Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపరి కొత్త వార్… అమెరికాకు స్వర్ణ యుగమో… వివర్ణ యోగమో…

March 7, 2025 by M S R

.

ఒక్కోసారి కొందరి వల్ల, కొన్ని సందర్భాల వల్ల కొన్ని మాటలకు భలే డిమాండు పెరుగుతుంది. ఆ సందర్భాలు కష్టపెట్టేవే అయినా “మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం” అన్నట్లు ఆ మాటల వాడుకకు భాషాభిమానులు మురిసిపోవచ్చు. అలా రెండోసారి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ దయ వల్ల ప్రపంచం నిద్రలోకూడా పలవరిస్తున్న మాటలు- పన్నులు, సుంకాలు, ప్రతీకార సుంకాలు.

పట్టుకునేది పన్ను అని స్థూలంగా అనుకోవచ్చు. అందుకే ఆదాయపుపన్ను వాళ్ళు ఎప్పుడూ పట్టుకునే పనిలోనే ఉంటారు. పన్ను ఎగ్గొట్టినవారి పళ్ళూడగొట్టి వసూలు చేసుకుంటూ ఉంటారు. పట్టులో చివరి ట్టు న్ను అవుతుంది. నోట్లో పన్ను కూడా ఆహారాన్ని పట్టుకుని కొరకాలి కాబట్టి అదే అర్థంలోనే ఉంది.

Ads

తెలుగుకు ప్రామాణికమైన నిఘంటువు శబ్దరత్నాకరం ప్రకారం పన్ను అంటే యుద్ధానికి సిద్ధపడు, కలుగు, చేయు, ఏర్పరచు, కప్పం అన్న అర్థాలున్నాయి. సుంకం అంటే ఎగుమతులు, దిగుమతుల్లో ప్రభుత్వాలకు కట్టే పన్ను. కప్పం అంటే చక్రవర్తి లేదా రాజుకు సామంతరాజు విధిగా చెల్లించేది.

ఇప్పుడు అమెరికాకు స్వర్ణయుగం తెచ్చే పనిలో ఉన్న ట్రంప్ తెంపరి టెంపరి ట్రంపరి భాషలో “ప్రతీకార సుంకం” అన్న మాట ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనిమీద అటు భాషావేత్తలు, ఇటు పన్నులు, సుంకాల నిపుణులు లోతుగా చర్చించి సామాన్యులకు కొంత అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పన్నులు, సుంకాల పరిభాష; వాటి లెక్కలు; వాటి మదింపు; లాభనష్టాలు ఒకపట్టాన ఎవరికీ అర్థం కావు. అర్థమయ్యిందని అనుకునేవారికి ఎంత అర్థమయ్యిందో లోకానికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఈ గొడవలన్నీ ఎందుకని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అసలు పన్నులే కట్టరు.

వారు దేశానికి పంటికింద రాళ్ళుగా ఉండి…ఒక శుభ ముహూర్తాన సొంత విమానాల్లో విదేశాలకు చెక్కేసి…కొరకరాని కొయ్యలై…దేశం నెత్తిన పెద్ద బండరాళ్ళు వేస్తూ ఉంటారు. దేశం కొయ్య బొమ్మగా మారి చోద్యం చూస్తూ ఉంటుంది. ఆ భారాన్ని సామాన్యులు, పళ్ళుండి పన్నులు కట్టేవారు సమానంగా పంచుకుంటూ ఉంటారు.

సాధారణంగా మనం కరెంటు బిల్లులు, పెట్రోల్, డీజిల్, టోల్ టాక్స్ లు చూడకుండా కట్టేస్తూ ఉంటాం. చూస్తే ప్రపంచంలో ఉన్న సమకాలీన ఎన్నెన్నో సమస్యలకు మన దగ్గర నుండే ఏయే పేర్లతో సెస్సులుగా వసూలు చేస్తున్నారో తెలుస్తుంది.

ఒక్కోసారి తాగే మద్యం బాటిల్ ధరలో విద్యాభివృద్ధికి వసూలు చేసే ఎడ్యుకేషన్ సెస్ ఉండచ్చు. మన మంచి చదువులకు తాగుబోతులు వారి ప్రాణాలను పణంగా పెడుతూ ఉండి ఉండవచ్చు. సిగరెట్ తాగేవారు తాము బూడిద అవుతూ కొన్న సిగరెట్లో జాతీయ రహదారి నిర్మాణ సెస్ కట్టి…రోడ్డు బూడిదలో బూడిద అయి ఉండవచ్చు.

అలా ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచానికి భారం కావచ్చు. కానీ అమెరికాకు స్వర్ణయుగం రావాలంటే ప్రపంచానికి పాతరాతి యుగం రావాలన్న ట్రంప్ ఆధునిక వ్యాపార రాజకీయ సూత్రానికి అమెరికాలో ఆమోదం కూడా లభించవచ్చు.

Live and let live నువ్ హాయిగా బతుకు…పక్కవాడిని కూడా హాయిగా బతికించు అన్న అభ్యుదయానికి, ఆదర్శానికి కాలం చెల్లినట్లుంది. “నువ్ చావు…నేను బతికితే చాలు” అన్నదే ప్రపంచాధినేతలమని తమకు తాము భుజకీర్తులు తగిలించుకున్నవారికి పరమ ఆదర్శమవుతోంది.

కూలే స్టాక్ మార్కెట్లు; వారాల్లో లక్షల కోట్ల సంపద హారతి కర్పూరాలు; శాంతి చర్చల్లో చేపల మార్కెట్ సంభాషణలు; యుద్ధం మీద పెట్టుబడులు; ఆ పెట్టుబడులకు లాక్కునే సహజ వనరులు; నాటో కూటములు; కూల్చే కోటలు; పోయే ప్రాణాలు; రాల్చే మొసలి కన్నీళ్ళు…ఇలా దేని లెక్కలు దానికుంటాయి. ఎవరి లెక్కలు వారికుంటాయి. ఆ లెక్కలు తప్పినప్పుడు లెక్కలు సరిచేసే ప్రతీకార సుంకాలు ప్రవేశిస్తాయి.

ప్రతీకార సుంకానికి ప్రతీకారంగా మరో సుంకం వేస్తే…అప్పుడు కొత్త పారిభాషికపదాన్ని ఎలా పుట్టించాలి?

పునర్ప్రతీకార సుంకం!
పునః పునః ప్రతీకార సుంకం!
ప్రతీకారోప సుంకం!

“పన్నూడగొట్టుకోవడానికి ఏ రాయైతే ఏమి?”
అన్న అద్భుతమైన నిట్టూర్పు జాతీయమే ఇప్పుడు సుంకాల, ప్రతీకార సుంకాల బాధిత ప్రపంచానికి ఓదార్పు!

అన్నట్లు-
అమెరికా స్వర్ణయుగం ఇప్పుడే మొదలయ్యిందట!
అభీ పిక్చర్ బాకీ హై!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions