.
మనసుకునచ్చే పనే అయినా ఎప్పుడో కానీ కుదరదు…
ఏంటో చాలా కాలం తరువాత ఇంట్లో గడిపాను. అవును ఇంట్లోనే…
పాత మిత్రుల్ని పలకరించాను వాట్సాప్ మెస్సేజ్ కాదు. కాల్ చేసి మాట్లాడాను. ముందు ముందు రాబోవు కాలంలో దోస్తుల గొంతు వినడం మాటలు కలపడం ఏవేవో గుర్తు తెచ్చుకొని అబ్బురపడడం కూడా అద్భుతమైన ప్రక్రియగా పరిగణిస్తామేమో..
చిత్రంగా మనసు ఎప్పుడు గడుస్తున్న ఘడియలో గడిచిన గతంలో నుండి సుగంధాలని వెలికితీయడంలో ఇట్టే నిమగ్నమవుతుంది.
*
మొక్కల్లో కలుపు తీసాను.
బచ్చలి, వామాకు బాగా వస్తోంది.
నెల క్రితం కొన్ని పూల మొక్కలతో పాటు బొప్పాయి కూడా తీసుకొచ్చా, ప్రహారి గోడ అవతల అంటే రోడ్డు వైపుకు నాటా., మొక్క సరిగా వస్తుందో రాదోనని అనుకున్నా కానీ విరివిగా కురుస్తున్న జల్లులకి కావాల్సినంత తడి ఉండేసరికి ఆ మూరెడు లోతు నేలలో బానే ఏనుకుంది.
Ads
అనుకుంటాం కానీ ఎంత మనసుకు నచ్చిన పనైనా ఒక యజ్ఞంలాగా నిర్విరామంగా శ్రద్ధతో చేస్తే తప్ప ఏ పనికి న్యాయం చేయలేము. ముఖ్యంగా మొక్కల పెంపకం గార్డెనింగ్ లాంటి వాటికి ఓపిక చాలా అవసరం.
*
ఈ రోజు వామాకు పచ్చడి చేద్దామనుకున్నా కానీ సండే స్పెషల్ అని పనీర్ దమ్ బిర్యాని చేసా..
వామాకు బహుశా తెలంగాణ ముఖ్య వంటకం కాకపోవచ్చు. వామాకు బజ్జీలు చేస్తారని విన్నా కానీ ఎప్పుడూ తినలేదు…
నాకు రాఘపురం సమ్మక్క జాతరకు వెళ్లే దారిలో చాయ్ కోసం ఎడ్ల బండి ఆపినప్పుడు పెద్ధోల్లంతా ముచ్చట పెట్టుకొని చాయ్ సంగతి చూసుకుంటుంటే… మేము పిల్లకాయలం అంతా చాయ్ దుకాణం సుట్టు పక్కల ఉన్న పిల్లుల్ని, కుక్కల్ని, మొక్కల్ని చూసే పనిలో ఉండగా కంట పడింది వామాకు మొక్క…
అదేం చెట్టని అక్కడున్న ముసలమ్మని అడిగితే, నాలుగు ఆకులు తెంపి, కొంచెం ఉప్పు కలిపి, పాన్ లాగా మలిచి, ఒక్క లవంగం పైన కుచ్చి, చేతికిచ్చి, నోట్లో పెట్టుకొని నవులండి అనడంతో అందరమూ తిన్నాం… తర్వాత తెలిసింది అది దగ్గు జలుబుకి చక్కని ఔషధం అని.
తిరిగి ఇంటికెళ్లేటప్పుడు తలా రెండు కొమ్మలు తెంపుకొని పట్టుకెళ్లాం. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే కొమ్మను తెంపి నేలలో గుచ్చితే చాలు నాలుగు రోజుల్లో వేళ్ళూనుకుంటుంది. అందుకే అక్కడ తెంపుకొచ్చిన ఒక్క కొమ్మ వంద ఇళ్లకు వంతు పట్టింది…
మా అత్తమ్మ అనుకుంటా మూకుడులో రెండు పావుల నూనె పోసి, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేయించి… అలాగే కడిగిన వామాకు ఆకులు, లేత కాడలు కూడా అందులోనే కలిపి, దగ్గరికి అయ్యేంత వరకు వేయించింది.
అంతకు ముందే మాములుగా వేపిన పల్లీలు, నువ్వులు కూడా అందులో పోసి, గట్టిగా కలియపెట్టి, రోట్లో మెత్తగా దంచి పచ్చడి చేసింది. నాలుకకు తగిలిన అప్పటి రుచిని తలుచుకుంటే ఇప్పటికి నీళ్లూరుతాయి…
ఏం చేద్దాం, మాలాంటి శాకాహారులకి సండే స్పెషల్ అంటే వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యాని. ఐదారేళ్ల క్రితం నుండి ఇక్కడ సఫీల్ గుడాలో పనీర్ కుండ బిర్యానీ ఫేమస్. చాలా బావుండేదని ఎక్కడెక్కడి నుండో వచ్చేటోళ్లు, కానీ ఇప్పుడు తీసేసారు ఎందుకో తెలీదు… చెప్పా కదా, యజ్ఞంలా సాగించలేకపోతే ఏదైనా అంతరించక తప్పదు. అక్కడ తిన్న అలవాటుకు ఆ రుచి మళ్ళీ దొరక్కపోయేసరికి దాని ఊసే ఎత్తలేదు ఇన్నిరోజులు…
అదే హోటల్ లో పని చేసిన సాహు ఎప్పుడు చూసినా నమస్తే సాబ్ అని పిలిచేటోడు. ఒరిస్సా తన పుట్టినూరు.. ఆ మధ్య కాయగూరల సంతలో కనిపిస్తే దగ్గరకొచ్చి నవ్వుతూ పలకరించాడు. పది నిమిషాల పిచ్చాపాటి తరువాత అడిగా పనీర్ బిర్యానీ ఎలా చేస్తారు అని…
రెండు నిమిషాల్లో చక్కగా వివరించాడు. ఎందుకు ఫేమస్ అయ్యిందన్న దానికి కూడా ఒక కిటుకు చెప్పాడు. అంచుర్ (ఎండు మామిడి) పొడి మరియు కసూరి మేథీ.. ఈ రెండు కూడా హైద్రాబాద్లో ఎక్కడ పెద్దగా వాడరు.. దాని మోతాదు హెచ్చుతగ్గుల మీద రుచి ఆధారపడి ఉందని అర్ధమైంది. ఇక నేను ఉల్లిపాయలు తినని సంగతి అతనికి కూడా తెలుసు కాబట్టి రెండు టొమాటో ముక్కలు కూడా నూనెలో వేయించి వేస్తే మరింత రుచి ఉంటుందని చెప్పాడు.
ఇక ఈ రోజు ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మిస్సవుతున్న రుచిని నా చేతితో చేసుకొని సాధించా..
కాసింత తిన్నామో లేదో నిద్ర ముంచుకొచ్చింది…
*
సాయంత్రం మెలకువ రాగానే వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. లేచి డోర్ తీసి… గ్రిల్ ఇవతల నుండే రోడ్డు మీదుగా వీధిలోకి పారుతున్న నదీ ప్రవాహాన్ని గమనిస్తుండగా… ఆ మధ్య సెలవుల టైంలో ఎవరూ లేరని చూసుకొని, పావురం మల్లె తొట్టిలో రెండు గుడ్లు పెట్టింది.
నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ రోజూ డోర్ తీయగానే లేచి ఎగిరిపోయేది. కానీ ఇప్పుడు గుడ్లు వర్షం జల్లుకి తడిచిపోతున్నాయి. నాక్కూడా ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ముందు ఒక గిన్నె తీసుకొచ్చి బోర్లించా, కాసేపు అయ్యాక ఆలోచించా, ఒకవేళ గుడ్లు కనిపించక కంగారు పడితే ఎలా? అక్కడి నుండి తీసి, ఇంకా ఎక్కడైనా పెడితే అది ఇంకా కష్టం, దానికి ఎవరు చెప్తారు. ఎలా తెలుస్తుంది…
వెంటనే వాణికి (తను పక్షుల ప్రేమికురాలు) ఫోన్ చేశా… ఉన్న విషయం చెప్పా… కంగారు పడాల్సిందేం లేదు, వర్షం తగ్గాక, అది వచ్చి కూర్చునే వీలుగా, వెచ్చగా ఉండేలాగా ఆ తొట్టిలో కొన్ని ఎండిన ఆకులు, దొరికితే ఎండు గడ్డి, కుదరక పోతే గోనె సంచి ముక్కని కత్తిరించి పెట్టమంది. నేను మూడో సూచన పాటించా ప్రస్తుతానికి. ఒకవేళ వారం రోజులైనా పావురం వచ్చి కూర్చోకపోతే ఆ గుడ్లని తన దగ్గరికి పంపించమని సూచించింది…
*
వర్షం తగ్గింది.
చల్లగాలిలో రయ్యిమని నేను, నందన్ సంతకి వెళ్లాం.
లేత సొరకాయ చాలా చిన్నది కంటపడింది.
దాంతో పాటు ఇంకొన్ని కూరలు సంచిలో వేసుకొని వస్తుంటే, పదికి మూడు అరిటాకులు అని గట్టి గట్టిగా అరుస్తుండడంతో మదిలో సొరకాయతో చేసిన మజ్జిగ పులుసు స్ఫురించింది.
తెలంగాణలో ఎక్కువగా పచ్చి పులుసు చింతపండుతో చేసేది, పప్పు చారు, నిమ్మకాయ చారు, టొమాటో చారు, కుదిరితే పెరుగుతో చల్ల చారు.
నర్సాపుర్ భ్యులా వాళ్ళింటికి వెళ్ళినపుడు చూసా.. ఆ రోజు పొద్దున్నే లేచి తోటలో నడుస్తుంటే లేత సొరకాయ కోసి, ఈ రోజు మజ్జిగ పులుసు చేసుకుందాం రఘూ అంది.
చర్చిలో వాళ్ళకి ప్రార్ధనలు ఎక్కువ, నేను వచ్చానన్న సాకుతో త్వరగానే బయటికొచ్చాము చర్చి నుండి…
నిన్నటి పెరుగు పుల్లగా అయ్యేవరకు అలానే ఉంచినట్టుంది. ఒక గిన్నెలో నెమ్మదిగా చిలికి, మజ్జిగ చేసి, కొంచెం ఉప్పు వేసి, పక్కన పెట్టి, సొరకాయని సుతారంగా చెక్కు తీసి, సన్నని చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి, గిన్నెలో నీళ్లు పోసి, చిటికెడు ఉప్పు, పసుపు వేసి ముక్కల్ని నీళ్లలో మెత్తగా ఉడికించి, నీళ్లు వడకట్టి..,
ఇక చిన్న మూకుడులో రెండు పావుల నూనె పోసి, మూడు తరిగిన పచ్చి మిర్చి, ఒక నాలుగు తొడిమె తీసిన ఎండు మిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, పోపుగింజెలు, మినప్పప్పు, శనగపప్పు కొద్ది కొద్దిగా వేసి వేయించి, కొంచెం నూరిన అల్లం ముద్ద, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి, చిటికెడు పసుపు వేసి, ఆ తర్వాత ఉడికిన సొరకాయ ముక్కల్ని వేసుకొని, నెమ్మదిగా కలిపి, అదంతా మజ్జిగ ఉన్న గిన్నెలోకి దింపేసి చక్కగా కలియబెట్టింది. స్టవుని స్లిమ్ లో ఉంచి కాసేపు పులుసుని వేడి చేసింది.
పక్కనే వీథి మూల మీదుగా నడుచుకుంటూ వెళ్లి, రెండు అరిటాకులు కొనుక్కొచ్చుకుని కూర్చున్నాం. వేడి వేడి అన్నం ఆవకాయ పచ్చడి, సొరకాయ మజ్జిగ పులుసు, మధ్య మధ్యలో కర్రు కర్రు మనే గుమ్మడికాయ వడియాలు… నీకు తెలుసా రఘూ, మజ్జిగ పులుసుని అరిటాకులో తింటే దాని రుచే వేరు అంది. నిజమే..
మళ్లీ అదే రుచిని ఈ రోజు ఇంట్లో తాక్షికి, నందన్ కి, కొంచెం తులసికి చూపించా…
*
కాలం ఎంత ముందుకు నెట్టినా ఇలాంటి రుచులు కొన్ని అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాల దొంతర్ల నెమర్లకు వారధులవుతాయి……… రఘు మందాటి
Share this Article