చిన జియ్యర్‌తో మైహోం రామేశ్వరరావుకు ఎక్కడ చెడింది..? రామేశ్వరరావుకూ కేసీయార్‌కూ ఎక్కడ చెడింది..? అసలు చిన జియ్యర్‌కు కేసీయార్‌కు ఎక్కడ చెడింది..? ఈ త్రికోణ భుజాలు వేర్వేరు సరళ రేఖలు ఎలా అయ్యాయి..? లోకంలో ప్రధానంగా మనుషుల్ని కలిపి ఉంచేది, విడదీసేది ఆర్థికమే కాబట్టి, అదేదో డిస్టర్బ్ అయ్యిందీ అనుకుందాం, దాన్ని కాసేపు వదిలేద్దాం… అసలు లోగుట్టు బయటికి రావడం కష్టం… కానీ ఈ కథనం చదివే ముందు చిన జియ్యర్ పేరు ఓసారి చదవండి, కాసేపు గుర్తుంచుకొండి… ఆయన పేరు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ చిన జియ్యర్ స్వామి… అది వ్యవహారనామం… అసలు పుట్టుకతో వచ్చిన పేరు చిలకమర్రి నారాయణాచార్యులు…
ఇందులో త్రిదండి అనేది ఆ పీఠం నుంచి సంక్రమించిన పేరు… త్రిదండం అంటే మూడు దండాలూ కలిపి, ఒక్కచోట కట్టేసి, ఎప్పుడూ చేతితో పట్టుకునే విశిష్టాద్వైత ప్రతీక లేదా సూచిక… రామానుజ అనేది పీఠం పేరు… జియ్యర్ అనేది ఓ తమిళపదం… వైష్ణవ సంప్రదాయంలో ముఖ్య ఆచార్యులను అలా పిలుస్తుంటారు… ఆ భాషలో సుపీరియర్ పర్సన్ అని అర్థం… శ్రీమన్నారాయణ అనేది తన పేరు… తన పేరంటే తనకు మహా ప్రీతి… తను ఎక్కడికి వెళ్లినా ఆ పదాన్ని పాపులర్ చేయాలని తపనపడుతుంటాడు…
నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ… ఇవీ ఆయన ఉపదేశించే ప్రధాన మంత్రాలు… ఆయనది వైష్ణవంలోనే తెంగల్ పరంపర… తిరుపతిలో వైఖానసం… అక్కడి ఆగమం వేరు, అక్కడ ఇద్దరు ఆస్థాన జియ్యర్లు కూడా ఉంటారు… ఈయన అక్కడికి వెళ్లి నమో నారాయణాయ పఠనం డిమాండ్ చేస్తాడు… కానీ అక్కడి దేవుడి పేరుతో నమో వెంకటేశాయ తప్ప మరొకటి ఉచ్చరించబోమనీ, బయట పీఠాధిపతులు తిరుమల అర్చనల విషయంలో కలుగజేసుకోవడం పద్ధతి కాదని వాళ్లు తిరస్కరించారు… అదొక వివాదం…
భద్రాచలం వెళ్తాడు… సీతారామ కల్యాణంలో రాముడిని రామనారాయణుడిగా మార్చాడు… ప్రవర మార్చేశాడు… అదొక వివాదం… ఇప్పటికీ తెగడం లేదు… రామభద్రుడు, రామచంద్రుడు, సీతారాముడు, దశరథరాముడు ఇవీ జనం నోళ్లలో నానే నామాలు… చివరకు శ్రీరామదాసు సినిమాలో కూడా ‘‘మోక్ష నారాయణుడు’’ అనే పదాన్ని పాపులర్ చేయించాడు ఈ జియ్యరుడు…
ధర్మపురి వెళ్తే నరసింహస్వామి వేరుగా, లక్ష్మి వేరుగా ఉండాలంటాడు… అక్కడి అయ్యవార్లు ఖండితంగా వ్యతిరేకించారు… అడ్డుకున్నారు… అదే పంథాను యాదగిరిగుట్టలోనూ ప్రయత్నించాడు… నిజానికి ఉగ్రనరసింహుడి పక్కనే అమ్మవారు ఉంటే తను శాంత నరసింహుడిగా భక్తులను ఆశీర్వదిస్తాడని ఓ నమ్మకం… యాదగిరిగుట్ట పేరును యాదాద్రి అని మార్చాడు… పూజార్లకు కూడా నమో నారాయణాయ, జైశ్రీమన్నారాయణ ఎక్కించాడు బాగా…
Ads
అప్పట్లో చిన జియ్యర్ ఏది చెబితే అది కేసీయార్‌కు వేదం… ఆయన చెప్పినట్టుగా పాటించాలని చెప్పేవాడు… కానీ ఇప్పుడు కథ మారింది కదా… రివర్స్‌లో నడుస్తోంది… ఆలయ పునఃప్రారంభానికి ఏ పీఠాధిపతీ రాడు, మీరే అన్నీ నిర్వహించుకోవాలని స్థానిక అర్చకులకు క్లియర్‌గా చెప్పాడు కేసీయార్… ఈవోతో కూడా ‘‘ఎవరినీ పిలవడం లేదు, ఎవరైనా రావచ్చు’’ అనే స్టేట్‌మెంట్ ఇప్పించాడు… అంతా జియ్యర్‌ను కట్ చేయడం… దాంతో స్థానిక అర్చకులే అన్ని పూజలు, మహాకుంభ సంప్రోక్షణ స్వయంగా నిర్వహించుకున్నారు…
బయటి నుంచి వెళ్లిన వాళ్లకు మైకులిచ్చి మంత్రోచ్ఛారణ చేయాలని చెప్పారు అంతే… అంతేకాదు, కేసీయార్ చిన జియ్యర్ ఎక్కించిన ఆ జైశ్రీమన్నారాయణ, ఓం నమో నారాయణాయ మంత్రాలను కూడా పాటించాల్సిన అవసరం లేదని చెప్పాడు… అంతే, కత్తెర అంటే అంతే మరి… ఓం నమో నారసింహాయ… ఇదే నిత్యం, ఇదే మంత్రం ఇకపై..! నిజానికి వైష్ణవులే పెద్దగా శ్రీమన్నారాయణ నామాన్ని పెద్దగా పఠించరు… ఈ చిన జియ్యరుడు తన నామాన్ని, పనిలోపనిగా విష్ణునామాన్ని ఇలా ప్రమోట్ చేస్తున్నాడు… యాదాద్రి బదులు యాదగిరిగుట్ట అనే పాత పేరునే ఇకపై ప్రాచుర్యంలోకి తీసుకురాబోతున్నారు… శుభం…!
కథలో నీతి :: ఎంతటి రాజగురువులకైనా పరిమితులు ఉంటయ్… తమ పునాదులకు ఢోకా లేకుండా ఆ పరిమితుల్లోనే రాజులకు సలహాలు ఇవ్వాలి… రాజులకు కోపం వస్తే గురువులు మారతారు, గురు స్థానాలూ మారిపోతయ్… ఈ ఒక్కటీ చిన జియ్యరుడు గుర్తించలేకపోయాడు… ఫలితంగా ఏ గుడి పునర్నిర్మాణానికి తాను స్వయంగా ఆధ్యాత్మిక సారథ్యం వహించాడో, తీరా ఆ తలుపులు తెరుచుకునేవేళకు తనే ఎవరికీ ఏమీ గాకుండా అయిపోయాడు… రాజులు తలుచుకుంటే దేవుళ్లు కూడా అడ్డుచెప్పరు స్వామీ… ఇది క్షేత్రసత్యం… అనగా ఫీల్డ్ రియాలిటీ అని అర్థం…!!
ఇక కర్తవ్యం..? చాణుక్యుడిలా పిలకముడి విప్పేసి, భీషణ శపథం చేసేసి, ఢిల్లీ పాదుషాలతో చేతులు కలిపి మంత్రాంగం రచించడమే… కానీ మన నయా నిజాం చాణ్యుడికే తాత… మరెలా స్వాములూ..!!
Share this Article