.
Jaganadha Rao ……. డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం (మూడో ప్రపంచ యుద్ధం!) నా వ్యక్తిగత అభిప్రాయం
డోనాల్డ్ ట్రంప్ జనవరి 20 న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజు లేదా వారంలోపే 100 ఉత్తర్వులని జారీ చేసే అవకాశం ఉంది. 200 యేండ్ల పైబడిన అమెరికా చరిత్రలో ఏ ఒక్కరూ మొదటి రోజు లేదా వారంలోపు 100 ఎక్సిక్యూటివ్ ఆర్డర్స్ ని జారీ చేయలేదు, కానీ ట్రంప్ రూటే సెపరేట్.
Ads
తాను నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నూతన గవర్నమెంట్ లో ఉండబోయే 1000 కి పైగా క్యాండిడేట్స్ ని ఆల్రడీ సెలక్ట్ చేసి ఉంచాడు. ఒక్క నిమిషం కాదు కదా సెకండ్ కూడా వృథా చేసే ఉద్దేశ్యం ట్రంప్ కి లేదు.
తెలివి తక్కువవాడు తన లోపల ఏమి ఉందో బయటికి తెలియజేస్తాడు. తెలివి కలవాడు లోపల ఒకటి బయట మరొకటి చూపిస్తాడు. అత్యంత తెలివి కలిగిన వాడు తన లోపల ఏమి కావాలి అని కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా బయటికి తెలియజేస్తాడు, డోనాల్డ్ ట్రంప్ అత్యంత తెలివి కలిగినవాడు.
ట్రంప్ టీమ్ వేరు… సాధారణంగా అత్యంత తెలివి ఉన్నవారికి కొంత అహంకారం ఉండి తమ క్రింద లేదా పక్కన తెలివి తక్కువ వారిని, లేదా కాస్త తెలివి కలవారిని వారినే మాత్రమే పెట్టుకుంటారు. డోనాల్డ్ ట్రంప్ మాత్రం తన టీంలో అత్యంత తెలివి, సమర్ధులైన వారిని మాత్రమే పెట్టుకున్నాడు.
జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేయగానే తమ పక్క దేశాలు అయిన కెనడా, మెక్సికో నుంచి అమెరికాకి వచ్చే సరుకు పైన 25% సుంకాలు విధిస్తాను, గ్రీన్ ల్యాండ్ దేశాన్ని, పనామా కాలువని స్వాధీనం చేసుకోటానికి ప్రయత్నిస్తాను అని ట్రంప్ చెప్పినప్పుడు చాలా ఎక్కువ మంది, సుమారు 99.99 % అది కుదరదు అని కొందరు, ఈ ప్రపంచం అంతా ట్రంప్ స్కూల్ కాదు అని మరికొందరు, ఈ భూమి అంతా ట్రంప్ ఇళ్ళు కాదు అని ఇంకొందరు, ట్రంప్ ఒక మూర్ఖుడు అని కొద్దిమంది – ఇలా చాలా రకాలుగా డోనాల్డ్ ట్రంప్ గురించి అనుకున్నారు, అనుకుంటున్నారు.
కానీ చెప్పిందే చేయటం, చేసేదే చెప్పటం ట్రంప్ స్టయిల్. అసలు అతను గెలిచిందే “MAGA – మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” అనే నినాదంతో. కావాల్సిన దాన్ని అడగటం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. కావాల్సిన దాన్ని సాధించుకోవటం తెలివి కలవాళ్ళు చేసే పని. తాము కావాలి అనుకున్న దాన్ని ఎదుటివారిని వాళ్ళు కాదనలేని ప్లేసులో ఉంచి, వాళ్ళే ఇచ్చేలా చేయటం అత్యంత తెలివి కలవాళ్ళు చేసే పని, డోనాల్డ్ ట్రంప్ ఇదే చేస్తున్నాడు.
అమెరికాకి ఉన్న అప్పుకి ఏ చిన్న కుదుపు వచ్చినా ఆ దేశం పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి. ప్రస్తుతం IMF లెక్కల ప్రకారం Debt-to-GDP శాతం 129% ఉంది. అంటే దేశ GDP కంటే కూడా అప్పు చాలా ఎక్కువ ఉంది, ఒక్క ఫెడరల్ గవర్నమెంట్ అప్పే 33 నుంచి 34 ట్రిలియన్ డాలర్లు అంటే చాలా ఎక్కువ.
క్రూడ్ ఉత్పత్తి… ఆయిల్ బావులు లేదా క్రూడ్ ఆయిల్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు చెప్పమంటే ఎక్కువ మంది సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, ఓమన్, ఖతార్, UAE, వెనెజులా, రష్యా లేదా కెనడా అని చెప్తారు. పూర్తిగా తప్పు. ప్రపంచంలో అత్యధికం గా ఆయిల్ బావులు ఉంది అమెరికాలో మరియూ అత్యధికంగా ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేది అమెరికాలో.
ఒక్క రోజుకే కోటీ 35 లక్షల బ్యారల్స్ ప్రొడక్షన్ జరుగుతుంది అమెరికాలో. నిజానికి ఇరాక్, ఇరాన్, ఓమన్, ఖతార్, వెనెజులా లాంటి దేశాలు అంతా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ కంటే అమెరికాలోని ఒక్క రాష్ట్రం ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ఎక్కువ.
అయినా ఈ మధ్య కాలం వరకు తమ అవసరాలకి సరిపోక వేరే దేశాల నుంచి తక్కువ ధరకే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. తాము ఇంపోర్ట్ చేసుకునే దానిలో 60% కెనడా నుంచే అత్యంత చీప్ ధరకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. గత 70 లేదా 100 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా తమ అవసరాలకి సరిపోగా మిగిలిన దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి చేరుకుంది ఇప్పుడు USA.
2023 లో కెనడా నుంచి 450 బిలియన్ డాలర్ల సరుకు అమెరికా కొంటే, కెనడా మా దగ్గర నుంచి 350 బిలియన్ డాలర్ల సరుకు మాత్రమే కొన్నది. మేం 100 బిలియన్ డాలర్లు ఎక్కువ కొంటున్నాం అనేది డోనాల్డ్ ట్రంప్ వాదన. అతను అత్యంత తెలివి కలవాడు కాబట్టి అలానే మాట్లాడతాడు కానీ నిజానికి ఇందులో 150 బిలియన్ డాలర్లు కేవలం క్రూడ్ ఆయిల్ మరియూ నేచరల్ గ్యాస్ మాత్రమే ఉంది,
ఈ రెండూ అత్యంత చీప్ ధరకి కెనడా నుంచి కొని వాటిని శుద్ది చేసి అత్యంత ఎక్కువ ధరకి అమెరికా వేరే దేశాలకి అమ్ముకుంటుంది. ఈ రెండింటినీ తీసి వేస్తే కెనడానే అమెరికా నుంచి 50 బిలియన్ డాలర్ల సరుకు ఎక్కువ కొంటుంది, మాకే ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని చెప్పే నాయకుడు కెనడాకి కావాలి.
ఐటీ కాదు, ఇతరత్రా… అమెరికా అనగానే IT అని, టెక్నాలజీ అని ఎక్కువ మంది అంటారు, అనుకుంటారు. 2023 అమెరికా GDP 27.36 ట్రిలియన్ డాలర్లు అయితే అందులో IT, టెక్నాలజీ అంతా కలుపుకొని కేవలం 2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే, మిగతా 25.36 ట్రిలియన్ కథా కమామీషు అంతా వేరు. అంటే అమెరికా ఆదాయంలో ఐటీ మరియూ టెక్నాలజీ ద్వారా వచ్చేది చాలా స్వల్పం. అంటే మనకి తెలిసిన అమెరికా వేరు, అసలు అమెరికా ఆదాయం వేరు.
2023 లో తీసుకుంటే (Exports) సుమారు 90-95% ఆదాయం ఫ్యూయల్ మరియూ ఆయిల్ & మినరల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, మిషినరీ, ఎలక్ట్రికల్ మరియూ ఎలక్ట్రానిక్స్, వాహనాలు, మెడికల్ డివైసెస్ మరియూ ఫార్మా ప్రొడక్ట్స్ ద్వారా వచ్చింది.
అందుకే డోనాల్డ్ ట్రంప్ కెనడా, మరియూ మెక్సికోతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నా దాన్ని కాలరాచి 25% సుంకాలు విధిస్తా అంటున్నాడు. అతనికి ఏదో కావాలి కాబట్టి 25% సుంకాలు అనగానే వాళ్ళ ఆర్ధిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది కాబట్టి అతనితో చర్చలకి వెళతారు.
గ్రీన్ ల్యాండ్ కావాలి… డోనాల్డ్ ట్రంప్ తనకి కావాల్సిన వాటిని డైరక్ట్ గా అడుగుతాడు – ఉదాహరణకి గ్రీన్ ల్యాండ్ కావాలి కాబట్టి కెనడా నుంచి సహాయం, పనామా కాలువ విషయంలో మెక్సికో సహాయం, ఈ విధంగా అతనికి కావాల్సిన వాటిని అడుగుతాడు. వాళ్ళు సరే అంటే ఒకే లేకపోతే 25% సుంకాలు విధించినా ప్రస్తుత పరిస్థితుల్లో అది అమెరికాకే మేలు చేస్తుంది.
కెనడా నుంచి అమెరికా ఆయిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు. అమెరికాలోనే మరింత జోరుగా ఆయిల్ బావుల త్రవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు డోనాల్డ్ ట్రంప్.
తన ఆఫర్ కి మెక్సికో, కెనడా యస్ చెప్పినా ట్రంప్ కి, అమెరికాకే మేలు. ఒకవేళ వాళ్ళు నో చెప్పినా అమెరికాకి, ట్రంప్ కే మేలు. అమెరికా చరిత్ర, అమెరికా ఆర్ధిక వ్యవస్థ, డోనాల్డ్ ట్రంప్ ఉద్దేశ్యం తెలియని వారికి ట్రంప్ మాటలు తేడాగా అనిపిస్తాయి కానీ డోనాల్డ్ ట్రంప్ చేస్తున్నది వాణిజ్య యుద్ధం.
ఆర్మీ బేస్‌లు…. ఆర్మీ బేస్ క్యాంపులు ఇతర దేశాల్లో ఎక్కువ ఉన్నవి అనగానే చైనా లేదా రష్యా అని అనుకోటానికి అవకాశం ఉంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా 750 అర్మీ బేస్ లు ఉన్నై అమెరికాకి. ఆ తర్వాత అయినా చైనా లేదా రష్యా ఉంటుంది అనుకుంటారు కానీ ఆ తర్వాత స్థానంలో 100 ఆర్మీ బేస్ లు ఉంది గ్రేట్ బ్రిటన్ కి.
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఉన్న అర్మీ బేస్ ల కంటే ఒక్క అమెరికా మరియూ గ్రేట్ బ్రిటన్ కి ఉన్నవే చాలా ఎక్కువ. అందుకే ఆర్మీ ఉపయోగించి అయినా గ్రీన్ ల్యాండ్ మరియూ పనామా కాలువని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అన్నాడు. కనీసం గ్రీన్ ల్యాండ్ లో పెద్ద ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకోగలుగుతాడు. అది కూడా అత్యంత పెద్ద విజయం అవుతుంది దీర్ఘ కాలంలో.
పనామా ఓ భిన్న కథ… పనామా విషయానికి వస్తే అమెరికా పెద్ద మొత్తంలో సుంకాలు కట్టి ఓడల ద్వారా పనామా కాలువ నుంచి సరుకు రవాణా చేసుకుంటుంది. పనామా వాళ్ళు అమెరికాకి సుంకాల విషయంలో రాయితీ ఇచ్చినా అమెరికాకి అది చాలా పెద్ద రిలీఫ్ అవుతుంది.
సాధారణం గా మాకు రాయితీ ఇవ్వండి అంటే, అగ్రరాజ్యం మరియూ నంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థ అయి ఉండీ రాయితీలు అడగడం ఏంటి అని అందరూ నవ్వు కుంటారు కానీ పనామా కాలువని స్వాధీనం చేసుకుంటాం అంటే అంటే కనీసం శాశ్వతంగా వాళ్ళే మీకు పూర్తిగా రాయితీ ఇస్తాం అంటే అది ట్రంప్ విజయం అవుతుంది.
ఒకవేళ గ్రీన్ ల్యాండ్ ని స్వాధీనం చేసుకోగలిగితే అనేక సంవత్సరాల వరకు అమెరికానే అగ్రరాజ్యంగా కొనసాగుతుంది కారణం అపారమైన అయిల్ మరియూ వివిధ రకాల ఖనిజాలు ఉన్న దేశం అది. వైశాల్యంలో అమెరికాలో సగం ఉంటుంది. గ్రీన్ ల్యాండ్ ని కొనటం లేదా స్వాధీనం చేసుకోవటం కుదరక అతి పెద్ద ఆర్మీ బేస్ ఏర్పాటు చేసుకున్నా అది అమెరికాకి విజయమే.
ఏది ఏమైనా ఒక 400 ఆరంజ్ లు దొరికితే నాలుగు వందల ఆరంజ్ లు నాకే కావాలి అంటున్నాడు డోనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నై. కనీసం తాను 200 తీసుకొని మిగతా 200 అయినా మిగతా దేశాలకి మిగిల్చితే సరిపోతుంది.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు వేరే దేశాలనుంచి దిగుమతి అయ్యే వాటిపై ట్యాక్స్ విధిస్తే వోకే కాని అభివృద్ధి చెందిన దేశం తమ పక్క దేశాల సరుకుపై కూడా ట్యాక్స్ (టారిఫ్) విధించటం కరక్ట్ కాదు.
కెనడా రాజకీయాల్లో మార్పు…. కెనడాలో జస్టిన్ ట్రూడో ఒక బలహీన ప్రధాని. కెనడా వ్యాప్తంగా అతని మీద, అతను చేసే పనుల మీద చాలా మంది అసహనంగా ఉన్నారు. సొంత పార్టీలో కూడా ట్రూడో మీద బాగా వ్యతిరేకత ఉంది. ట్రూడోతో వేగలేక స్వయానా కెనడా ఆర్ధిక మంత్రి రాజీనామా చేసింది. చివరికి ట్రూడో కూడా ప్రధానిగా రాజీనామా చేశాడు.
డోనాల్డ్ ట్రంప్ కెనడా మీద 25% సుంకాలు విధిస్తాను అనేసరికి తదుపరి ప్రధానిగా తెలివైన, సమర్ధవంతమైన వ్యక్తిని ఎన్నుకుందాం అని ఇప్పుడు కెనడా చూస్తుంది. చివరికి రాజకీయాలతో సంబంధం లేని, కనీసం MP కూడా కాని సమర్ధుడైన మాజీ బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీని లిబరల్ పార్టీ తరపున ప్రధానిని చేసే పరిశీలన కూడా చేస్తుంది.
నాకు తెలిసి మార్క్ కార్నీ లేదా ఈ మధ్య ఆర్ధిక మంత్రిగా రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీల్యాండ్ కానీ లిబరల్ పార్టీ తరపున కెనడా ప్రధాని కావచ్చు అనుకుంటున్నాను. ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో మాత్రం ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న కంజర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చి పియరీ పోలివర్ ప్రధాని అవుతాడు అని నా అభిప్రాయం.
తెలివైన నేతలే శరణ్యం… వీక్ గా ఉన్న కెనడా ప్రధానిని తొలగించి తెలివైనవాడు, సమర్ధుడు అయిన ప్రధానిని ఎన్నుకుంటుంది కెనడా. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. బలహీనమైన, తెలివి తక్కువ రాజకీయ నాయకులకి కాలం చెల్లుతుంది. జర్మనీలో కూడా సమర్ధవంతవంతమైన ప్రభుత్వం ఏర్పడుతుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం ప్రపంచ నాయకుల్లో ఒక విధమైన అస్థిరత, భయం ఏర్పడింది. జనవరి 20 నుంచి జరిగే వాణిజ్య యుద్ధంలో గెలవాలంటే ప్రపంచ వ్యాప్తంగా ముందు ముందు ప్రతి దేశంలో తెలివైన, సమర్ధులైన నాయకులకి ఎన్నుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article