కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో సుడిగాలి సుధీర్ మీద హఠాత్తుగా ప్రారంభమైన కొన్ని నెగెటివ్ స్టోరీలు ఆశ్చర్యపరిచాయి… వాంటెడ్ పండుగాడ్ అని మొన్న మెరుపులా వచ్చిపోయిన ఓ సినిమా ఉంది కదా… దాని ఘోర, భీకర, భయానక, దారుణ, నీచ, నికృష్ట ఫలితానికి సుధీరే కారకుడట… దాంతో నిర్మాణంలో ఉన్న సుధీర్ ఇతర ప్రాజెక్టులపై దాని ప్రభావం పడుతోందట… ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయిందట… పండుగాడ్ హిట్టయితే, అది చూపించుకుని, సుధీర్ పేరు చెప్పుకుని, మార్కెటింగ్ చేసుకుందామని అనుకున్న నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడిపోయారట…
…… ఏమేమో రాసుకుంటూ పోయారు… ఈ రాతల్లో ఏదో దురుద్దేశం కనిపిస్తోంది… పాపం, సుడిగాలి సుధీర్‌ను బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది… కాకపోతే బోయింగ్ విమానంలో కుక్కినట్టు నూటాయాభై మంది వరకూ నటీనటుల్ని కుక్కారు సినిమాలో… కాదు, కాదు, స్టీరింగ్ ఆటో అది… కేవలం సుధీరే ఎలా బాధ్యుడయ్యాడు మరి..? ఐనా ఎక్కువ సేపు ఆ ముసలి రాఘవేంద్రుడే కనిపిస్తాడు కదా… ఈ వయస్సులో ఏం తక్కువైందో మరి… అవే పళ్లు, అవే బొడ్లు, అవే వెగటు వాసనలు… ఆ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ కూడా తనే… తను కదా బాధ్యత వహించాల్సింది…
నిజానికి అప్పట్లో ఒకటీరెండు హిట్ సినిమాలు తీసి, పేరు తెచ్చుకుని, డర్టీ హరితో రీఎంట్రీ ఇచ్చి, తన పాత పేరంతా కంపుకంపు చేసుకున్న ఆ ఎంఎస్‌రాజుకు రాఘవేంద్రరావుకు తేడా లేదనిపిస్తుంది… సేమ్, రాంగోపాలవర్మ… లేటు వయస్సు పర్వర్షన్స్… ఆమధ్య పెళ్లిసందD అనే ఓ తిక్క సినిమా తీశాడు, మళ్లీ వెంటనే ఈ పండుగాడ్… టైటిల్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల ఎంపిక, కథ, కథనం… మొత్తం ఉత్త డంపింగ్ యార్డు బాపతే… ఈ సినిమాలో సుధీరే లేడుగా… ప్రతి సినిమాలోనూ ఓ సెంటిమెంటుగా కనిపించే వెన్నెల కిషోర్ ఉన్నాడు… అంతకుముందే ప్రతి సినిమాలోనూ తప్పక కనిపించే బ్రహ్మానందం ఉన్నాడు…
Ads
హీరోగా చేసిన సప్తగిరి, సునీల్, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబులు కూడా ఉన్నారు… ఇంకా షాళా మంది కనిపిస్తారు… ఆడ తారల్లో మేమే తోపులం అని విర్రవీగే శ్రీమతి అనసూయా భరధ్వాజ్ ఉంది… విష్ణుప్రియ, ఆమని ఎట్సెట్రా ఉన్నారుగా… అఫ్‌కోర్స్, దీపిక పిల్లి కూడా… వీళ్లెవరూ బాధ్యులు కారట… ఒక్క సుధీరే బాధ్యుడట… ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈ సినిమాకన్నా నయం… జనం ఎడమకాలితో ఈడ్చి తన్నారు… సరైన పనిష్మెంటే…
నిజానికి సుధీర్ మంచి గ్రేస్ ఉన్న డాన్సర్… సేమ్, దీపిక పిల్లి… చూడటానికి చిన్న పిల్లలా కనిపిస్తుంది కానీ మంచి డాన్సర్… వాళ్లే ఈ సినిమాలో కాస్త చూడబుల్… మిగతా కేరక్టర్లన్నీ సోసో… అలాగని సుధీర్ పెద్ద పొడుస్తాడని కాదు… తను తీసిన త్రీమంకీస్ పరమదరిద్రం… క్షుద్రవెగటు కంపు… ఏదో కమెడియన్‌గా, టీవీ హోస్ట్‌గా బతకడంకన్నా ఈ సాఫ్ట్‌వేర్ సుధీర్ వంటి సినిమాలు కాస్త బెటరనేది సుధీర్ ఉద్దేశం కావచ్చు… అవేవీ నడవవు అని తనకూ తెలుసు…
చాలామంది సినీకమెడియన్లే హీరోలై, జనం ఛీఫోరా అనేసరికి, మళ్లీ మొహం కనిపించకుండా పోయినవాళ్లున్నారు… బుద్ధిగా మళ్లీ కమెడియన్లుగా మారి, బతుకు మరీ బస్టాండ్ కాకుండా కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు… అలాంటిది టీవీ కమెడియన్లకు సోలో హీరోగా క్లిక్ కావడం ఎంత కష్టం..? ఫైట్లు చేస్తా, డాన్సులు చేస్తా అంటే కుదరదు… ఆల్‌రెడీ టీవీల్లో చూసీ చూసీ బోర్ కొట్టిన మొహాలు కొత్త ప్రయోగాలతో ప్రయత్నించాలి… కానీ ఆ రిస్క్ ఎవరు తీసుకోవాలి..?
ప్రయోగాలు అనగానే అదేదో సినిమాలో అల్లరి నరేష్‌లాగా బట్టలిప్పి, ఓ ఫోజు పెట్టించి, ఇదే నావెల్టీ అని ఫోజు కొట్టే డొల్ల టైపు కాదు… నిజంగానే కొత్తదనం కోసం ప్రయత్నించాలి, అంటే చౌక బడ్జెట్‌లో సినిమా తీయాలి… వెబ్‌సీరీస్ మరో మార్గం… ఒకటీఅరా రేటింగ్స్ వచ్చినా సరే, అవే అత్తాకోడళ్ల చెత్త విద్వేషాలు, విషప్రయోగాలు, కుట్రలు, కడుపులు తీయడాలు, కాపురాలు కాల్చే విషపు సీరియళ్లు తప్ప ఇంకేమీ చేతకాని ఎదవ దరిద్రపు టీవీ దర్శకుల్ని వెక్కిరించేలా టీవీల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయవచ్చు…
స్పేస్, స్కోప్ అయితే ఉంది… కానీ డొల్ల క్రియేటివ్ టీమ్స్ ఏమేరకు చొరవ తీసుకుంటాయనేది అతిపెద్ద ప్రశ్న… ఐనా అంత సోయి ఉండి ఉంటే సుధీర్ ఈ పండుగాడ్‌లో చేసేవాడు కాదు కదా అంటారా..? నిజమే… సో, సుధీర్ అంటే ఏడుపు అవసరం లేదు, తనది చాలా చిన్న పరిధి… చాలా…!! తనవి ఏవో పరిమిత స్థాయి కలలు, ఆశలు… వాటిని కూడా తొక్కేస్తారేంట్రా బాబూ…!!
Share this Article