Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫేక్ వారసుల కథలనూ తెలుగు ప్రేక్షకులు ఆదరించెదరు..!!

December 13, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. జామాతా దశమ గ్రహః . అంటే ఏంటంటే, నవగ్రహాలు కొన్నాళ్ళు పీడించినా కొన్నాళ్ళకు వదిలేస్తాయి . జామాత పట్టుకుంటే వదలడు . కొందరు జామాతలు చిక్కరు దొరకరు . అలా అని అందరు జామాతలు ఒకే రకంగా ఉండరు . కొందరు మంచి జామాతలు ఉంటారు . అక్కడక్కడ దుష్ట జామాతలు ఉంటారు .

బావమరిది చావు కోరే ఇద్దరు జామాతలు ఉంటారు ఈ సినిమాలో . వారికి బుధ్ధి చెప్పే వారసుడు రావటమే 1988 అక్టోబరులో వచ్చిన ఈ వారసుడొచ్చాడు సినిమా .

Ads

వెంకటేష్ కెరీర్లో చాలా చక్కటి ఫేమిలీ సెంటిమెంట్ మూవీ . బాగుండటమే కాకుండా కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది . అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా . తరచూ టివిలో వస్తూనే ఉంటుంది . మొన్ననో అటుమొన్ననో కూడా వచ్చింది .

1987 లో తమిళంలో వచ్చిన Theertha Karaiyinile అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో మోహన్ , రూపిణి లీడ్ రోల్సులో నటించారు . స్రవంతి మూవీస్ బేనర్లో ఈ వారసుడొచ్చాడు సినిమాకు దర్శకుడు మోహన్ గాంధీ . చాలా బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . ఎక్కడా స్లో అవదు . క్లైమాక్స్ దాకా గబగబా లాగేస్తుంది .

చిన్నప్పుడు ఓ కుర్రాడు తన స్నేహితుడిని చెరువులోకి తోసేసి ఇంట్లోంచి పారిపోతాడు . చానాళ్ళ తర్వాత పత్రికల్లో ఓ ప్రకటన చూస్తాడు . ఆ కుర్రాడు చనిపోలేదని ; ఇంటికి రమ్మని ఆ ప్రకటన . కానీ అప్పటికే క్షయ రోగంతో అవసానదశలో ఉన్న ఆ రఘు అనే అతను తన స్థానంలో తన ప్రాణమిత్రుడు బోస్ బాబుని ఒప్పించి పంపుతాడు . బోస్ బాబు అంటే వెంకటేష్ .

వెంకటేష్ అలంపురం అనే ఆ గ్రామానికొచ్చి , తనే నిజమైన వారసుడిని అని గ్రామస్తులను ముఖ్యంగా జామాతలను నమ్మించి ఇంట్లోకి చేరి తల్లి ప్రేమకు పాత్రుడు అవుతాడు . చిన్నప్పుడు చనిపోయిన కుర్రాడి చెల్లెలు సుహాసిని వారసుడి మీద పగ పెంచుకుంటుంది .

ఆమెను కూడా తన లైన్లోకి తెచ్చుకుని హేపీగా డ్యూయెట్లు పాడేసుకుంటాడు . చివర్లో చనిపోయే ముందు తన పుట్టిన గడ్డ మీదే చనిపోవాలని అసలు వారసుడు రావటం , నిజం అందరికీ తెలవటం , అందరూ వెంకటేషుని ఆమోదించటం , జామాతలకు బుధ్ధి రావటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

హీరో వెంకటేష్ బాగా నటించారు . ఆయన తర్వాత చెప్పుకోవలసింది తల్లి పాత్రలో నిర్మలమ్మనే . చాలా బాగా నటించింది . తర్వాత చెప్పుకోవలసింది అంబాజీ రావు పాత్రలో మోహన్ బాబు , జామాతల పాత్రల్లో కోట శ్రీనివాసరావు , గొల్లపూడి మారుతీరావులను .

మోహన్ బాబు పాత్ర , ఆ పాత్రలో నటన , ఆయన ప్రత్యేక డైలాగ్ డెలివరీ బాగుంటాయి . అలాగే కోట శ్రీనివాసరావు తెలంగాణా యాస కూడా బాగుంటుంది . ఇతర ప్రధాన పాత్రల్లో అక్కలుగా శ్రీలక్ష్మి , రమాప్రభలు , మేనకోడళ్ళుగా మాలాశ్రీ , సంధ్య , నౌకరుగా బట్టల సత్యం , మోహన్ బాబు అసిస్టెంటుగా రమణారెడ్డిలు నటించారు .

మరో ముఖ్య పాత్ర , కామెడీ విలనుగా తనికెళ్ళ భరణి చాలా గొప్పగా నటించారు . ఈ సినిమా విజయానికి కారణమైన డైలాగులను కూడా ఆయనే వ్రాసారు . అసలు వారసుడిగా S N వసంత్ , వాంపుగా విజయలక్ష్మి , డబ్బింగ్ జానకి , సాక్షి రంగారావు , ఆనంద మోహన్  తదితరులు నటించారు .

తన అన్నను చంపిన రఘు బాబు మీద పగ పెంచుకున్న చెల్లెలుగా , తర్వాత నిజం తెలుసుకున్న ప్రేయసిగా , డ్యూయెట్లలో హుషారుగా , ఎమోషనల్ సీన్సులో రక్తి కట్టించిన హీరోయినుగా సుహాసిని బాగా నటించింది .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ వర్ణం నా కీరవాణి సంకేతం సూపర్ హిట్ సాంగ్ . Most melodious song . ఏలాద్రి వెంకన్న అంటూ సాగే సంక్రాంతి సంబరాల పాట కూడా బాగుంటుంది .

మిగిలినవి డ్యూయెట్లు . జిజ్జనక జనకు , చెంపదెబ్బ అమ్మాయి , పాచి పాల , గుజ్జనగుడి గువ్వల గున్నమ్మ అంటూ సాగుతాయి ఈ డ్యూయెట్లు . వెంకటేష్ , సుహాసిని మీద ఈ డ్యూయెట్లను దర్శకుడు మోహన్ గాంధీ  చక్కగా చిత్రీకరించారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర పాటల్ని శ్రావ్యంగా పాడారు .

సినిమాలో ఓ సినిమా పిచ్చిది ఉంటుంది . సినిమా టికెట్ కొరకు కానిస్టేబుల్ మొగుడి యూనిఫారాన్ని మోహన్ బాబుకు తాకట్టు పెడుతూ ఉంటుంది . మొగుడు డబ్బులు కట్టి యూనిఫారాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు . ఈ రెండు పాత్రలు మంచి కామెడీని అందిస్తాయి . సినిమాలో లోటు ఏంటంటే వయ్యారాల వై విజయ లేకపోవటం . ఆ పాత్రను విజయలక్ష్మి వేసింది .

  • మొత్తం మీద మంచి ఫేమిలీ సెంటిమెంట్ మూవీ . ఇప్పుడు ఈ సినిమాను చూస్తుంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అతడు గుర్తుకొస్తుంది . అ ఆ సినిమాను చూస్తుంటే మీనా , అల వైకుంఠ పురం చూస్తుంటే ఇంటిగుట్టు సినిమాలు గుర్తుకొచ్చినట్లు .

ఈ వారసుడొచ్చాడు సినిమా యూట్యూబులో పూర్తి నిడివితో లేదు . ముఖ్యమైన సీన్ల , పాటల వీడియోలు మాత్రమే ఉన్నాయి . సినిమా బాగుంటుంది కాబట్టి చూసి ఉండకపోతే చూడండి .

నేను పరిచయం చేస్తున్న 1193 వ సినిమా ఇది .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం సుమ..! ఈ సినిమా కూడా నీ కొడుక్కి అచ్చిరాలేదమ్మా..!!
  • గురువు లేడు, దక్షిణ లేదు… సుప్రీం కోర్టులోనే తేల్చుకుందాం…
  • ఓ ఇండియన్ స్పై కథతో సినిమా వస్తే… దానికీ కాషాయ ముద్రేనా..?!
  • ఫేక్ వారసుల కథలనూ తెలుగు ప్రేక్షకులు ఆదరించెదరు..!!
  • బాహుబలి ఉపగ్రహం… కక్ష్య నుంచి నేరుగా మొబైల్‌కే సిగ్నల్…
  • అది గులాబీ క్యాంపు… ‘పంచాయతీ స్కోర్ బోర్డు’ కూడా మార్చేయగలదు…
  • నిర్లక్ష్యం- ధిక్కారం- బాధ్యతారాహిత్యం..! తెలంగాణ మూవీ పాలసీ..!!
  • …. అందరూ తనూజను ఇక్కడే అండర్ ఎస్టిమేట్ చేశారు మరి..!!
  • అఖండ-3… అనంత తాండవం… స్టోరీ, స్క్రిప్ట్ రెడీ… నిర్మాత కావలెను..!!
  • ఆ దర్శకుడి ‘కత్తెర’ దెబ్బకు… కమలిని ఏకంగా టాలీవుడ్‌నే వదిలేసింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions