డైమండ్ రత్నబాబు… ఈయన మూవీ దర్శకుడు… గతంలో మోహన్‌బాబుతో సన్నాఫ్ ఇండియా తీసిన మొనగాడు… మబ్బుల్లో తిరిగే మోహన్‌బాబును కాలర్ పట్టుకుని నేల మీదకు తీసుకొచ్చిన సినిమా… ఓహో, సినిమా ఇలా కూడా తీస్తారా అని అందరూ హాహాశ్చర్యపోయిన సినిమా… అఫ్‌కోర్స్, అది వాళ్ల సొంత సినిమా… ఏ దర్శకుడిని పెట్టుకుంటేనేం… అనుకుని తెలుగు ప్రేక్షకుడు నిట్టూర్చాడు… అయిపోయింది…
ఎహె కాదు, అయిపోయింది కాదు, రత్నబాబు ఎంత లక్కీ అంటే మరో సినిమా దొరికింది… సారీ, ఓ నిర్మాత దొరికాడు… సన్నాఫ్ ఇండియా సినిమా చూశాక కూడా ఒకాయన దర్శకుడిగా చాన్స్ ఇచ్చాడు… ఫాఫం… నిజానికి అదొక్కటే కాదు అన్‌స్టాపబుల్ సినిమా విశేషం… ఆ టైటిల్‌ను అసలు బాలయ్య ఎలా వదిలేశాడో అర్థం కాదు… ఈ టైటిల్ బాలయ్య యాక్షన్ సినిమాకు పర్‌ఫెక్టుగా సూటవుతుంది… పైగా ఇదే పేరుతో బాలయ్య హోస్టింగుతో ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చేసిన చాట్ షో సూపర్ సక్సెసైంది కూడా…
సరే, టైటిల్ వెళ్లిపోయింది సరే, ఇందులో వీజే సన్నీ హీరో… అక్కడే రత్నబాబు మళ్లీ తెలుగు ప్రేక్షకులను మళ్లీ బుక్ చేశాడు… సన్నీ అంటే తెలుసు కదా… బిగ్‌బాస్ టైటిల్ విజేత… ఆ హౌజులోనే తన ఓవరాక్షన్ చూస్తుంటే చికాకేసేది… సరే, బిగ్‌బాస్ షో ముందస్తు ఒప్పందాలు, దాన్ని బట్టే స్క్రిప్టులు, విజేతలు గట్రా తేలుస్తారు కాబట్టి ఆ కథ వేరు… అందులో ఎలా చేసినా చెల్లుతుంది… కానీ థియేటర్‌లో ఓ ఫీచర్ ఫిలిమ్ రిలీజ్ చేయాలంటే చాలా లెక్కలుంటాయి…
Ads
వాటిల్లో ముఖ్యమైంది హీరో అనే పాయింట్… సన్నీ బేసిక్‌గా నటనలో పూర్… అత్తెసరు నటన అంటే పెద్ద పెద్ద వారసహీరోలకు చెల్లుతుంది గానీ సన్నీకి ఆ నేపథ్యం లేదుకదా పాపం… శృతి కలవలేదు… అన్‌స్టాపబుల్ తారాగణం అంతా ఇంతే… ఎవరినీ దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు… నక్షత్ర ఇంప్రెసివ్ కాదు… అక్సాఖాన్ మంచి డాన్సరే తప్ప సినిమా భాషలో చెప్పాలంటే హీరోయిన్ మెటీరియల్ కాదు… సప్తగిరి, షకలక శంకర్ అనుభవం, టైమింగ్ సరిగ్గా వాడుకునే కథ, పాత్రలుంటే ఇరగదీస్తారు… ఇందులో అదీ లేదు…
డైలాగ్స్, పాటలు, బీజీఎం, కథనం, సినిమాటోగ్రఫీ గట్రా ఏం మెచ్చుకుందామన్నా ఎవరూ చాన్సివ్వలేదు దానికి… పోసాని, బిత్తిరి సత్తి, చమ్మక్ చంద్ర మరీ దండుగ కేరక్టర్స్… వీళ్లలో చమ్మక్ చంద్రకు నటన తెలుసు… ఏదో పొరపాటున డ్రగ్స్ ఇష్యూలో దొరికిపోయిన ఇద్దరు స్నేహితుల కథే అన్‌స్టాపబుల్… కథ, కథనం వెరీ పూర్… అన్‌స్టాపబుల్ ఎక్కడ స్టాపవుతుందో అంటూ చూస్తుంటారు థియేటర్ ప్రేక్షకులు ఆశగా… కానీ దర్శకుడు చాన్స్ ఇస్తేగా… చావగొట్టి వదిలాడు…
ఈమాత్రం పాత్ర గురించి ఇదే సన్నీ మీడియా మీట్‌లో ఏమన్నాడో తెలుసా..? బిగ్‌బాస్ అయ్యాక కనీసం 30 కథలు విన్నాడట… ఇది తెగనచ్చేసిందట… ఈ ఎచ్చులకు సినిమా ఇండస్ట్రీలో ఢోకా ఏముంటుంది..? సన్నీ దాన్ని మాత్రం భలే పట్టేసుకున్నాడు… చివరగా… సంగీత దర్శకుడు బీమ్స్ ఈమధ్య కొన్ని సూపర్ హిట్ పాటలు ఇచ్చాడు… ఈ సినిమాలో కూర్చిన పాటలు వింటే మాత్రం… నిజంగా బీమ్సేనా ఈ సినిమాకు సంగీత దర్శకుడు అని హాశ్చర్యపోవడం మన వంతు… వెరసి, ఓటీటీలో, టీవీలో కూడా చూడాల్సిన అవసరం లేని సినిమా ఇది… పాపం శమించుగాక…
Share this Article