Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ద్వేషిస్తూ ఎవరినో గెలవడం జీవితం కాదు… మనల్ని మనం గెలవాలి…

November 12, 2023 by M S R

నిన్న నా దగ్గరికి ఒక 26 ఏళ్లున్న యువ  మిత్రుడు ఒకరు నా సలహా కోసమని వచ్చాడు. ఒక చిన్నఊరిలో, పేదరికమో దిగువ మధ్య తరగతో తెలియని కుటుంబ నేపథ్యం. చదువు సరిగ్గా చదువలేదు. మధ్యలో ఏవో చిన్న పనులు.

తర్వాత ఇల్లొదిలి తన కాళ్ళ మీద నిలబడి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ చదివి ఆ తర్వాత తనకు నచ్చిన ఉద్యోగాలు చేస్తూ పుస్తకాలకంటే చుట్టూ ఉన్న మనుషులను వాళ్ళ సంతోషాలను దుఃఖాలను అధ్యయనం చేస్తూ నిత్య విద్యార్థిగా మారాడు.

ఎప్పుడో తండ్రితో అన్న మాట “నేను కలెక్టర్ అయితా” అని.., దాన్ని ఇన్ని రోజులు మనసులోనే పెట్టుకొని ఇక సాధించే సమయం వచ్చిందన్న ఆలోచనతో సివిల్స్ కు ఎలా చదువాలనే సలహా కోసం వచ్చాడు. సివిల్స్ అంటే ఐఐటీ, ఐఐఎం , సెయింట్ స్టీవెన్స్, లేడీ శ్రీరామ్, నల్సార్ లాంటి గొప్ప విద్యాసంస్థలనుండి 140-150 IQ ఉన్నవాళ్లు ఎక్కువగా పోటీపడి విజేతలవుతున్న కాలం. 6-7 సంవత్సరాలు ఇంకే వ్యాపకం పెట్టుకోక తపన పడుతున్న కాలం.

Ads

ధనవంతులు, అన్ని హంగులు ఉన్నవారు ఎక్కువగా పోటీ పడుతున్న కాలం. తెలుగు మీడియంలో ఎక్కడో పల్లెలో వానాకాలపు చదువులు చదివిన మన హీరో సివిల్స్ కలకు కారణాన్ని అన్వేషించే పనిలో భాగంగా అడిగాను, అసలు ఎందుకు సివిల్ సర్వీసెస్, అందులో కలెక్టర్ కావాలనుకుంటున్నావు అని. దానికి ఆయన సమాధానం “నన్ను, మా కుటుంబాన్ని చిన్న చూపు చూసేవాళ్లకు నా విజయం ద్వారా బదులిద్దామని.”

నేనన్నాను ద్వేషం నుండి, వ్యతిరేకత నుండి ప్రేరణపొందడం సినిమాటిక్ గా ఉంది, అయినా మన జీవితం ఇంకొకరిని గెలవడానికి కాదు కదా, సివిల్స్ రావడం కూడా సులభం కాదు, ఇంకేదైనా గోల్ పెట్టుకోవాల్సి ఉండే అని. ఇంకొంత ఫిలసాఫికల్ గా మాట్లాడుతూ “మనకు కుళ్ళిన అరటి పళ్లు ఎవరైనా ఇస్తే వాటిని తీసుకోవద్దు , తీసుకున్నా వాటిని వెంటనే చెత్తకుండీలో వేయాలి కానీ కొన్ని సంవత్సరాలు వాటిని మోస్తూ ఆ దుర్గందాన్ని పీల్చడం ఎందుకని అలాగే మనల్ని దూషించిన వాళ్ళ మాటలు మనసులో పెట్టుకోవడం కుళ్ళిన అరటి పండ్ల లాంటివే అని”

లేదు సార్, నాకు ద్వేషం లేదు, కసి ఉంది, దాని కోసం నాకు జీతం తక్కువైనా ఏడేండ్లలో నేను ఎవరితో నా రూమ్ షేర్ చేసుకోలేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, conscious గా ఆ ఆలోచనే రానీయలేదు, ఇంక రానివ్వను. సివిల్స్ ను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాలను వెదుక్కున్నాను, నాకంటే వయసులో పెద్ద వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకొని నా గైడ్స్ గా మనసులో అనుకున్నాను. నేను ఈ ఏడు సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తం సివిల్ సర్వీస్ లోకి నేను వస్తే ఈ సమస్యలకు ఏ సమాధానం చెబుతాను అనే కోణంలోనే చూసాను అన్నాడు.

మరి రేపు సివిల్స్ వచ్చాకా నీ పై అధికారి లేదా పొలిటికల్ బాస్ కానీ నిన్ను అవమానిస్తే మళ్ళీ నీలో పట్టుదల పెరిగి రాజకీయాల్లోకి పోతావా అంటే, నవ్వి, లేదు, సివిల్ సర్వీసెస్ అంటే ఉన్నతమైన ఉద్యోగం అనే నేను నమ్ముతున్నాను అన్నాడు. ఇన్నెండ్లు మార్క్స్ సిద్ధాంతాన్ని, ఆయన ఆలోచనలను ప్రాతిపదికగా చేసుకొని సమాజాన్ని అధ్యయనం చేసిన.., అన్ని ఆలోచనలను ఆకళింపు చేసుకొని మంచి ఎక్కడున్నా గౌరవించే వ్యక్తిత్వం నాది అన్నాడు.

బైజూస్ వాళ్ళు పెట్టిన పరీక్షలో 130 వ రాంక్ వచ్చింది 50 వేలు కట్టి ఆన్లైన్ కోచింగ్ రేపటినుండి మొదలెడుతాను అన్నాడు. ఆయనలో ఉన్న పట్టుదల, కసి బాగా అర్థమయ్యాయి. సివిల్ సర్వీసెస్ కు తయారవ్వడమే జీవితంలో ఒక గొప్ప ఘట్టం. సివిల్స్ కు చదువక ముందు, పూర్తి మమేకంతో చదివిన తర్వాత ఆ వ్యక్తిలో వచ్చే మార్పు అనూహ్యం. దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక విషయాల పట్ల జాతీయ అంతర్జాతీయ స్థూల సూక్ష్మ మార్పులు పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాలు, చరిత్ర, సంస్కృతీ, సాహిత్యాలు ఒక్కటేమిటి సమస్త జ్ఞానం విస్తృత అధ్యయనంలో భాగంగా నేర్చుకొని సంపూర్ణ మూర్తిమత్వాన్ని పొందేలా చేస్తుంది.

దేశానికి దిశా నిర్దేశం చేసే పబ్లిక్ పాలసీ తయారీలో సుమారు 30 సంవత్సరాలు పాలుపంచుకోవచ్చు. సత్వర న్యాయం చేసే గొప్ప అవకాశం. అనేక రంగాల్లో ఆ రంగాల నిష్ణాతులతో కలిసి పని చేసే అవకాశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోని ఏ ఆధునిక రాజ్యంలో ఎక్కడా లేని charm మన దేశ సివిల్ సర్వీసుల్లో ఉంది. అందుకే ప్రతి సంవత్సరం వేయి ఉద్యోగాలు కూడా లేని ఈ పరీక్షలకు లక్షల్లో పోటీపడుతున్నారు.

అది యజ్ఞం చేయడమే. ఎందుకు దీన్ని యజ్ఞం అనాలి అంటే, మంచి భూమి దొరకాలి, దాన్ని శుద్ధి చేయాలి, యజ్ఞ వాటిక తయారు చేసుకొని, సమిధలు, ఆజ్యం, నవ ధాన్యాలు, ఋత్విక్కులు అన్ని సమకూర్చుకోవాలి, యజ్ఞం అవరోధాలు లేకుండా జరగాలి, తర్వాత దైవానుగ్రహం దొరకాలి. సివిల్స్ లాంటి పరీక్షలకు హైదరాబాద్, ఢిల్లీ లాంటివి కావాలి. నిత్యం సివిల్స్ ను శ్వాసించే వాళ్ళే మన చుట్టూ ఉండాలి, పుస్తకాలు, నోట్స్, మ్యాగజైన్స్ లాంటివి యజ్ఞ హవిస్సులు, టీచర్లు ఋత్విక్కులు, యాగ ఫలం ఫలితాల్లో పేరు కనపడడం.

మరి ఇంత గొప్ప సర్వీస్ నిజంగా ఇప్పుడు అంత గొప్పగా ఉందా అంటే శంకరన్ లాంటి మహానుభావులు ధ్రువతారలైనా ఇంకా అక్కడక్కడా ప్రజా క్షేమమే పరమావధిగా పనిచేసే తారలున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క IQ నే కాకుండా, EQ, EMPATHY, HONESTY లాంటివీ పరీక్షించే సమయం / అవసరం ఆసన్నమయింది.

మన హీరో తాను మొదటి ప్రయత్నంలో ఉద్యోగం సాధిస్తా అన్నప్పుడు కొండ పొలం సినిమాలోని హీరో సాధించిన గెలుపు దృశ్యమానమయ్యింది. మన నాయకుడు వినోదంగా చదివి విజయం సాధిస్తాడని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. మన నాయకుడు తన పేరు చెప్పవద్దన్నాడు…. వేముల శ్రీనివాసులు, హైదరాబాద్, 11.11.2023

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions