టం సినిమా నడ్డి విరిచే దారుణమేనా..? ఓసారి చెప్పుకోవాలి…
చిన్న చిన్న అంశాలు వదిలేస్తే, ప్రతిపాదిత కొత్త సవరణ చట్టం ప్రకారం… ఇకపై సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ అనేది అల్టిమేట్ కాదు, ఒకవేళ ప్రజల ఫిర్యాదులు పెరిగితే వివాదాస్పద సినిమాల సర్టిఫికేషన్ రద్దు చేసి, ఎక్కడా ప్రసారం, ప్రదర్శన జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు… సెన్సార్ బోర్డు గనుక సర్టిఫై చేయకపోతే, అప్పీల్ చేయడానికి గతంలో ట్రిబ్యునల్ ఉండేది, ఇప్పుడు దాన్ని రద్దు చేసేశారు… సెన్సార్ బోర్డు గనుక గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాల్సిందే… ప్రభుత్వం గనుక సినిమా ప్రదర్శనను నిలిపేసినా కోర్టుకు వెళ్లాల్సిందే… ఇవీ ఇప్పుడు కొందరి విమర్శలకు కారణమవుతున్న అంశాలు… ‘‘అంటే… ప్రభుత్వానికి నచ్చే సినిమాలు తీస్తేనే ప్రదర్శనకు అనుమతిస్తారు, లేదంటే నిలిపేస్తారు, ఇదెక్కడి అరాచకం, సినిమా ద్వారా జరిగే భావవ్యక్తీకరణకు గండిపడినట్టే… సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వ పెత్తనం నాన్సెన్స్’’ ఇదీ కొందరి అభ్యంతరం… మోడీ వ్యతిరేక పత్రికలు సంపాదకీయాలు కూడా కుమ్మేస్తున్నయ్…
Ads
నిజానికి సెన్సార్ బోర్డు ఒకసారి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందంటే… ఇక ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అనే వాదనే అబ్సర్డ్… సెన్సార్ బోర్డులు ప్రభుత్వ ఉద్దేశాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటాయా..? పైగా సెన్సార్ బోర్డుల యవ్వారాలు అందరికీ తెలిసినవే… ఒకవేళ ఏదేని సినిమా వల్ల సమాజంలో అశాంతి, హింస, విద్వేషం గట్రా ప్రబలితే… జాతి సంస్కృతికి వ్యతిరేకంగా ఉంటే… దేశ సార్వభౌమాధికారంపై తిరుగుబాటుకు ప్రేరేపిస్తే… ప్రభుత్వం సదరు సినిమా ప్రసారాన్ని, ప్రదర్శనను నిలిపివేయవచ్చు… సదరు నిర్మాత, దర్శకులను ప్రాసిక్యూట్ చేయవచ్చు… ఉన్నత స్థాయిలో కాదు, కలెక్టర్లు కూడా నిర్ణయం తీసుకోవచ్చు… ఒకవేళ కోర్టులు గనుక అంగీకరించకపోతే, కేంద్రం గనుక పట్టుదలగా ఉంటే అలాంటి సినిమాల్ని అడ్డుకునే అంశాన్న పార్లమెంటులో ఓ చట్టం చేయడం ద్వారా తేల్చుకుంటుంది… దేశంలో పార్లమెంటే కదా సుప్రీం…
ఇప్పుడూ అదే… 2000లో K.M.శంకరప్ప వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సెన్సార్ బోర్డు అనుమతే అంతిమం అన్నట్టుగా సుప్రీం అభిప్రాయపడింది… తరువాత కాలంలో సెన్సార్ ఇష్యూలపై ఏ ప్రభుత్వమూ పెద్దగా దృష్టి పెట్టలేదు… ఇప్పుడు ఓటీటీల్లో అశ్లీలం వరదలై పారుతోంది, వాటికి ఏ సర్కారు నియంత్రణా లేదు, డిజిటల్ ప్లాట్ఫారాలపైనా కంట్రోల్ లేదు… ఆ దిశగా ఆలోచిస్తూ, పనిలోపనిగా ఈ సెన్సార్ అంశాన్ని కూడా చేపట్టింది… సెన్సార్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా సరే, అవసరమైతే ప్రభుత్వం ఆయా సినిమాల అనుమతుల్ని రద్దు చేసే అధికారం కోసం ఉద్దేశించిన సవరణ చట్టం అది… ఏతావాతా చెప్పుకునేది ఏమిటంటే…. ఒకవేళ ఈ చట్టం లేకపోయినా సరే, ఏదైనా సినిమాను అడ్డుకోవాలంటే ప్రభుత్వానికి ఎన్ని మార్గాలు లేవు…!? అందువల్ల… ఈ చట్టంతో ఏదో ప్రజాస్వామ్యానికే పెద్ద నష్టం జరగబోతోంది అనే ఏడుపులు, పెడబొబ్బలు శుద్ధ దండుగ..!!
Share this Article