.
అప్పుల్లో అమెరికా అగ్రస్థానం, ఆర్థిక స్థిరత్వంలో భారత్ బెటర్! ప్రపంచ రుణ ఉచ్చులో దేశాల భవితవ్యం
అగ్రదేశం… ప్రపంచం మీద పెత్తనం చెలాయించే దేశం… నేను చెప్పినట్టు అన్ని దేశాలూ చచ్చినట్టు వినాల్సిందే, లేకపోతే టారిఫ్‌ల మోత మోగిపోతుందని బెదిరించే దేశం… ప్రపంచానికి నీతులు చెప్పే దేశం… ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత డొల్లగా ఉందో సాక్షాత్తూ ఐఎంఎఫ్ చెబుతోంది…
Ads
తన బుడ్డ గోచీ సర్దుకునే ప్రయత్నాలకు బదులు ఇంకా ఇంకా తనదే ప్రపంచం మీద అధికారం అనే భ్రమల్లో బతుకుతోంది అమెరికా… నిజం… ఆ అమెరికాతో పోలిస్తే ఇండియా ఆర్థిక స్థిరత్వంలో చాలా బెటర్… అంతేకాదు, చాలా దేశాలకన్నా బెటర్…
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా అప్పులకు సంబంధించిన గణాంకాలు కలవరపెడుతున్నాయి… ముఖ్యంగా అగ్రరాజ్యమైన యునైటెడ్ స్టేట్స్ (US) అధిక రుణ భారంతో ఉండగా, భారత్ మెరుగైన స్థానంలో ఉంది… అధిక రుణాలున్న దేశాల ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి…
ఇండియా వర్సెస్ యూఎస్: రుణ భారం పోలిక
స్థూల జాతీయోత్పత్తి (GDP)తో పోలిస్తే ప్రభుత్వ రుణం (Debt-to-GDP ratio) నిష్పత్తి దేశం అప్పును తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కొలిచే ముఖ్యమైన కొలమానం…
యునైటెడ్ స్టేట్స్‌లో ఈ నిష్పత్తి 125 శాతం… 38 ట్రిలియన్ డాలర్లకు పైగా రుణం… అదే ఇండియా కేవలం 81 శాతం, అనేక అభివృద్ధి చెందిన దేశాలకన్నా బెటర్ పొజిషన్… ఈ రుణభారంలో టాప్ దేశం జపాన్… 230 శాతం… గ్రీస్ కూడా 147 శాతంతో ఉంది…
- అగ్రరాజ్యపు అప్పుల కుప్ప: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా… దాని జీడీపీ కంటే 125% అధికంగా రుణాన్ని కలిగి ఉంది… ప్రభుత్వ వ్యయాలు, పన్ను తగ్గింపులు, అధిక వడ్డీ ఖర్చులు దీనికి ప్రధాన కారణాలు…
- భారత్ మెరుగ్గా ఉంది: భారతదేశపు రుణ నిష్పత్తి 81% వద్ద ఉంది, ఇది ఇటలీ (137%), ఫ్రాన్స్ (117%), కెనడా (114%) వంటి అభివృద్ధి చెందిన దేశాలకంటే చాలా మెరుగైన స్థానంలో ఉంది… ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇదొక సానుకూల అంశం…

అధిక రుణ భారం సంక్షోభాలు, యుద్ధాలు, అంతర్గత అస్థిరతలతో ముడిపడి ఉన్న దేశాలలో అత్యంత ప్రమాదకరంగా మారుతోంది…
- ఉక్రెయిన్ (Ukraine): రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ రుణ-GDP నిష్పత్తి వేగంగా పెరిగి 109% కి చేరుకుంది… యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం…
- సుడాన్ (Sudan): అంతర్గత అస్థిరత, సుదీర్ఘ ఆర్థిక సవాళ్ల కారణంగా, సుడాన్ రుణ నిష్పత్తి అత్యధికంగా 222% కి చేరింది… ఇలాంటి అత్యధిక రుణాలు, ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలను మరింత అగాధంలోకి నెట్టేస్తాయి…
ఈ రుణాలు ఎక్కడ తీసుకుంటున్నారు? (Sources of Government Debt)
ప్రభుత్వాలు తమ రుణాలను ప్రధానంగా రెండు మార్గాల్లో తీసుకుంటాయి:
- అంతర్గత రుణం (Internal Debt): ఇది ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు వంటివి జారీ చేసి దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ప్రజల నుండి రుణాలు తీసుకోవడం…. భారతదేశంలో అధిక భాగం (సుమారు 90%) రుణం దేశీయ మార్కెట్ నుండే సేకరించబడుతుంది…
- బాహ్య రుణం (External Debt): ఇది విదేశీ సంస్థల నుండి లేదా దేశాల నుండి రుణాలు తీసుకోవడం…
- అమెరికా: అమెరికా బాండ్లను ప్రధానంగా చైనా, జపాన్ వంటి ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు, అలాగే ప్రైవేట్ మదుపరులు కొనుగోలు చేస్తారు…
- భారత్: భారత బాహ్య రుణం ప్రధానంగా ప్రపంచ బ్యాంక్ (World Bank), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి బహుపాక్షిక సంస్థల (Multilateral Institutions) నుండి లేదా ఇతర దేశాల ప్రభుత్వాల నుండి తీసుకుంటారు…
అధిక రుణాలు ఎందుకు ప్రమాదం? (Why is High Debt Dangerous?)
అధిక రుణ- GDP నిష్పత్తి దేశ ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రమాదాలను తెచ్చిపెడుతుంది:
- 1. వడ్డీ భారం (Interest Burden): రుణం అధికంగా ఉంటే, ప్రభుత్వం పౌర సంక్షేమం, విద్య లేదా మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయకుండా, వడ్డీ చెల్లింపులకే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కేటాయించాల్సి వస్తుంది…
- 2. ప్రైవేట్ పెట్టుబడులపై ప్రభావం (Crowding Out Private Investment): ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం వలన, మార్కెట్‌లో వడ్డీ రేట్లు పెరుగుతాయి… దీనివల్ల ప్రైవేట్ కంపెనీలకు రుణాలు ఖరీదై, పెట్టుబడులు తగ్గి, తద్వారా ఆర్థిక వృద్ధి మందగిస్తుంది…
- 3. ద్రవ్యోల్బణం (Inflation): కొన్నిసార్లు రుణం భారాన్ని తగ్గించుకోవడానికి దేశాలు డబ్బును ముద్రించాల్సి వస్తుంది… ఇది ద్రవ్యోల్బణాన్ని (వస్తువుల ధరలు పెరగడం) పెంచి, సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది…
ఆర్థిక స్థిరత్వం ఉన్న దేశాలు (Countries with Fiscal Stability)
అప్పులు తక్కువగా ఉన్న దేశాలు తమ ఆర్థిక స్థిరత్వంతో మెరుగ్గా కనిపిస్తున్నాయి… ఈ దేశాలు సంక్షోభ సమయాల్లో ఖర్చు చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ వెసులుబాటును కలిగి ఉంటాయి…:
- మకావు (Macao): 0%
- చిలీ (Chile): 43%
- ఆస్ట్రేలియా (Australia): 51%
- మెక్సికో (Mexico): 59%
- డెన్మార్క్: 26.6%
ఇంట్రస్టింగు… అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడే దేశాల అసలు ఆర్థిక స్థితి ఉత్త డొల్ల అనే నిజాన్ని ఐఎంఎఫ్ నివేదిక వెల్లడిస్తోంది…!
Share this Article