Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!

October 25, 2025 by M S R

.

రివర్స్ వాకింగ్ లో పదండి వెనక్కు
పదండి తోసుకు

“నడక నా తల్లి,
పరుగు నా తండ్రి,
సమత నా భాష,
కవిత నా శ్వాస”
అన్నాడు విశ్వంభరుడు సి నా రె. నిజమే. పరిణామక్రమంలో మనిషి నిటారుగా లేచి రెండు కాళ్ళమీద నడవడానికి ఎన్ని లక్షల ఏళ్ళు పట్టిందో తెలుసుకుంటే అదో పెద్ద ఆంత్రోపాలజీ పాఠమవుతుంది. నడక వాకింగ్. నడత ప్రవర్తన.

Ads

పారాడే పిల్లాడు లేచి రెండడుగులు వేస్తే ఇంట్లో పండగే. ఎవరి చేయీ పట్టుకోకుండా నాలుగడుగులు వేస్తే ఇక ఆ జింక పరుగులను ఆపడం దేవుడి తరం కూడా కాదు. తప్పటడుగులు దాటినవేళనుండి నడుస్తూనే ఉండాలి. నడిపించే తోడు లేకపోయినా జీవనపోరాటంలో నడక ఆగడానికి వీల్లేదు. లేచి అటో ఇటో ఎటో ఒకవైపు నడవకపోతే మన మీదే పిచ్చిగడ్డి మొలిచి మన ఉనికి మనకే ప్రశ్నార్థకమవుతుందని- అన్నాడు పోరాటాల పురిటిగడ్డ జగిత్యాల మట్టిబిడ్డ అలిశెట్టి ప్రభాకర్.

“మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం…”
అని శ్రీశ్రీ అయితే చాలా ముందుకు తీసుకెళ్లిపోయాడు.

“ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..
నడవరా ముందుగా…”
అంటూ నడిపించాడు సిరివెన్నెల.

పాపం ఈ కవులందరూ సమాజాన్ని ఎలాగైనా ముందుకు నడిపించాలని చాలా తపించారు. అక్షరాలను దివిటీలుగా వెలిగించారు. కారు చీకట్లలో ఉన్న సమాజానికి దారి దీపాలయ్యారు. మనం లేవలేకపోతే, లేచి నడవలేకపోతే వారే వెన్ను తట్టి లేపారు, లేపి చేయి పట్టుకుని నడిపించారు. కవులను ఇప్పుడెవరూ పట్టించుకోకపోయినా…ఇప్పటికీ మనల్ను మునుముందుకు నడిపించడానికి వారి ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

ఇన్నాళ్ళకు వాళ్ళకు ఆ శ్రమ తప్పేలా ఉంది. ఎందుకంటే ముందుకు నడవడంకంటే వెనక్కు నడిస్తే శారీరక ఆరోగ్యానికి రెండు రెట్లు ఎక్కువ లాభమని శాస్త్రీయంగా రుజువయ్యింది.

వాకింగ్ అనగానే ముందుకు నడవడమే అనే రోజులు పోయి… అలిశెట్టి, సిరివెన్నెల అన్నట్లు ఎటైనా నడిచే రోజులొచ్చాయి. అందునా వెనక్కు నడిస్తే లాభాలే లాభాలని అధ్యయనంలో తేలింది.

# మరింత శ్రద్ధగా మనసుపెట్టి నడుస్తారు.

# తొడ కండరాలతోపాటు మిగతా కండారాలకూ బలం

# జంటగా, లేదా ఒకరు ముందు ఒకరు వెనుక ఉండి నడిస్తే ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకోవచ్చు.

# ట్రాఫిక్ , జనసంచారం ఉన్నచోట్ల వెనక్కు నడిస్తే ప్రమాదం కాబట్టి… సరైన ప్రదేశంలోనే వెనక్కు నడవాలి. ట్రెడ్ మిల్ మీద తక్కువ స్పీడ్ తో హ్యాండిల్స్ పట్టుకుని రివర్స్ వాకింగ్ చేయవచ్చు.

ఇప్పుడు క్రమాలంకారంలో సినారె, అలిశెట్టి, శ్రీశ్రీ, సిరివెన్నెలలను పిలిస్తే-

“పదండి వెనక్కు
పదండి తోసుకు
రివర్స్ వాకింగ్ పిలిచింది!
శరీర కండరాలు కదిలిస్తూ
పోదాం పోదాం వెనువెనక్కు…”

అని అందరూ ముక్తకంఠంతో అంటారేమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమంటవ్ గంభీర్..? మనం పన్నిన ‘పిచ్చు’పై మనమే బోల్తా అన్నమాట..!!
  • అగ్నితుఫాన్లన్నీ చల్లగా, చప్పగా ‘ఇల్లు’ వదిలి నిష్క్రమించాయి..!!
  • మరో పొలిటికల్ బిడ్డ కుటుంబానికి దూరం… ఎవరు ఈ బీహారీ కవిత..?!
  • జై వారణాసి శ్రీరామ్..! ఉన్నారో లేదో తెలియని దేవుళ్లూ దిగిరావల్సిందే..!!
  • నేరాలు చేసేవాడు పెళ్లాంతో బాగుండాలి… లేకపోతే కొంప ఖల్లాసే…
  • సాలు మరద తిమ్మక్క… 114 ఏళ్ల బతుకంతా పచ్చటి చెట్ల వరుసలే…
  • ఓహ్…! జుబ్లీ హిల్స్‌లో ఓడింది జగన్ రెడ్డి… గెలిచింది చంద్రబాబా..?!
  • అసలు రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక పనికిరాదా..!?
  • సుమలత ఖాళీ చేయదు… రాజేంద్ర ప్రసాద్ అమ్ముకోలేడు… అల్లరల్లరి..!!
  • ఓ సైంటిస్టు ఘన సృష్టి..! కానీ మన కుళ్లు వ్యవస్థ తనను చంపేసింది..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions