చాయ్… చివరకు కాలగతిలో ఇదీ తన సహజ రుచిని కోల్పోయింది… రంగు వెలిసిపోతోంది… చిక్కదనం ఏనాడో పలచబడింది… కమ్మని సువాసన ముక్కుపుటాలను అదరగొట్టడం లేదు… ఎందుకో తెలియదు… పండుతున్న తేయాకులోనే ఆ నాణ్యత కొరవడిందా…? టీపొడి ప్రాసెస్ చేయడంలో ఆధునిక విధానాలు వచ్చి చెడగొట్టాయా..?
.
నిజానికి మార్కెట్‌లో టీ పౌడర్ రేట్లు మండిపోతుంటయ్… కానీ ఒకనాటి ఆ నాణ్యత, ఆ శ్రేష్టత మాత్రం కనిపించడం లేదు… ఒకనాడు బయట టీ తాగితే ఓ హుషారు… సీస గ్లాసులో ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ, ఒక్కో గుక్కా తాగితేనే ఆ చాయ్‌లోని అసలు మజా… ఇప్పుడన్నీ మన బతుకుల్లాగే ప్లాస్టిక్కులు, పేపర్ కప్పులే కదా… ప్చ్, పట్టుకుంటే చేతులు కాలి, తాగుతుంటే మూతులు కాలి… చర్రుమని నాలుక కాలి… సరిగ్గా ఒకటీరెండు గుక్కలకే ఖతం…
Ads
.
అల్లం చాయ్, నింబూ చాయ్, మసాలా చాయ్, ఇరానీ చాయ్… ఇప్పుడు రకరకాలు… ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్… ఇప్పుడు ఆ ఇరానీ కేఫ్‌లు చాలావరకూ మూతపడ్డయ్… ఆ టేస్టు కూడా లేదు… చాలావరకు అల్లం చాయ్ ఫేమస్ అయిపోయింది… స్పెషల్‌గా అప్పటికప్పుడు చేసి పోస్తారా అంటే ఎవరూ పోయరు… ఆల్‌రెడీ మరిగీ మరిగీ, ఓ పెద్ద ఫ్లాస్కులో నిల్వ చేరి, కస్టమర్ రాగానే కిస్సుమంటూ కప్పులోకి నవ్వుతూ జారుతుంది… మన ఖర్మ…
.
అప్పటికప్పుడు చేసిన చాయ్ కావాలనుకునేవాళ్లు, పాలు, చక్కెర వద్దనుకునేవాళ్లు లెమన్ చాయ్ ప్రిఫర్ చేస్తున్నారు… అది చేయడం కూడా నిజానికి ఓ కళ… చిక్కటి టీ డికాషన్‌లో కాస్త తేనె, సబ్జా గింజలు, పుదీనా ఆకులు… మన కళ్ల ముందే ఓ నిమ్మకాయ కోసి, గింజలు తీసిపారేసి, డికాషన్‌లో కలుపుతారు కదా… ఆ స్మెల్, ఆ లుక్ సగం ఫీల్ ఇస్తాయి…
.
మార్కెట్‌లోకి బ్లాక్ టీ పొట్లాలు, పౌడర్లు గట్రా చాలా వచ్చాయి గానీ… రేటు ఎక్కువ, పైగా పథ్యం చప్పిడి తిండిలా తాగినా తాగినట్టు ఉండదు… తాగకపోతే ఆత్మారాముడు ఊరుకోడు… చాయ్ తాగకపోతే చాలామందికి తలనొప్పి స్టార్టవుతుంది… వెరసి అదొక నిత్యావసరం… పాలూ, చక్కెర ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా చాలామంది… ష్, అసలు పాలూ, చక్కెర లేని చాయ్‌ను చాయ్ అని ఎందుకు పిలవాలి..? అదొక ద్రావకం, అంతే… (నిజానికి టీ కెటిల్ (కేతిరి), వడబోసే జాలీ (ఫిల్టర్), మరిగించే గిన్నె (టీపాన్), కప్పుసాసర్ లేదంటే గ్లాసు… వీటిని చూస్తుంటేనే టీ తాగిన సగం ఫీల్ వచ్చేస్తుంది అదేమిటో గానీ…)
.
మసాలా చాయ్ అంటే, చాట్ మసాలా, గరం మసాలా వేసేది కాదు… యాలకుల పొడిని కాస్త వేసి, మామూలు చాయ్‌కే మసాలా అదనపు విలువను జోడించేది… వాల్యూ యాడిష్… దాన్ని కప్పుసాసర్‌లో పోసుకుని తాగితేనే దాని ఫీల్…
.
ఈరోజు ఇంటర్నేషనల్ టీ డే అట కదా… అందుకే ఈ నాలుగు ముచ్చట్లు… నో, నో, 21 మే నాడు కదా అంటారా..? ఏ తేదీ అయితేనేం, వేడి వేడి మసాలా చాయ్ ఆ పేరుతో మరో రెండు కప్పులు లాగిస్తే సరి…!! వాహ్ ఉస్తాద్ వాహ్…
Share this Article