Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!

July 23, 2026 by M S R

.

“గాయం”లో చూసిన ఆ ఊర్మిళేనా ఇది?… 52లోనూ మనసులు గాయం చేస్తోంది! “అరేయ్… ఈరోజు ‘గాయం’ సినిమా చూద్దాంరా!” “అబ్బే… వద్దులేరా! ఆ నిర్వికారపు జగపతిబాబును ఏం చూస్తాం?” “సరే… ‘అంతం’ చూద్దాం…” “అస్సలొద్దు… ఆ నాగార్జునకు అప్పుడింకా నటన వంటబట్టలేదు… దొందూ దొందే!”

90వ దశకంలో సినిమా హాళ్ల బయట ఇలాంటి మాటలు తరచూ వినిపించేవి. కానీ విచిత్రం ఏమిటంటే… జగపతిబాబు కోసం కాదు… నాగార్జున కోసం కాదు… అయినా ఆ రెండు సినిమాలకు థియేటర్లు మాత్రం కిక్కిరిసిపోయేవి.

Ads

ఎందుకో తెలుసా? ఊర్మిళ మటోండ్కర్..!

అవును… ఆమె కోసమే. ఆమె నవ్వు కోసం… ఆమె గ్లామర్ కోసం… ఆమె డ్యాన్స్ కోసం… ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కోసం.

మహా రసికుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్లను ఎలా ప్రజెంట్ చేయాలో, ఎవరు తన టేస్టుకు సూటవుతారో బాగా తెలుసు. “అంతం”, “గాయం” సినిమాల్లో ఊర్మిళను ఆయన చూపించిన తీరు అప్పటి యువతను కట్టిపడేసింది. ఆ రెండు సినిమాలు దాదాపు నెలల వ్యవధిలోనే విడుదలయ్యాయి. కథలు హిట్టయ్యాయా లేదా అన్నది పక్కన పెడితే… థియేటర్లలో యువతను రప్పించిన ప్రధాన ఆకర్షణ మాత్రం ఊర్మిళే అనడంలో అతిశయోక్తి లేదు.

అప్పట్లో “నీ నవ్వు చెప్పింది నాతో…” వినిపించినా… “అలుపన్నది ఉందా ఎగిరే అలకు…” మొదలైనా… కుర్రాళ్ల గుండెల్లో చిన్నపాటి అలజడి మొదలయ్యేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు… కానీ ఊర్మిళ క్రేజ్ మాత్రం నోటి మాటతోనే దేశమంతా వ్యాపించింది.

ఇప్పుడు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఊర్మిళ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడూ ఫొటోలు పెడితే… 50, 60 ఏళ్ల వయసులోకి వచ్చిన ఆ “పాత కుర్రాళ్లు” మళ్లీ ఒకసారి ఆగి చూస్తున్నారు. మనసులో ఒక్కటే ప్రశ్న…

urmila matondkar

“గాయం”లో చూసిన ఆ ఊర్మిళేనా?… తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం ఒక్కటే. 52 ఏళ్ల వయసులోనూ అదే చిరునవ్వు… అదే చార్మ్… అదే కాన్ఫిడెన్స్. అందుకే నెటిజన్లు సరదాగా, “ఈమె అసలు క్యాలెండర్ చూడదా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏజ్ జస్ట్ ఆధార్ కార్డులో మాత్రమేనా..?

ఒకప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. హీరోయిన్‌కు 40 ఏళ్లు వచ్చాయంటే హీరోయిన్ పాత్రలు తగ్గిపోయేవి. 50 వచ్చేసరికి తల్లి పాత్రలు… ఆ తర్వాత సినిమాలకే దూరం. అప్పట్లో యాభై అంటే “కృష్ణా రామా…” అనుకునే వయసు. ఇప్పుడు అలాంటి లెక్కలు చెల్లవు.

యాభై అంటే రెండో ఇన్నింగ్స్. అరవై అంటే జీవితానికి ఫుల్‌స్టాప్ కాదు. వైద్య విజ్ఞానం, ఫిట్‌నెస్, యోగా, డైట్, స్కిన్ కేర్… ఇలా ఎన్నో మార్పులతో వయసు కేవలం ఒక సంఖ్యగా మారిపోయింది. అందుకే 70 ఏళ్ల వయసులోనూ రేఖ హుందాగా కనిపిస్తున్నారు. హేమమాలిని కూడా అదే వయసులో తన అందాన్ని నిలబెట్టుకున్నారు. మరి 52 ఏళ్ల ఊర్మిళ యంగ్‌గా కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు.

నిజానికి ఊర్మిళ అందం వెనుక అదృష్టం ఒక్కటే లేదు. క్రమశిక్షణ ఉంది. ఫిట్‌నెస్ ఉంది. తనను తాను సంరక్షించుకోవాలనే కమిట్‌మెంట్ ఉంది. అందుకే ఇప్పటికీ కెమెరా ముందు నిలబడగానే అదే వెలుగు కనిపిస్తోంది.

ఊర్మిళ

ఊర్మిళ సినీ ప్రయాణం కూడా ఆసక్తికరమే. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, 1991లో మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. 1995లో వచ్చిన “రంగీలా” ఆమెను దేశవ్యాప్తంగా స్టార్‌గా నిలబెట్టింది. కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కాదు… రొమాంటిక్, కామెడీ, భావోద్వేగ, సైకలాజికల్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసింది.

తెలుగులో “అంతం”, “గాయం”, “మనీ మనీ”, “అనగనగా ఒక రోజు”, “భారతీయుడు” వంటి చిత్రాలతో ప్రత్యేక అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. 2016లో వ్యాపారవేత్త, మాజీ మోడల్ మొహ్సిన్ అఖ్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలోనూ చురుకుగా పనిచేసింది.

ఏదేమైనా… ఒకప్పుడు థియేటర్‌లో ఆమె ఎంట్రీకి ఈలలు వేసిన తరం… ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌పై ఆమె ఫొటో కనిపిస్తే లైక్ కొడుతోంది. వేదిక మారింది… కాలం మారింది… అభిమానులు కూడా పెద్దవాళ్లయ్యారు.

కానీ ఊర్మిళ మార్క్ ఆ నవ్వు మాత్రం ఇప్పటికీ మారలేదు... అందుకే "గాయం"లో చేసిన గాయం... ప్చ్, ఇంకా మానలేదేమో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 52 లోనూ అదే 25 … నాటి ‘గాయం’- నేటికీ అదే ప్రాయం… ఆమే ఊర్మిళ !!
  • ఏదో ఓరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది ! ఎవరన్నారు? ఎవరిని?
  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions