.
ఎక్కడో, ఏదో ఇంటర్వ్యూలో జగపతిబాబు చెబుతున్నాడు… ‘నేను హీరో మెటీరియల్ కాదు, నన్ను ఒగ్గేయండి’ అని ఎవరితోనే ఖుల్లంఖుల్లా చెప్పాడట..! నిజమే, తను ఇంత సీనియర్ అయినా సరే, కొన్ని ఉద్వేగాలకు సంబంధించి మొహంలో ఆ ఫీల్ స్పష్టంగా పలకదు ఈనాటికీ… సకాలంలో హీరో వేషాలు మారేసి కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మారిపోయి మంచి పనిచేశాడు…
వాటికైనా కొన్ని ఎమోషన్స్ గట్రా పలకాలి కదా అంటారా..? సీనియారిటీతో ఎలాగోలా మేనేజ్ చేస్తాడు… ‘వదలా’ సినిమా చూశాక పాపం శమించుగాక, అనిపించింది మాత్రం ఇదే… సరే, కెరీర్ చివరి దశలో ఇక తనకు పోయేదేముంది గానీ…
Ads
లయ… ఒకప్పుడు కాస్త పద్దతైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది… తరువాత భౌతికంగా సినిమాలు మానేసి దూరమైంది… మళ్లీ వచ్చింది… రీఎంట్రీ మంచి కథలతో ఉండాలి కదా… పేలవమైన పాత్రలు… అందులో ఇదీ ఒకటి… పిల్లల తల్లి… ఏదో జగపతిబాబు, లయ గతంలో తెర మీద కాస్త పాపులర్ అయిన జంటే కదా, ఈ సినిమాకు కూడా కాస్త వర్కవుట్ అవుతుంది అనుకున్నట్టున్నాడు దర్శకుడు…
ఈ సినిమాలో అంత సీనేమీ లేదు… పైగా దర్శకుడు రాసుకున్న కథ కూడా పాత చింతకాయపచ్చడి… సజావుగా, అన్యోన్యంగా సాగుతున్న సంసారంలోకి అనుకోకుండా ఓ మెంటల్ కేరక్టర్ ప్రవేశించడం… కథ కాస్త అటూ ఇటూ తిరిగి, చివరకు హమ్మయ్య అని శుభం కార్డు వేసేసుకోవడం…. ఈలోపు ఎవరైనా థియేటర్‌లో మిగిలి ఉంటే, ఆ ప్రేక్షకులు కూడా ఉసూరుమంటూ వెళ్లిపోవడం…
ఏమాటకామాట సెకండ్ హీరోయిన్ (?)గా కథలోకి ప్రవేశించే హృతిక శ్రీనివాసన్ నటన నెగెటివ్ షేడ్స్‌తో బాగుంది… గతంలో మంచి మంచి ప్రాధాన్యమున్న పాత్రలు చేసిన అవసరాల శ్రీనివాస్ మరీ ఇలాంటి అప్రధాన, చిన్న పాత్రలకు పరిమితం అయ్యాడేమిటబ్బా అనిపిస్తుంది…
సినిమా కూడా అత్యంత పరిమిత పాత్రలతో, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది… ఖర్చు తక్కువే నిర్మాతలకు… ఇలాంటి సినిమాలకు థ్రిల్ ఫ్యాక్టర్ ముఖ్యం… అదుగో అదీ లోపించింది… ఈ పాత్ర లయ రాంగ్ సెలక్షన్… ఇదేకాదు, మరొకటీ ఉంది, మరో కథనంలో చెప్పుకుందాం… సెలవు… అన్నట్టు... తమ్మారెడ్డి భరధ్వాజ సినిమాయా ఇది ... !!!
Share this Article