చదివేస్తే ఉన్న మతిపోయింది అన్నట్టుంది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… ఫస్ట్ సీజన్ బ్రహ్మాండంగా క్లిక్కయింది… ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు… బాలయ్య ఓ కొత్త బాలయ్యగా ఫుల్ ఎంటర్‌టెయిన్ చేశాడు… తీరా సెకండ్ సీజన్ వచ్చేసరికి శృతి తప్పింది… చంద్రబాబును తీసుకువచ్చాడు… అంతే…
ఎవరిని తీసుకురావాలో ఆ టీంకు అర్థం కావడం లేదు… బాలయ్య షో అంటే ఓ రేంజ్ ఉంటుంది, ఎవరిని పడితే వాళ్లను తీసుకురాలేరు… ఏదో కిందామీదా పడి సిద్ధూ, శేషు, శర్వా, విష్వక్‌లతో మరో రెండు ఎపిసోడ్లు నడిచాయి… ప్చ్… మరీ శర్వా, శేషు ఎపిసోడ్ అయితే కరణ్ జోహార్ బాపతు బూతు చాట్ షో బాటలోకి వెళ్లబోయి ఆగిపోయింది…
ఎవరూ రావడం లేదు, దాంతో అన్‌స్టాపబుల్ కాస్తా స్టాపబుల్ అయ్యేట్టుంది అని వ్యంగ్య వ్యాఖ్యానాలు మొదలయ్యాయి… ఎపిసోడ్‌కూ ఎపిసోడ్‌కూ నడుమ బోలెడంత గ్యాప్ వస్తోంది… నిజానికి ఎన్టీయార్ కొడుకుగా, చంద్రబాబు వియ్యంకుడిగా తను సినిమా, రాజకీయాలతో సంబంధాలు గట్టిగా పెనవేసుకుని ఉన్నవాడే… ఆ బ్లడ్డు, బ్రీడు అహం తప్ప పెద్దగా వేరే కల్మషం కనిపించదు తనలో…
Ads
సో, నిజాం కాలేజీలో తనతోపాటు చదువుకున్నవాళ్లు, రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్లు, తనతో క్రికెట్ ఆడుకున్నవాళ్లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిలను పిలుచుకొచ్చాడు… నిజానికి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒకప్పుడు స్పీకరే… ఇద్దరూ కాస్త రిజర్వ్‌డ్‌గా ఉండేవాళ్లే… కానీ బాలయ్యే గిలిగింతలు పెట్టేసరికి కాస్త హుషారు మూడ్‌లో కనిపించారు… అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి తెరమీద కనిపించక, లైమ్ లైట్‌లో కనిపించక (ఇల్లు, నిజాం క్లబ్… ఇదే లైఫ్) చాన్నాళ్లయింది…
గుడ్… బాలయ్య చదువుకున్నప్పటి ముచ్చట్లు కాబట్టి, అవీ హైదరాబాద్ నిజాం కాలేజీ ముచ్చట్లు కాబట్టి సరదాగానే సాగి ఉండవచ్చు షో… ఎటొచ్చీ మధ్యలో ఈ కాంబినేషన్‌లోకి రాధిక ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న… ఆమెకు తెలుగు రాజకీయాలతో సంబంధం లేదు… (భర్త శరత్‌కుమార్ పెట్టి తమిళ పార్టీ ఎఐఎస్ఎంకే ఉపాధ్యక్షురాలు ఆమె… ఆ పార్టీకి తమిళనాట పెద్దగా ఆదరణ కూడా లేదు)…
నిజాం కాలేజీ చదువుతో అస్సలు సంబంధం లేదు… ఆమె తమిళ యాక్టర్, కమెడియన్ ఎంఆర్ రాధ బిడ్డ… తల్లి శ్రీలంక పౌరురాలు… మొదట్లో ప్రతాప్ పోతన్, తరువాత రిచర్డ్ హార్డీతో పెళ్లిళ్లు… రెండూ రెండేసి సంవత్సరాలకే పెటాకులు… తరువాత శరత్‌కుమార్‌తో పెళ్లి, ఇరవయ్యేళ్లుగా బంధం కొనసాగుతోంది… అన్నింటికీ మించి బాలయ్యతో ఏ సినిమాలోనూ నటించలేదు ఆమె… ఈ చాట్‌లో బాలయ్య కూడా అదే ప్రస్తావించినట్టున్నాడు…
సో, ఏరకంగా చూసినా బాలయ్య, కిరణ్‌కుమార్, సురేష్‌రెడ్డిల నడుమ రాధిక ఫిట్ కాదు… మరెందుకు ఆమెను అకస్మాత్తుగా ఈ ఎపిసోడ్‌లోకి తీసుకువచ్చారో అర్థం కాదు… నిజానికి రాధిక ఒక్కతే గెస్టుగా వస్తే అదిరిపోయేది… ఆమె సుదీర్ఘ సినిమా- టీవీ అనుభవం, స్పాంటేనిటీ ఆసక్తికరంగా సాగేవి… అనవసరంగా ఈ వింత కాంబినేషన్‌లో ఇరికించి అటూఇటూ గాకుండా చేశాడు బాలయ్య…!!
ఏమాటకామాట… కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వచ్చాక వైఎస్ ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది… వచ్చింది… బాలయ్య కూడా వైఎస్ గొప్ప లీడర్ అని ప్రస్తుతించాడు… పర్లేదు, నాటి కాల్పుల కేసులో వైఎస్ చేసిన సాయం పట్ల కృతజ్ఞత ఉంది… నాడు వైఎస్ గనుక కక్ష తీర్చుకునే ఆలోచన చేసి ఉంటే బాలయ్య జీవితం ఇప్పుడిలా ఉండేది కాదు… అది మాత్రం నిజం… ఆ నిజం బాలయ్యకూ తెలుసు..!!
Share this Article