అన్ని కథలకూ ఫుల్ స్టాప్స్ ఉండవు… కొన్ని కథలు ఆగిపోతాయి కానీ మళ్లీ కదులుతయ్ ఎన్నేళ్లకో… ఏ కారణం చేతో…. అప్పటిదాకా వాటిని ఆపి ఉంచేది కేవలం విరామచిహ్నాలే… ఇదీ అలాంటి కథే… అదీ ఓ అత్యాచారం కథ… సినిమా కథ కాదు, దిక్కుమాలిన టీవీ సీరియల్ కథ కానేకాదు… అసలు కల్పనే కాదు… వాస్తవం… పాపులర్ సీరియల్ కార్తీకదీపాన్ని మించిన కథ… భారతంలో కర్ణుడిని పెంచుకున్న సూతదంపతులు ఏరోజూ నోరుజారి మీ తల్లి ఫలానా అని చెప్పలేదు… చెబితే కర్ణుడు వెళ్లి కుంతిని నిలదీసేవాడా..? నా తండ్రి ఎవరో చెప్పు, అప్పటి కథేమిటో చెప్పు అని నిగ్గదీసేవాడా..? ఏమో… ఈ కథ మాత్రం ఉత్తరప్రదేశంలోని షాజహాన్పూర్లో జరిగింది… ఇంకా ఈ పట్టణం పేరు మార్చనట్టుంది యోగీ… అక్కడ పద్నాలుగేళ్ల బాలిక ఓ దంపతుల దగ్గర ఉండేది… పఠనాసౌలభ్యం కోసం ఓ పేరు కావాలి కదా… పోనీ, ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం లవంగి అని పెట్టుకుందాం… ఓరోజు ఎవరింటికో వెళ్లినప్పుడు… ఓ యువకుడు నిర్బంధించి రేప్ చేశాడు… విషయం బయట చెబితే ప్రాణం తీస్తా అన్నాడు… 90 శాతం రేప్ కేసులు ఇలాంటివే కదా… బోలెడు బయటపడని కేసులూ ఇవే కదా… ఇది తెలిసిన వాడి తమ్ముడు ఓరోజు తనూ రేప్ చేశాడు… ఎలాగూ నోరుమూసుకున్న కేసే కదా అని ఇంకా అలుసు…
ఆ ఇద్దరు సోదరులూ ఆమెను ఎడాపెడా వాడేసుకున్నారు… కథ ఆగదు కదా… మాసిపోలేదు కూడా… ఆమెకు కడుపొచ్చింది… అప్పటికే అబార్షన్ గడువూ తీరిపోయింది… ఆమెను లక్నోకు తీసుకెళ్లారు… ప్రసవం తరువాత తమకు తెలిసిన నిస్సంతు దంపతులెవరికో ఆ మగబిడ్డను ఇచ్చారు… వాళ్లు కూడా ఈ బిడ్డ ఓ పాప ఫలితం కదాని ఛీత్కరించలేదు… దేవుడిచ్చిన కొడుకు అనుకుని హత్తుకున్నారు… కథ ఇక్కడ కూడా ముగియలేదు… లవంగికి ఓ పెళ్లి చేశారు… కొన్నాళ్లు కాపురం సాగింది… ఇక అన్నీ చక్కబడ్డట్టే అనుకుంది లవంగి… ఈలోపు ఈ భర్త ద్వారా ఓ కొడుకు పుట్టాడు… కానీ భర్తకు తన కుంతిత్వం గురించి తెలిసింది… పెళ్లికాకముందే రేప్, కొడుకు కథ తెలిసింది… నేను బకరా అయ్యాను అనుకుని తెగబాధపడిపోయి, ఛిఫో, నేనొల్ల నిన్ను అని ఆమెను వదిలేశాడు… బయటికి గెంటేశాడు… ఆమె కథ మళ్లీ మొదటికి వచ్చింది…
Ads
కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంది… ఆ రేప్, ఆ పెళ్లి ఎట్సెట్రా జరిగిపోయి 27 ఏళ్లు గడిచిపోయాయి… టీన్స్‌లోనే కొడుకును కన్న లవంగి కూడా నలభైలోకి వచ్చేసింది… ఎక్కడో పెరుగుతున్న తన మొదటి కొడుకు కూడా పెద్దవాడైపోయాడు… ఇన్నాళ్లూ ఈ కర్ణబాబుకు అసలు నిజం చెప్పకుండా పెంచిన దంపతులు ఈమధ్య తనకు తన పాత కథంతా చెప్పారు… బరువు దించుకున్నారు… దించుకున్నామని అనుకున్నారు… కానీ అసలు కథ అక్కడే పెద్ద మలుపు తిరిగింది… ఆ యువకుడు హతవిధీ, ఇదా నా పుట్టుక కథ అని కాసేపు ఏడ్చి ఊరుకోలేదు… మనసులో ఏం అనుకున్నాడో గానీ కన్న తల్లి దగ్గరకు వెళ్లాడు… అడిగాడు… ఆమె బోరుమంటూ ణి-ఝ-మే భ్భా-భ్బూ అంటూ తెలుగు సినిమాలో తల్లి స్థాయిలో శోకాలు పెట్టింది… ఎవడి వల్ల నేను పుట్టాను అనడిగాడు… ఆమె తెల్లమొహం వేసింది… ఇద్దరు రేపిస్టుల్లో ఎవడి వల్ల వాడు పుట్టాడో ఆమె ఎలా చెప్పగలదు..? దేవుడికే తెలియాలి బాబూ అని తప్పించుకోచూసింది… దేవుడిని అడిగైనా సరే నాకు నిజం చెప్పు, నా ఒరిజినల్ తండ్రి ఎవడో నాకు తెలియాలి అని ఆ కొడుకు పట్టుబట్టాడు… ఇప్పుడామె ఏం చేయాలి..?
ఏ జర్నలిస్టో, ఏ అడ్వొకేటో సలహా ఇచ్చి ఉంటాడు… ‘అయ్యా, 27 ఏళ్ల క్రితం, తేదీ, నెల గుర్తుకులేవు, ఫలానా ఇద్దరు నన్ను రేప్ చేశారు, అందులో ఒకడి వల్ల కొడుకు కూడా పుట్టాడు, సమాజం తన్నితరిమేస్తుందనే భయంతో నేను నోరుమూసుకుని బతికాను… ఇప్పుడు తప్పదు, ఏ రేపిస్టు పాపాన్ని నేను కన్నానో మీరే తేల్చాలని పోలీసు కేసు పెట్టింది… ముందుగా వాళ్లకు అసలు కథే అర్థం కాలేదు, తరువాత కాసేపటికి బోధపడి జుత్తు పీక్కున్నారు… తాజా తాజా రేప్ కేసుల దర్యాప్తే కష్టమవుతోంది, ఏ పురాతన కేసులూ నెత్తిపై పడుతున్నాయని బాధపడ్డారు… సరే, ఇదీ చూద్దాం అనుకుని, కేసు నమోదు చేశారు… అసలు రేపిస్ట్ తండ్రి ఎవరో తేల్చడానికి… ఈ యువకుడికీ, ఆ ఇద్దరు సందేహితులకు డీఎన్ఏ పరీక్షలు చేయిస్తున్నారు… దాంతో తేలిపోతుంది… ఆ ఇద్దరి డీఎన్ఏలు సరిపోలకపోతే మరో కథ తెర మీదకొస్తుంది… సరే, ఒకవేళ ఏ కీచకుడి డీఎన్ఏతో పోలిక కుదిరిందీ అనుకుందాం…
ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి..? సదరు తండ్రి మీద రేప్ ఛార్జెస్ పెట్టి లోపలేయాలా..? డీఎన్ఏ సాక్ష్యం శిక్షకు సరిపోతుందా..? రేప్ జరిగిందని అది నిర్ధారిస్తుందా..? అవున్నిజమే, ఇష్టపూర్వకంగానే నాతో గడిపింది అని చెప్పినా కుదరదు, ఆమె మైనర్ కాబట్టి… ఇద్దరమూ సహజీవనం చేశాం కొన్నాళ్లు అని చెప్పినా కుదరదు, మైనర్లతో సంభోగం రేప్‌తో సమానం కాబట్టి… ఆమెను పెళ్లి చేసుకుంటాను, కేసూ, శిక్షా మాఫ్ చేయండి, ఇప్పుడు అదీ ట్రెండే కదా అని ఆశగా అడిగితే… తన సొంత పెళ్లాం పిల్లలు తన్నితరిమేస్తారు… లవంగి రెండో కొడుకు కూడా దేహశుద్ది చేస్తాడు… రేప్ చేసి కన్నావు కదరా నన్ను అని ఈ కర్ణబాబే పీకపట్టుకుని పిసికే ప్రమాదం కూడా ఉంది… మరి ఈ కేసుకు పరిష్కారం ఏమిటి..? ఛఛ, పెంచిన పేరెంట్స్ ఏమీ చెప్పకపోతే బాగుండేది అని నిట్టూరుస్తున్నారా..? అలా జరిగితే ఈ కథెక్కడిది..? జరిగింది కాబట్టే ఓ కార్తీకదీపం కథ…!!
Share this Article