సార్, వరి విత్తనాలు అమ్మితే ఊరుకోను అంటున్నారు కదా… సూపర్ సార్… వరి వేసినా, వాళ్లకు ఎరువులు అమ్మినా, పురుగుమందులు అమ్మినా, చివరకు ఆ పొలాల్లో కూలీకి వెళ్లినా ఊరుకోరా..? ప్రత్యేక బృందాలు వేసి నిఘా పెట్టేస్తారా..? కఠిన చర్యలకు ఆదేశిస్తారా..? క్లారిటీ ఇవ్వాల్సింది సార్… సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పినా ఊరుకోను అంటున్నారంటే మీ కమిట్మెంట్ నిజంగా సూపర్… అసలు సివిల్ సర్వీస్ కమ్యూనిటీ మొత్తం గర్వపడాలి… అంతెందుకు, ఈ స్థాయిలో తిండిగింజల సాగుపై నిషేధాన్ని అమలు చేయగల సర్కారు ప్రపంచంలో బహుశా ఇదొక్కటేనేమో… మీ బాసేమో మేం వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్‌వన్ అని నిన్న ప్లీనరీలో గొప్పలు చెప్పుకున్నాడు, ఐనాసరే మీరు వరిపై ఈ రేంజ్ ఆగ్రహప్రకటన చేస్తున్నారంటే మీ నిబద్ధత ఎంతైనా ప్రశంసనీయం…
ఊరుకోవద్దు సార్, మీరు వెనక్కి తగ్గొద్దు… లేకపోతే వరి రైతులకు ఎంత ధైర్యం..? వరి విత్తన విక్రేతలకు ఎంత ధైర్యం..? హమ్మా… వరి వేస్తే ఇంకేమైనా ఉందా..? అది గంజాయి సాగుకన్నా డేంజర్ కదా సార్… వీళ్లు పండిస్తారు, ఆ మోడీ కొనడు, అందరూ సర్కారును నిందిస్తారు, సో, వరి సాగే వద్దంటే సరి… ఆహా, ఏం ప్రణాళిక..? ఏం పాలన..? అవును గానీ, రాష్ట్రంలో వరిసాగుపై ఉక్కుపాదం మోపాలి, ఉగ్రరూపం ప్రదర్శించాలి అని ఏమైనా అధికారిక నిషేధాన్ని విధించారా సార్..? ఆర్డర్స్ ఏమైనా పాస్ చేశారా..? ఐనా, రైతులు వరిసాగు చేయడం ఏమిటి సార్..? ఏదో చేతకాకపోయినా సరే పత్తి లేదంటే మిర్చి వేయాలి, నష్టమొస్తే ఉరిపెట్టుకోవాలి గానీ… ఈ మొక్కజొన్న, ఈ వరి సాగు చేయడం ఏమిటి..? వెంటనే మన డప్పు రచయితలతో ప్రత్యేక వ్యాసాలు రాయించి అచ్చేయించాలి సార్… అవసరమైతే పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు వేయించాలి, టీవీల్లో డిబేట్లు రన్ చేయాలి… వరి వేస్తే ఎంత ద్రోహమో టాంటాం చేయాలి… తిండిగింజలు పండించడం ఎంత దుర్మార్గమైన నేరమో చైతన్యప్రచారాలు కూడా చేయించాలి…
వీలైతే కోర్టులు అడ్డం పడకుండా చట్టమే చేసేస్తే సరి… సార్, గడ్డి విత్తనాలు అమ్ముకుంటే పర్లేదు కదా సార్..? క్లారిటీ ఇవ్వడం బెటర్..! వరి వేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా కూడా కట్ చేస్తారా సార్..? లేకపోతే ఏమిటి సార్..? ఈ రైతులకు మరీ అలుసైపోయింది, జాతికి తిండిగింజలు పండిస్తారట… అందరి కడుపులూ నింపుతారట… ఎంత ద్రోహం..?! మీరు తగ్గొద్దు సార్, స్థిరంగా ఉండండి, సుప్రీంకోర్టు మాత్రమే కాదు, అంతర్జాతీయ న్యాయస్థానం ఇన్వాల్వ్ అయినా సరే… ఒకటే నినాదం… వరి వేస్తే ఖబడ్దార్…!! మరి ఏం సాగు చేయమంటారు సార్ అని అమాయకంగా మొహాలు పెట్టి అడుగుతారేమో, పఢావ్ పెట్టుకొండి అని మాత్రం చెప్పకండి ప్లీజ్… అసలే వ్యవసాయం ఓ వృత్తి కాదు, మన జీవనవిధానం అని అందరూ లేనిపోని నీతులు చెబుతారేమో… మీరు మాత్రం వెనక్కి తగ్గొద్దు సార్…
Share this Article