.
Gottimukkala Kamalakar………………. కారణం తెలియదు. ఒంటరిగా కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలనిపించింది. మా ఊరు నెల్లపల్లి మల్లయ్య దేవుడే చెప్పాడో..? వైరాగ్యమే వచ్చిందో..? “సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహిరక్షతి..” అని భయమే వేసిందో..? హైదరాబాదు నడిమి తరగతి నడిమి వయసు భవసాగరాలే భయపెట్టాయో..?
రెండు వారాల ముందు టిక్కెట్టు బుక్ చేసుకుని, రెండు గంటలు ఎయిర్ పోర్ట్ లో నిరీక్షించి, మరో రెండు గంటల్లో “వారాణసీ పురంపతిం భజ విశ్వనాథం..!” అనుకుంటూ హోటల్లోకి వచ్చేసా..! నిక్కరూ, టీ షర్టూ విసిరికొట్టి ఓ షవరుడు గంగతో శరీరస్నానం చేసి ధోవతీ కట్టేసి బయట పడ్డా..!
Ads
****
గంగవెర్రులెత్తిన గంగ తన మైలనే కాదు, ఉబ్బు లింగడినీ కడిగిపారేసింది. నన్ను తాకే అర్హత నీకు లేదురా అంటూ ఘాట్ పైమెట్టు వరకు ఉబికి వచ్చి ఉరిమి చూస్తోంది. పడవలూ, విహారాలూ గట్రా నిషేధం. దొంగలు తాత్కాలికంగా గంగాహారతికి స్వస్తి పలికారు..!
అందర్నీ అడుక్కునే ఆదిభిక్షువు, అందరికీ అన్నం పెట్టే అన్ధపూర్ణమ్మల చుట్టూ ఇచ్చిపుచ్చుకునే వ్యాపారం దండిగా సాగుతోంది. గుడి ప్రధానద్వారం ముందు కూర్చున ఓ బిచ్చగాడు, లోపలికి వెళుతున్న భక్తులనెవరినీ పట్టించుకోకుండా టెంపుల్ రన్ ఆడుకుంటున్నాడు. ఓ బతికిచెడ్డ తురకసాయిబు ఆ పక్కనే గోల్ గప్పాలమ్ముతున్నాడు. కాస్త దూరంగా వారాణసీ మున్సిపాలిటీ వాళ్ల సీవరేజ్ వ్యాన్ ఏదో డ్రైనేజీని శుభ్రం చేస్తోంది.
****
గుళ్లోకెళుతుంటే అందరి రష్షూ, పాండా బ్రోకర్లూ, లోకల్, నేషనల్ పోలీసులూ…! పాలు కొనమని ఒకడు, పత్రిక కొనమని ఒకడు, పాన్ కొనమని ఒకడు..! ఎట్టకేలకు లోపలికెళ్లా..! విపరీతమైన రద్దీ..! ఆ గర్భగుడి 10×10 ఉందేమో…! పాపం శివయ్యకు జలుబు చేసేటట్టు నాలుగువైపులా ఆయన్నెత్తిమీదికి గొట్టాలెట్టారు. జనం హడావిడిగా వాళ్లు తెచ్చినవి ఆయన నెత్తిన దిమ్మరించేస్తున్నారు.
పోలీసులూ, వాలంటీర్లు “ఛలియే.. ఛలియే..!” అంటున్నారు. నాకు విరక్తి మొదలైంది. ఓ అరసెకను పాటు దండం పెట్టి బైటపడ్డాను. ఆ పక్కనే సత్యనారాయణ మందిరం ఉంది. పంతులుగారు నన్ను చూసి “ఆయియే మహరాజ్..!” అని “సాంతాకరం బుజ్గాసైనం..!” అంటూ దేవుణ్ణి తిట్టడం మొదలెట్టాడు. నాకు ఖంగారేసి తప్పక “శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం..!” అంటూ ధ్యానం చేసేసుకుని, ఆ పంతులుకో దండం పడేసి బయటకు వచ్చేసా..!
****
ఆదిశంకరులు; తులసీదాస్ ముక్తిస్థలం…! కోట్ల మందికి కైవల్యాన్ని ప్రసాదించిన కాశీ..! నాకెందుకు రివర్స్ లో విరక్తినిస్తోందని ఆలోచన మొదలైంది. మెల్లమెల్లగా ఘాట్లను చూద్దామనుకుని నడక మొదలెట్టాను. కాళ్లకు చెప్పులూ, చేతికి ఫోనూ లేకుండా ముక్తిమార్గం వైపు నడిచాను.
మణికర్ణిక ఘాట్ లో కట్టెలమ్ముకునేవాడు శ్మశాన వైరాగ్యానికి అతీతుడు. రోజూ లెక్కకు మించి జరుగుతున్న అంత్యేష్టి సంస్కారాలు వాణ్ని ఉద్వేగాలకు అతీతుణ్ని చేశాయేమో..! తన పేరు జీవన్ అట. ఆ పేరు వినగానే శివయ్య ఆట ఓ సెకన్ తాండవమాడింది.
శ్మశానంలో వ్యాపారి పేరు జీవన్…!
ఈ నీలకంఠుడు దుర్మార్గుడు. మన్మధుణ్ని తగలేస్తాడు. ఆ బూడిదతో విరాగికి విభూతినీ; వారకాంతకి కాటుకనీ ప్రసాదిస్తాడు. వాడితో మాట్లాడుతున్న సందర్భంలో నాది హైదరాబాద్ అని తెలిసి “తుమిలే దిల్ ఖిలే ఔర్ జీనేకే క్యా చాహియే” అని పాడుతున్నప్పుడే, ” రామ్ నామ్ సత్య్ హై” అనే కేకల మధ్య ఓ తాజా శవాన్ని తెచ్చారు.
వీడు తన పాటని ఠక్కున ఆపేసి వాళ్లతో కట్టెలబేరం మొదలెట్టాడు. బేరం కుదిరి కట్టెలమ్మాక “నా కుఛ్ తేరా.., నా కుఛ్ మేరా..!” అంటూ సుఖ్ మే సబ్ సాథీ పాట అందుకున్నాడు. అంతలో వాడి చాయ్ వచ్చింది. నాకూ ఓ మట్టి కప్పులో కాస్త పోసి ఛీర్స్ కొట్టాడు.
నా దర్శనపు అనుభవాన్ని నేను చెబుతుండగా, మేమిద్దరం తాగడం మొదలెట్టాము. కాసేపలా శవాలమధ్య తిరిగొస్తానని వాడికి చెప్పి వెళ్లాను. ఆ శవాలు, గంజాయీ, బీడీలూ కాలుతున్న పొగలో, నాకు మెల్లమెల్లగా శివసాక్షాత్కారం కాసాగింది…!
దక్షిణ కోసం కక్కుర్తి పడుతూ, భక్తులను ఇబ్బంది పెడుతున్న మూర్ఖులను దక్షప్రజాపతీసంహారకుడు ఏమీ అనడా…? జరగమంటోది ఎవరిని..? నన్నా.., లేక నా ఆత్మనా అని శంకరభగవత్పాదుల అద్వైతాన్ని ప్రశ్నించింది శంకరుడు ఈ నేలమీదే కదా..?
అయినా, సంత్ రవిదాస్ మార్గ్ లో అంటరానితనపు జాడలు కనబడుతున్నాయెందుకు..? ప్రళయభీకరంగా గర్జిస్తున్న గంగమ్మను శాంతపరచడానికి పార్వతమ్మ ప్రయత్నిస్తున్నట్టు దట్టంగా అలుముకున్న కరిమబ్బులు..! “మీ ఇరువురి మధ్యా సయోధ్య మిధ్య..!” అనుకుంటున్నట్టు నిర్వికారంగా బైరాగుల గురువైన విరాగి యోగి… దేవుడు ఏమిటో తెలుస్తుందన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. మనుషులంటే ఏవిటో తెలుస్తోంది.
మనవంతే…! మూర్ఖులం..!
లక్ష్మీపతికి కానుకలిస్తాం..;
గంగాధరుణ్ని అభిషేకిస్తాం..!
గంగమ్మ ఘాటుకోపం ఘాట్లను ముంచెత్తింది.
కాశీలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కలి ప్రభావపు ఆనవాళ్లు…! అనుకుంటూ మళ్లీ జీవన్ దగ్గరికి వచ్చాను. నా గుడి అనుభవం చెప్పాను. నా చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఇంకో కప్పు టీ ఇచ్చి ఇలా చెప్పాడు. “సోదరా..! మణికర్ణికకు ఎవరూ రారు. తీసుకురాబడతారు. కాశీలో చనిపోదామని వచ్చేవాళ్లు చాలామంది చచ్చేదాకా బతకాలని ఆశపడతారు. భోలేనాధ్ కి ఆ విషయం తెలియదా..?
మనం శివుడికీ అబద్ధాలు చెబుతాం..! ఇక్కడ జనం చావే నా బతుకు తెరువు..! మనమెంత మూర్ఖులమో తెలుసా..? ఇక్కడ సంకటమోచన హనుమాన్ గుడిలో హనుమంతుడు రాముడికి దండం పెడుతుంటే, మనం హనుమంతుడికి దండం పెడుతుంటాం..! రాముడికేసి చూడం..! నువ్వా భోలేనాధ్ నే మనసులో పెట్టుకుని మళ్లీ దర్శనానికి వెళ్లు..! చూడు ఏం జరుగుతుందో..?”
****
నాకేం తోచలేదు. కాళ్లు నెప్పులు మొదలయ్యాయి. కానీ జీవన్ చెప్పిన మాటలు ఎందుకో ఆ వాతావరణంలో సూటిగా మనసులోకి వెళ్లాయి. గుడివైపు వెళ్లాను..! గుడిముందు బిచ్చగాళ్లు “నీవు నేర్పినవిద్యయే నీలకంఠా..!” అన్నట్టు తిరిపెమెత్తుకుంటున్నారు.
ఆ టెంపుల్ రన్ ఆడిన బిచ్చగాడు “నువ్వు లోపల; నేను బైటా అడుక్కుంటాం. మన మధ్య తేడా లేదు..!” అన్నట్టు నావైపు చూసి నవ్వాడు. నేనూ నవ్వాను. ఎవరో షహనాయీ వాయించలేని, బనారసీ చీర నేయలేని ఓ బిస్మిల్లా ఖాన్ పానిపూరీలు అమ్ముతున్నాడు. మిఠాయీ దుకాణాలూ, మన్నూమశానాలూ అడ్డురాబోయినా పట్టించుకోకుండా గుడి దగ్గరికి వెళ్లాను.
జనం అలాగే ఉన్నారు. గర్భగుడి ద్వారం తెరిచిఉంది. అక్కడ నిలుచున్న ఉత్తరక్షణం నా అవతారాన్ని చూసి, “ఆయియే..!” అంటూ ప్రధాన పూజారి లోపలికి పిలిచారు. కలయా, శైవమాయయా..? అనుకుంటూ లోపలికెళ్లాను. నాకో చెంబుడు నీళ్లూ, గుప్పెడు పత్రీ ఇచ్చి విశ్వనాధుడిని ఓ నిమిషం పాటు వప్పజెప్పేసాడు.
నా జీవితంలో పుట్టిబుద్ధెరిగాక అంత దుఃఖం ఎప్పుడూ అనుభవించలేదు. శివుడక్కడ మాత్రమే లేడన్న నా విచక్షణ గంగలో ఎక్కడో కొట్టుకుపోయింది. నా కన్నీళ్ళా..? ఆ చెంబులో నీళ్లా..? తెలియదు. భోరున ఏడుస్తూ నమశ్శంభవేచ మయోభవేచ అనుకుంటూ ఆ నిటలాక్షుడి నెత్తిన నీళ్లు పోసి, గట్టిగా కౌగిలించుకుని ఉండిపోయాను.
తర్వాత ఒకరు నన్ను అక్కడ్నుంచి లేపి పక్కనే కూర్చోబెట్టారు. ఎంతసేపు ఏడ్చానో, ఏమయ్యానో గుర్తు లేదు..! బైట సత్యనారాయణ స్వామి మందిరం దగ్గర బ్రాహ్మడికి పాదనమస్కారం చేసి బయటకొచ్చాను. బతుకంటేనే ఒకపరి ధవళమేఘాలు; ఇంకొకపరి కరిమబ్బులు…! ఆటగదరా శివా…! కాశీలో_ఓరోజు… (జనవరి 2021)
Share this Article