గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజైనా ఆయనకున్న ప్రాధాన్యం పొట్టివాడు, గట్టివాడు అయిన ఈయనకు లేక పోవడం విచారకరం. గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినమే కాదు, ఆయన వర్థంతిని కూడా తలచుకునే తీరిక, జ్ఞాపకం కూడా నేటి రాజకీయ నాయకులకు లేకపోవడం బాధాకరం.
ఆయన ఇప్పటి రాజకీయాలకు పనికిరారు గనుక, ఈ నాయకులకు వారి విషయం తెలీదు గనుక, ఆయన పేరు చెబితే ఓట్లు రాలవు గనుక… ”జై జవాన్ – జై కిసాన్” నినాదాన్ని దేశానికి ఇచ్చిన భారత దేశ రెండవ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, 1904 అక్టోబర్ 2న జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా నేడే.
శాస్త్రి మరణించి 57 ఏళ్లయినా ఇప్పటికీ ఆయన మృతిపై ముసురుకున్న అనుమానాలకు తెరపడలేదు. 1965లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తరువాత 1966 జనవరిలో శాస్త్రి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో భేటీ అయ్యేందుకు సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ వెళ్లారు. భారత్, పాక్‌ల సంయుక్త ప్రకటనపై ఆయన సంతకం చేసిన కొద్ది గంటల్లోనే మరణించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మరణంపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు.
Ads
ఇదిలా ఉండగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, శాస్త్రి మరణం మధ్య సంబంధం ఉందంటూ.. దీనికి సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సుప్రీంకోర్టు న్యాయవాది అనూప్ బోస్ 2016 డిసెంబరు 7న లా జెడ్ మ్యాగజీన్‌లో ‘ట్రాజిక్ డెత్ ఆఫ్ లాల్ బహుదూర్ శాస్త్రి అండ్ ది మిస్టిఫైయింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యాంగిల్’ అంటూ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.
తాతతో పాటు అమ్మమ్మ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లేవారని.. కానీ, రష్యా పర్యటనకు ఆమె వెళ్లలేదని శాస్త్రి మనవడు సంజయ్ తెలిపారు. తాష్కెంట్‌లో హోటల్ బుక్ చేయాలనుకున్నారు. అయితే, ఆయనకు సోవియట్ ప్రభుత్వం ఒక కాటేజ్ కేటాయించింది. అందులో టెలీప్రింటర్, టెలిఫోన్ కూడా లేవు. మృతదేహం దిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఆయన ఒంటిపై గాట్లు ఉన్నాయి. అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది. పెదాలకు నెయ్యి పూసింది. అప్పుడు నెయ్యి నీలిరంగులో కనిపించింది. ఆయన వ్యక్తిగత డైరీ, ఆయన రోజువారి కార్యక్రమాలను రాసుకొనే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదు అని సంజయ్ తెలిపారు… ఇంతకీ శాస్త్రి ఎలా మరణించారు..? నేతాజీ మరణంలాగే ఇక ఇదీ ఎప్పుడూ తేలని మిస్టరీయేనా..? —- నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్, 98481 28215.
Share this Article