టీవీ9 దేవి మీద విపరీతంగా ట్రోలింగ్ సాగుతోంది… తెలుగు నెటిజనం తీవ్ర స్థాయిలో వెక్కిరిస్తున్నారు… ఎందుకు..? ఆమె ఆకాశం అనే పదానికి కాస్త గంభీరంగా ఉంటుందనే భావనతో రుధిరం అనే పదాన్ని వాడి, ఎడాపెడా ఒక న్యూస్ ప్రజెంట్ చేసింది నిన్నోమొన్నో… తప్పు, తప్పున్నర… ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పేమీ కాదు… అయితే ఏ స్థాయిలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తున్నదో ఆ స్థాయిలో సపోర్ట్ ఏమీ దొరకడం లేదు ఆమెకు… కొన్నిగొంతులు తప్ప..! ఎందుకు..? ఆమె గతంలో కూడా నీటి గురుత్వాకర్షణ శక్తి అంటూ ఏవేవో పిచ్చి వ్యాఖ్యలు చేసింది సేమ్, ఇలాంటి భారీ వర్షాల వార్తలోనే… ఎస్, ఆమెకు తెలుగు సరిగ్గా తెలియదు, ఏ పదాన్ని ఎలా వాడాలో తెలియదు, పదాల్ని వాడేముందు వాటి అర్థాలేమిటో తెలుసుకోవాలనే సోయి కూడా లేదు… అన్నింటికీ మించి నాకన్నీ తెలుసులే అనే ఓ భావన బలంగా కమ్మేసినట్టుంది… దాన్నలా కాసేపు పక్కన పెట్టి… అసలు ఆమె రుధిర వివాదం చూద్దాం ఓసారి…
ఒకసారి ఆమెకు సపోర్టుగా నిలబడిన ఓ గొంతు పరిశీలిద్దాం… మచ్చుకు… ఎవరినీ తప్పుపట్టడానికి కాదు…
హైదరాబాద్‌లో భారీ వర్షాల గురించి చెబుతూ టీవీ 9 న్యూజ్‌యాంకర్, ‘రుధిరం ఏమైనా ఊడిపడుతోందా? రుధిరం ఏమైనా పగబట్టిందా? రుధిరం చేస్తున్న రణం మనం తట్టుకోగలమా?’ అని ఆదివారం పెద్ద గొంతుతో అన్న మాటలను– కొందరు నిన్నటి నుంచీ ఉతికి ఆరేస్తున్నారు. ఈ శ్రావణమాసం ముసురులో ఎంత ఉతికి ఆరేసినా ఆరడం లేదు. మురికి బట్టను బండకేసి బాదినట్టు ఈ మాటను ఎంతగా కొట్టి అరగదీస్తున్నారంటే, శ్రీశ్రీ బంధువైన శ్రీరంగం నారాయణబాబు రాసిన రుధిర జ్యాల పుస్తకం పాత తరానికి గుర్తుకొస్తోందట. ఈ టీవీ 9 అమ్మాయి మాటలను ఎవరూ ఊహించని స్థాయిలో పదే పదే గుర్తుచేస్తున్నారు. ఒకే నిమిషంలో నాలుగుసార్లు రుధిరం అన్న పాపానికి ఆమె చాలా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. జోరు వానలో ఇంతటి పొగ పుట్టించిన ఈ న్యూజ్‌రీడర్ నాకు తెలిసి– ముళ్లపూడి వెంకటరమణ మనవరాలు కాదు. విశ్వనాథ సత్యనారాయణగారి ముని మనవరాలు అంతకన్నా కాదు. ఇంకా, ఇటీవల బులెట్ బండి పాటతో పాపులర్ అయిన మోహనా భోగరాజు లేదా ఆమెకు సూపర్ సీనియర్ సునీత ఉపద్రష్ఠకు చుట్టం కూడా కాదు. పోనీ, సిరివెన్నల సీతారామాశాస్త్రి లేదా ఆయన శిష్యుడు దరివేముల రామజోగయ్య శాస్త్రికి కూడా ఈమె బంధువయ్యే అవకాశం ఉందా అంటే–అదీ లేదు. తల్లి కడుపులో ఉండగానే అక్షరాలు నేర్చుకునే కుటుంబాల్లో ఆమె పుట్టినట్టు కనిపించడం లేదు. ఈ లెక్కన ఆమె తప్పును దొడ్డ మనసుతో మన్నించేయవచ్చేమో ఆలోచించండి. ఇక నుంచైనా ఆ నెత్తురు సంగతి ఎత్తడం మానేస్తే మేలేమో చూడండి.
ఇక అసలు విషయంకన్నా ముందు మరో ఆఫ్ బీట్ సంగతి చెప్పుకుందాం… ఆమె డైవర్సీ అనుకుంటా… బిగ్‌బాస్ గత సీజన్‌లో కంటెస్టెంట్… నిజానికి ఆమె మెంటాలిటీకి అది ఏమాత్రం సూట్ కాదు… సరే, వెళ్లింది, కొన్నాళ్లు ఉండి వచ్చింది… కానీ నెవ్వర్… ఒక్క రోజు కూడా ఆ బిగ్‌బాస్ ట్యాగ్ మోస్తూ ప్రచారానికి గానీ, ఇతర ప్రోగ్రాముల్లోకి వెళ్లి పిచ్చి వేషాలు వేసింది కానీ లేదు… గ్రేట్… బిగ్‌బాస్ అంటేనే ఓ విశ్వాసరాహిత్య డ్రామా అని తెలిశాక ఆమె ఇక ఆ పేరు ఉచ్చరించలేదు… చూస్తున్నాం కదా, బోలెడు మంది బిగ్‌బాస్ ట్యాగ్ మోస్తూ, వాడుకుంటూ ఇతర ప్రోగ్రాముల్లోకి అయిదారు వేలకు కూడా కక్కుర్తిపడి, జొరబడి, నానా ఎదవ్వేషాలు వేస్తున్న తీరు… దేవి ఒక్క నిమిషం కూడా అలా ప్రవర్తించలేదు… ఆమె టెంపర్‌మెంట్ నచ్చింది… అయితే ఈ రుధిరం, నీటి గురుత్వ శక్తి వంటి అపూర్వ జ్ఞానాన్ని సమర్థించాలా..?
అవసరం లేదు… తప్పు తప్పే… కాకపోతే జరుగుతున్న ట్రోలింగ్ దేవి మీద కాదు… టీవీ9 భాష మీద, దాని పోకడ మీద, దాని పాత్రికేయ ప్రమాణాల మీద… శ్రీదేవి మరణం సమయంలో బాత్‌టబ్ డ్రామా చూశాం కదా, అంతెందుకు చానెల్ లీడ్ చేసే రజినీకాంత్ డిబేట్ల మీద చాలామందికి ఏవగింపు కూడా ఉంది… తన జ్ఞానస్థాయి ఏమిటో ‘ఆటోస్పై’ ఎపిసోడ్ నిరూపించింది… అనేకానేక టీవీ9 పాత్రికేయ దోషాలతో పోలిస్తే దేవి చేసింది, కూసింది నథింగ్… న్యూస్ ప్రజెంట్ చేసే సమయంలో ఒత్తిడి కూడా ఉంటుంది… అవన్నీ పక్కన పెడితే అసలు మొత్తం టీవీ వార్తల ధోరణి, స్థాయి కదా మనం చర్చించాల్సింది… డిబేట్ల దగ్గర్నుంచి వార్తల ప్రజెంటేషన్ వరకూ… భాష తెలియదు, వర్తమాన వ్యవహారాల మీద జ్ఞానం ఉండదు, ప్రేక్షకుల్ని పిచ్చి ఎదవల్లా పరిగణిస్తారు… అంతెందుకు, ఇదే టీవీ9 500 కోట్లతో కొన్న ఓనర్ దాన్ని ప్రక్షాళనో, సంస్కరణో చేసుకోలేకపోయాడు… అలాంటి ఓనర్ల చేతుల్లో ఉన్నయ్ మీడియా సంస్థలు… మిగతా టీవీల డిబేట్లు, ప్రజెంటేషన్ గురించి చెబితే అది ఓ పెద్ద కంపు బాగోతం… సో, దేవిది ఒక కోణంలో చిన్న తప్పు… మరోకోణంలో చూస్తే ఆమె పనిచేసే తెలుగు మీడియా వాతావరణమే పెద్ద తప్పు… తప్పున్నర…!!
Share this Article