వ్యాక్సిన్లు ఎన్ని రకములు? అవి ఏవి? వాటి గుణదోషములను వర్ణింపుము? అన్న పది మార్కుల ప్రశ్నకు ఇది సమాధానం కాదు. వ్యాక్సిన్ల తొందరపాటు, అయోమయం, అస్పష్టత, గందరగోళం మీద మరింత గందరగోళం, భయపెట్టే సమాధానం. కాబట్టి వ్యాక్సిన్ల మీద- ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ మీద ఇప్పటికే స్పష్టత, ధీమా ఉన్నవారు ఇక్కడితో చదవడం ఆపేయవచ్చు. చదివి మరింతగా భయపడతామేమో అనుకునేవారు కూడా ఇక్కడితో చదవడం ఆపేయడం మంచిది.
వ్యాక్సిన్లు ప్రధానంగా నాలుగు రకాలు. ఆ సాంకేతిక వివరాలకు ఇది వేదిక కాదు కాబట్టి వాటి లోతుల్లోకి వెళ్లడం అనవసరం. లోకంలో డాక్టర్లు తప్ప ఏ దారినపోయే దానయ్య అయినా వ్యాక్సిన్ గురించి ఇప్పుడు అనర్గళంగా చెప్పగలడు. ఇంకో నెల, రెండు నెలల్లో భారతదేశంలో కరోనాకు సంవత్సరం నిండుతుంది. చూస్తుండగానే కరోనా ముళ్ల బంతికి తొలి ఏడు దొర్లిపోయింది. అదిగో వ్యాక్సిన్! ఇదిగో వ్యాక్సిన్! అనే వార్తలు లేని రోజు లేదు. చివరకు ఏవో రెండు, మూడు వ్యాక్సిన్ కోయిలలు తొందరపడి ముందే కూసినట్లున్నాయి. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ల పనితీరు, వాటిని హడావుడిగా అనుమతించిన విధానాల మీద చర్చ మొదలయ్యింది. దాదాపు ఆరు నెలలుగా వస్తున్న కరోనా వ్యాక్సిన్ వార్తలను మిక్సీలో వేసి రుబ్బితే- ఆ వార్తారస సారమిలా ఉంటుంది!
Ads
వ్యాక్సిన్ ఇప్పట్లో రాదు!
——————–
ఒక వ్యాక్సిన్ ఆవిష్కరించి, ప్రయోగాత్మకంగా పరీక్షించి, అన్ని అనుమతులు వచ్చి, బల్క్ గా తయారు చేసి జనం దగ్గరికి చేరడానికి కనీసం మూడు- నాలుగేళ్లు పడుతుంది.
నీళ్ల బాటిల్ లా వ్యాక్సిన్ సిద్ధం!
———————
తెల్లవారక ముందే ఆవుకు ఆకు పచ్చని పచ్చి గడ్డి మేత పెట్టాలి. లేదా హీనపక్షం బంగారంలా మెరిసే ఎండు గడ్డి అయినా పెట్టాలి. పొదుగును నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. ముందు దూడచేత కొన్ని పాలు తాగించాలి. దీన్ని పాలు చేపడం అంటారు. చేపు అన్నది పదహారణాల తెలుగు పదం కాబట్టి to let the milk flow అని ఇంగ్లీషులో చెప్పుకుంటే అందరికీ సులభంగా అర్థమవుతుంది. తరువాత కావాల్సినన్ని పాలు పితుక్కోవాలి. ఇదంతా కనీసం రెండు గంటల పని. లీటరు పాలు యాభై రూపాయలు. కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం ఇంతకంటే సులభం. పొద్దున్నే పాచి మొహంతో రబ్బరు బిరడా ఉన్న టూ ఫిఫ్టీ ఎం ఎల్ గాజు సీసాను కొళాయి ముందు పెట్టాలి. కొళాయి తిప్పాలి. సీసా నిండగానే బిరడా బిగించాలి. వ్యాక్సిన్ సిద్ధం. వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు. ఈ వ్యాక్సిన్ అయిదు రూపాయలే!
ఎన్నికల వ్యాక్సిన్!
—————-
తయారు కాని వ్యాక్సిన్, రాని వ్యాక్సిన్, ఉందో లేదో తెలియని వ్యాక్సిన్, ఎప్పుడొస్తుందో గ్యారెంటీ లేని వ్యాక్సిన్ ఓటర్లకు ఉచితం! ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ వ్యాక్సిన్ కు డిమాండే డిమాండు. కలలను అమ్మడం ఒక సృజనాత్మక స్వప్న వ్యాపార విద్య.
వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలే నయం!
——————
అదిగో తోక! ఇదుగో వ్యాక్సిన్ పులి! అంటూ వచ్చే వ్యాక్సిన్ వేసుకున్నా మూతికి మాస్కు ఉండాల్సిందే. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ కేవలం నైతిక స్థైర్య భ్రమాన్విత ధైర్యం చెబుతుంది- అంతే!
సైడ్ ఎఫెక్టుల కొల్లాటెరల్ డామేజ్!
———————–
ఒక దుష్ప్రభావంతో సమాంతరంగా అనేక నష్టాలు ఒకేసారి జరగడాన్ని కొల్లాటెరల్ డామేజ్ అని అనుకోవచ్చు. నిజానికి ఆ ఇంగ్లీషు మాటకు ఖచ్చితమయిన తెలుగు పారిభాషిక పదం ఇంతదాకా కాయిన్ కాకపోవడంతో తెలుగు భాషకు కూడా కొల్లాటెరెల్ డామేజ్ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్టులు ఉండవచ్చు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక అలిగి ఊడిపోవచ్చు!
మందు ముందెవరికి?
——————–
ఉన్న వ్యాక్సిన్ చిటికెడు. అవసరం గంపెడు, బోలెడు. ఎలా పంచాలో తెలియడం లేదు కాబట్టి మమ అనుకుంటే…వ్యాక్సిన్ తిలా పుణ్యం తలా పిడికెడు!
పరివర్తన ప్రవర్తన!
—————-
కరోనా అనేక మ్యుటేషన్ లు పొందింది. మ్యుటేషన్ అంటే పరివర్తన. ఇప్పుడు కరోనా ఏ పరివర్తనతో ప్రవర్తిస్తోందో చెప్పగల వ్యాక్సిన్ ప్రవచన పరివ్రాజక మహాశయులు లేరు.
రాజకీయ వ్యాక్సిన్
—————–
ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. ప్రజలను రక్షించాల్సింది ప్రభుత్వాలే. త్వరగా ఏదో ఒక వ్యాక్సిన్ వేయకపోతే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. గుడ్డిలో మెల్లలా, మెల్లగా గుడ్డిగా ఏదో ఒక వ్యాక్సిన్ పొడవకతప్పని పొలిటికల్ కంపల్షన్ పాలించే పార్టీలకు ఉంటుంది.
వ్యాక్సిన్ వ్యాపారం!
——————
అసలు కరోనా అన్న రోగమే ఒక కుట్రలో నుండి పుట్టించిన మాయ రోగమని కొందరి అనుమానం. లేని రోగానికి ప్రచారం, భయం కలిగించి మందులు, వ్యాక్సిన్లు అమ్ముకునే కుట్రలో కరోనా పుట్టిందని నమ్మేవారిని గౌరవించడం ప్రజాస్వామిక విలువల ప్రకారం మన కనీస ధర్మం!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article