ఒక రాజకీయ పార్టీ… అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ మెడలు వంచాలంటే… ఓ రాజకీయ అనివార్యతను క్రియేట్ చేయడమే మార్గం..! అది ప్రజల సహకారంతో నిర్మించే బలమైన ఉద్యమాల ద్వారానే సాధ్యం..! అత్యంత బలమైన లాబీయిస్టులకు తలొగ్గకుండా, అప్పట్లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందంటే కారణం ఈ రాజకీయ అనివార్యతే…! పార్టీలను వణికించాల్సిన అంశం ఏమిటంటే..? వోట్లతో వోడిస్తాం..!! ఈ మెసేజ్ అర్థమైతే చాలు, అధికారం అనేక మెట్లు దిగివస్తుంది, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది… అవసరమైతే అనూహ్యంగా మోడీ వంటి ప్రధాని కూడా రైతులకు బేషరతు క్షమాపణలు చెబుతాడు… అవును, జరిగింది అదే… అసలు మోడీ క్షమాపణలు చెప్పడం, అదీ ఒక దేశ ప్రధాని హోదాలో…! ఎవరూ ఊహించని పరిణామం…!! ఎందుకు సాధ్యమైంది..?
చిదంబరం చెబుతున్నట్టు… అది మోడీ హృదయంలో నుంచి వచ్చిన నిర్ణయమేమీ కాదు, పశ్చాత్తాపం కాదు… ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీ శివార్లలో తిష్టవేసి, నిరంతరాయంగా, దీర్ఘకాలికంగా రైతులు ఆందోళన చేస్తున్నారు… పంజాబ్‌లో బీజేపీకి పెద్ద ఆశలేమీ లేకపోయినా.., గోవా, మణిపూర్‌లను లైట్ తీసుకున్నా… ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కీలకమైన రాష్ట్రాలు… యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పుంజుకుంటున్నట్టుగా తాజా సర్వేలు చెబుతున్నయ్… ఒక్కసారి యూపీ చేజారితే జాతీయ స్థాయిలోనే బీజేపీ రాజకీయంగా దెబ్బతింటుంది… ప్రాంతీయ పార్టీల నేతలు తలలెగరేస్తున్నారు… సీబీఐ, ఈడీ కొరడాలు పట్టుకుని బెదిరిస్తానంటే కుదిరే పరిస్థితులు లేవు… రైతుల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు… ఈ స్థితిలో మోడీకి రైతుచట్టాల్ని వాపస్ తీసుకోవడం అనేది ఓ అనివార్యత…
Ads
ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ చట్టాల అమలు మీద స్టే విధించింది… దాంతో ప్రధాని స్వయంగా టీవీ తెరమీద ప్రత్యక్షమై… గురునానక్ జయంతిని కూడా ప్రస్తావించి (రైతు ఆందోళనలో ఎక్కువగా ఉన్నది సిక్కులే) ఆ మూడు చట్టాలను రిపీల్ చేస్తున్నట్టు ప్రకటించాడు… అయితే క్షమాపణ కూడా చెప్పడం అనేది అనూహ్యం… అసాధారణం… ఒకరకంగా లెంపలేసుకున్నట్టే… ఒక దేశప్రధాని మూడు కీలక చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటించడం అంటే తప్పు చేసినట్టు అంగీకరించడమే అనుకోవాలా…
…(Photo Courtesy :: Cartoonist Mrutyunjay)
అయితే ఒక ప్రశ్న అలాగే మిగిలిపోయి ఉంది… రైతుల్ని ఆ చట్టాల మీద కన్విన్స్ చేయలేకపోయారు, నిజమే… ఇన్నాళ్లు అవి రైతు శ్రేయోదాయక చట్టాలే అని చెబుతూ వచ్చారు, నిజమే… ఎన్డీఏ పక్షాలే కాదు, న్యూట్రల్ పార్టీలు కూడా ఆ బిల్లులకు అనుకూలంగా వోట్లేశాయి, నిజమే… ఐనాసరే, ఆ చట్టాలు మంచివా, చెడ్డవా అనే కోణంలో గాకుండా… అవి రద్దు చేయకతప్పదు అనే ఓ రాజకీయ అనివార్యతను క్రియేట్ చేస్తే, అధికార పార్టీ ఇది రాజకీయంగా నష్టం అని భావిస్తే చాలు… ఇక ఏదైనా సరే, రద్దు చేసుకుని, సారీ చెప్పాల్సిందేనా..? ఎన్డీఏ పక్షాలు సరే, ఆ చట్టాల్ని సపోర్ట్ చేసిన న్యూట్రల్ రాజకీయ పక్షాలు ఏమంటాయి ఇప్పుడు..? గుడ్డిగా సమర్థించడం తప్పే అని అవీ క్షమాపణలు చెబుతాయా..?! ఎన్డీఏ పక్షమే అయినా సరే శిరోమణి అకాలీదళ్ వ్యతిరేకించింది, అప్పటికే వెన్నువిరిగిన ఎఐడీఎంకే కూడా వ్యతిరేకించింది… అప్పటికే పలు విషయాల్లో మోడీని సమర్థించిన టీఆర్ఎస్ కూడా ఈ బిల్లుల్ని వ్యతిరేకించింది… కానీ వైసీపీ మాత్రం సమర్థించింది..!!
Share this Article