Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ మరణం తీరని లోటు… ఈ ప్రపంచంలో అతి పెద్ద హిపోక్రటిక్ స్టేట్‌మెంట్…

October 5, 2023 by M S R

ఎవరైనా రాజకీయ నాయకుడు మరణిస్తే .. ఆ వార్తలు చదివితే పత్రిక ఏదైనా కావచ్చు , నాయకుడు ఎవరైనా కావచ్చు , ప్రకటన ఇచ్చింది ఎవరైనా కావచ్చు ఒక వాక్యం అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది . ఆ నాయకుడి మరణం తీరని లోటు అనే మాట లేకుండా వార్త ఉండదు . అలానే జర్నలిస్ట్ మరణిస్తే సిటీ పేజీలో , జిల్లాల్లో ఐతే జిల్లా పేజీలో తప్పని సరిగా కనిపించే మాట . మరణించిన కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది . ఆ మాట చదవగానే వైరాగ్యంతో కూడిన నవ్వు వస్తుంది .

********

1993 నాటి మాట .. 30 ఏళ్ళ క్రితం నల్లగొండ జిల్లాలో ఆంధ్రభూమి రిపోర్టర్ గా చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో యూనియన్ సమావేశం . హైదరాబాద్ నుంచి యూనియన్ రాష్ట్ర నాయకులు రావాలి . ఆలస్యం అవుతోంది . వారు వచ్చే వరకు మౌనంగా ఉండలేరు కదా ? అప్పటి వరకు జిల్లా స్టాప్ రిపోర్టర్లు మాట్లాడితే బాగుంటుంది అని సలహా… ఒకరి తరువాత ఒకరు మాట్లాడుతున్నారు . నన్నూ మాట్లాడమన్నారు. అప్పటివరకు మాట్లాడిన అనుభవం లేదు .

Ads

నాలుగు మంచి మాటలు చెప్పేందుకు ఇబ్బంది ఏముంది అని మైకు తీసుకోని …. మీరు ఫుల్ టైం పని చేయాల్సిన స్టాఫ్ రిపోర్టర్ లు కాదు , పార్ట్ టైం పని చేయాల్సిన లోకల్ విలేకరులు . మా ఏరియానే ప్రపంచం , ప్రపంచాన్ని మేమే శాసిస్తున్నాం అనే భావన వద్దు . మేనేజ్ మెంట్ కు కోపం వచ్చినా , ఎవరికి కోపం వచ్చినా మీ పార్ట్ టైం ఉద్యోగానికి భరోసా ఉండదు . పైగా మీకు వచ్చే డబ్బు అంతంత మాత్రమే . ఇది పార్ట్ టైం అని గుర్తుంచుకొని , ఏదైనా ఉపాధి మార్గం చూసుకోవాలి .

ఒకరికి చేయి చాపే స్థితిలో ఉండకూడదు . ఆ నాయకుడు తెలుసు , ఈ నాయకుడు తెలుసు అని చెప్పుకోవడానికి బాగుంటుంది , అవేవి జీవితానికి ఉపయోగపడవు . నీ జీవితం నీకు ముఖ్యం . అందరూ నమస్తే అన్నా అంటున్నారని మురిసిపోవడం కాదు . జీవితానికి ఉపయోగపడే ఉపాధి చూసుకొని , పార్ట్ టైం విలేఖరులుగా ఏదో ఆసక్తి ఉంటే పని చేయండి.

చాలా మంది మరణిస్తే అంత్యక్రియలకు చందాలు వసూలు చేయడం చూశాను . ఉపాధి చూసుకోవడం , ఉపాధి పొందే నైపుణ్యం పెంచుకోవడం ముఖ్యం అంటూ ఉపన్యాసం ఇస్తున్నాను … నేను అలా మాట్లాడుతుండగానే రాష్ట్ర నాయకులు వచ్చారు . నా ఉపన్యాసంలో కొంత విన్నారు . ఎంత విన్నా ఏదో ఒక ఉపాధి చూసుకోండి అనే మాటనే తిప్పి తిప్పి చెప్పాను ..

రాష్ట్ర నాయకులు వస్తూనే **ఇది జర్నలిస్ట్ ల యూనియన్ మీటింగ్ హక్కుల కోసం పోరాటాల గురించి ఉపన్యాసాలు ఉండాలి , ఉపాధి గురించి కాదు** అని నాకు ఓ చురక అంటించారు.. ఆ తరువాత జర్నలిస్ట్ అంటే ఏమిటీ ? యూనియన్ ఏమిటీ ? ఉద్యమాలు , త్యాగాలు అంటూ యూనియన్ నాయకులు బాగా మాట్లాడారు . నాకూ నిజమే అనిపించింది .

ఆ సమావేశం చివరలో విరాళాలు వసూలు చేశారు . స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకరు మరణించారు . అంత్యక్రియలు , తక్షణం కుటుంబం గడవడానికి ఏమీ లేదు . దానితో విరాళాలు వసూలు చేశారు .అప్పుడు యూనియన్ నాయకుడి ఉపన్యాసం నాకూ బాగానే నచ్చింది కానీ .. జర్నలిజం అంటే , యూనియన్ అంటే ఏమిటో అద్భుతంగా మాట్లాడిన ఆ యూనియన్ నాయకుడికి చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయని ఒకటి రెండు దశాబ్దాల తరువాత కానీ నాకు తెలియలేదు .

**************

మూడు దశాబ్దాల క్రితం నాటితో పోలిస్తే ఇప్పుడు అంత అమాయకులేం లేరు . చాలా మంది స్థానిక విలేకరులు కూడా బతకడం నేర్చుకున్నారు . అలానే చాలా మంది ఊబిలో చిక్కుకు పోయినట్టు అక్కడే ఉండిపోతున్నారు . అక్కడ ఉండలేరు , బయటకు రాలేరు . ఒక్కసారి ఆ గౌరవానికి , నాయకుల నుంచి అన్నా అనే పిలుపునకు అలవాటు పడి అక్కడే కొట్టుమిట్టాడే వారు ఉన్నారు . ఒక ఉద్యోగంలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్న వారూ ఉంటే ఉండొచ్చు …

**************

*********

1995-96 లో ఓ రోజు సచివాలయం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్ వస్తూ ట్యాంక్ బండ్ పై కాసేపు ఆగాను . బైక్ మీద ప్రెస్ అని చూసి ఓ పెద్దాయన వచ్చి ఏ పేపర్ అని అడిగారు . ఆంధ్రభూమి అని చెబితే సీరియస్ గా మీ జర్నలిస్ట్ లను అస్సలు నమ్మొద్దు అని ఏదో గొణిగాడు . ఏమైంది అంటే ఆంధ్రభూమిలో బాబురావు అని జర్నలిస్ట్ ఉండేవారు . అయన మరణించినప్పుడు ఆంధ్రభూమి జర్నలిస్ట్ లు చాలా మంది ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారట … తరువాత ఎవరూ పట్టించుకోలేదు . ఇదీ ఆయన కోపానికి కారణం .. ఎవడి బతుకు వాడికే కష్టం .. ఇంకా ఇతరుల కుటుంబాలను పట్టించుకునేంత , అండగా ఉండే అంత ఉంటుందా ? ఏదో మాట వరుసకు అలా అంటారు .

******************

నగరంలో లోకల్ విలేకరి ఒకరు మరణించిన వార్తలో .. ఆ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అనే వాక్యం చదివాక మిర్యాలగూడ మీటింగ్ , ట్యాంక్ బండ్ సంఘటన గుర్తుకు వచ్చింది. ఎప్పటిలానే మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుంది అని ప్రకటించారు . ఎవరికి ఎవరు అండగా ఉండలేరు . ఎవరి బతుకు వారికే సమస్య. కనీసం ఇప్పుడు మీడియా అకాడమీ ఎంతోకొంత ఆర్ధిక సహాయం చేస్తోంది . గతంలో అదికూడా లేదు .

*****

నాయకుడు మరణించినా , సినిమా వాళ్ళు మరణించినా వారి మరణం తీరని లోటు అనేది కామన్ డైలాగు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మాజీ సీఎం ఒకరు మరణిస్తే ఆఫీస్ లో ఉండగా ఫోన్ రింగ్ అయింది … వి.హనుమంతరావు ఫోన్ చేసి కాంగ్రెస్ రిపోర్టర్ గురించి అడిగితే ఇంకా రాలేదు అని చెబితే… సంతాపంలో నాదీ రాసేసుకో .. తెలుసు కదా, తీరని లోటు అని రాయి అని ఒక్క ముక్కలో ముగించేశారు . ఒక వ్యక్తి మరణం ఆ కుటుంబానికే తీరని లోటు .. ఆ సంగతి జర్నలిస్ట్ మిత్రులు బతికి ఉండగా గ్రహించాలి అని ఆశ … – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions