టీవీ చానెల్ పేరెందుకు గానీ… సింగర్ మంగ్లీ (సత్యవతి రాథోడ్) ఏదో దైవద్రోహానికి పాల్పడింది, ఆమెకు నిష్కృతి లేదు, నాశనమై పోతుంది అన్నట్టుగా సాగింది ఓ కథనం… గతంలో పలు సందర్భాల్లో మంగ్లీ వివాదాల పాలై ఉండవచ్చు గాక… కానీ ఈ విషయంలో మాత్రం మంగ్లీ తప్పేమీ లేదనిపిస్తోంది… ఏదో ఓ వివాదంలోకి నెట్టే ప్రయత్నం తప్ప…
వివాదం ఏమిటంటే..? ఈమధ్య మంగ్లీ హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవానికి హాజరైంది… ఎవరో జోగిని కూడా తోడున్నట్టుంది… తోడుగా చెల్లె ఇంద్రావతి (ఊ అంటావా సాంగ్ ఫేమ్) కూడా ఉంది… సంబరంగా స్టెప్పులు కూడా వేశారు, పాటలు పాడారు… అవును, గ్రామదేవతలు, ఆది శక్తుల ఉత్సవాలు అంటేనే సంబరం, ఉత్సాహం, ఉత్సవం… తప్పు లేదు…
అయితే మంగ్లీ ఈ సందర్భంగా గవ్వలు ధరించింది అనేది వివాదం… నిజానికి అదొక వివాదమే కాదు… వాటిని లక్ష్మి గవ్వలు అనీ అంటారు… ఎక్కువగా గ్రామదేవతలు పూనే మహిళలు ఎక్కువగా ధరిస్తుంటారు వాటిని… ఆ గవ్వల దండల్ని పవిత్రదండలుగా పరిగణిస్తారు… అది బలమైన విశ్వాసం, కాదనేది లేదు… అది నమ్మేవాళ్ల విశ్వాసం…
Ads
కేవలం శిగాలూగేవాళ్లు, దేవతలు తమపైకి వచ్చే (అంటే పూనేవాళ్లు) మాత్రం ధరించాలా..? నిజానికి అలా నిర్దిష్ట నిబంధన ఏమీ లేదు, ఉండదు… ఎవరుపడితే వాళ్లు ధరిస్తే, అవి ధరించినవాళ్లు తీవ్రంగా నష్టాలకు గురికావల్సి ఉంటుంది అని ఒకామె సీరియస్‌గా చెబుతోంది… ఓ పూజారి, ఓ భక్తిసరుకుల వ్యాపారి, ఓ ట్రస్టు మెంబర్ అదే చెబుతున్నారు…
కానీ ఇందులో దేవతలను గానీ, మనోభావాల్ని గానీ కించపరుస్తున్నది ఏమీ లేదు… పైగా మంగ్లీ తన భక్తి విశ్వాస ప్రకటన బహిరంగంగా ధైర్యంగా ప్రదర్శిస్తోంది… డాన్స్ చేస్తోంది… కట్టు బొట్టు పక్కా ట్రెడిషనల్… బోనాల పండుగను నిజమైన ఉత్సాహంతో ఉత్సవంగా పరిగణిస్తోంది… దీంట్లో పబ్లిసిటీ కోరిక గానీ, అటెన్షన్ తాపత్రయం గానీ ఏమీ లేవనే అనుకోవాలి… ఎందుకంటే..? ఆ సిస్టర్స్‌కు వేరే పబ్లిసిటీ అక్కర్లేదు…
వాళ్లు ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీస్… పైగా మంగ్లీ తన ఊళ్లో ఓ గుడి కట్టించి మెయింటెయిన్ చేస్తోంది… సంపూర్ణంగా తను హిందూ దేవతల్ని ఆరాధించే కేరక్టర్… అక్కలాగే చెల్లెలు కూడా… మంగ్లీ ఇక్కడే కాదు, ప్రతి శివరాత్రి రోజూ ఇషా ఫౌండేషన్ నిర్మించిన ఆదిగురువు విగ్రహం దగ్గర జరిగే ఉత్సవంలో పాటలు పాడుతుంది కూడా… ఇక్కడ తన ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి తప్ప… పాత పంచాయితీలతో లింక్ చేయకూడదు…
ఆమె నిజమైన భక్తిపరురాలు… ప్రతి పండక్కీ ఓ పాట రిలీజ్ చేస్తుంది… తనే డాన్స్ చేస్తుంది, తనే పాడుతుంది… తనే రిలీజ్ చేస్తుంది… తన భక్తి విశ్వాస ప్రకటనను ఓ వివాదంలా క్రియేట్ చేయాల్సిన పనేలేదు..! ఒక్కటి చెప్పండి, హైదరాబాదులోనే బతికే బోలెడు మంది పాటగత్తెలు, పాటగాళ్లు హైదరాబాదులో అతి పెద్ద పండుగగా పరిగణించే బోనాల సందర్భంగా బోనమెత్తి ఎందరు కనిపించారు..?, కనీసం గుళ్లల్లో కనిపించారా..? మరి ఆమె అలా కనిపిస్తే దాన్నెందుకు వివాదంగా మారుస్తున్నట్టు..!!
Share this Article