.
దేవుడు ఏ ద్వారంలో ఉండును? వైకుంఠ ప్రాప్తికి..?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు. కానీ ఆ దేవుడికి ఉత్తర ద్వారమో, వైకుంఠ ద్వారమో దిక్కుగా చేసి… మిగతా దిక్కులను , ద్వారాలను దేవదేవుడికైనా దిక్కులేనివిగా చేసి పెట్టాము. మిగతా ద్వారాలను మూసిపెట్టాము.
Ads
దేవుడికి దిక్కేమిటి? వాకిలి ఏమిటి? దేవుడున్నప్పుడు ఆయన లేని చోటు లేదు- లేని దిక్కు లేదు- రాని ద్వారం లేదు- పలకని రోజు లేదు- అన్న చిన్న విషయాన్ని పట్టుకోలేకపోతున్నాం.
ఈ దిగ్భ్రమ మీద కన్నడ శివ కథల్లో అద్భుతమైన కథనం ఉంది. కర్ణాటక శివగంగ నుండి ఒక యువకుల బృందం శ్రీశైలానికి కాలినడకన బయలుదేరింది. ఇరవై రోజుల పాటు ఆగి ఆగి సాగే పవిత్ర దీక్షా ప్రయాణం. బృందంలో ఒక యువకుడు ఒక రాత్రి అడవిలో దారి తప్పాడు.
కాసేపటికి ఒక పల్లె కనపడితే హమ్మయ్య అనుకుని వెళ్లాడు. పూరి గుడిసె అరుగు మీద ముసలి అవ్వ వక్కాకు నమలడానికి వక్కలను దంచుకుంటోంది. అవ్వా! నేను శ్రీశైలం వెళ్లాలి…దారి ఎటు? అని అడిగాడు.
అయ్యో ఇంత రాత్రి…అడవిలో వెళ్ళలేవు. ఈ ఊరి శిథిల శివాలయం మండపంలో పడుకుని ఉదయాన్నే సూర్యోదయాన్ని గమనించి తూర్పు వైపు కాలి బాటలో వెళ్ళు అంటుంది. సరే అలాగే…ఎక్కడుంది ఆలయం? అని అడుగుతాడు. ఇదో నేను కాళ్లు చాచిన వైపే వెళ్లు అంటుంది.
శివ శివా! శివుడున్న దిక్కున కాళ్లు చాచావా? మహాపరాధం! అంటాడు. అయితే శివుడు ఏ దిక్కున లేడో చెప్తే…అటువైపే కాళ్లు పెట్టుకుంటా! అంటుంది అవ్వ. పిచ్చిదిలా ఉంది అవ్వ అని విసుక్కుంటూ వెళ్లిపోతాడు.
అవ్వ చెప్పినట్లే మండపంలో పడుకుని ఉదయాన్నే తూర్పున కాలిబాటలో వెళితే సాయంత్రానికి శ్రీశైలం వస్తుంది. గుడి మెట్ల ముందు ఆ అవ్వే వక్కాకు దంచుకుంటూ ఏమి నాయనా ఏ దిక్కున వచ్చావు? అని అడుగుతుంది.
ఆ అవ్వలో యువకుడికి పరమశివుడు దర్శనమిస్తాడు. అన్ని దిక్కుల్లో ఉన్నవాడు, నాకు దిక్కై ఇలా దిగివచ్చినవాడు- అని అవ్వకు నమస్కారం చేసి పొంగిపోతాడు యువకుడు.
ఆ అవ్వ (శివుడు )అడిగిన ప్రశ్న-
“ಶಿವ ಯಾವ ದಿಕ್ಕಿಗೆ ಇಲ್ಲ ಹೇಳಿ-
శివుడు ఏ దిక్కున లేడో చెప్పు!”
అనంతర కాలంలో శివభక్తులకు పెద్ద దిక్కు అయ్యింది.
“ఇందు గలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే”
అని ఒకపక్క పోతన భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన పద్యాన్ని అయిదు వందల ఏళ్ళుగా నోళ్ళల్లో అరగదీస్తూనే ఉంటాం. మరోపక్క-
“ఇందు లేడందునా లేడు;
సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఉత్తరద్వారమందే కలడు…”
అని ప్రహ్లాదుడికే కొత్త భక్తి పాఠాలు చెబుతూ పోతనను సవరిస్తూ ఉంటాం.
“కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో!”
అని ఏ దిక్కున ఉన్నాడో! అసలు ఉన్నాడో! లేడో! అని సందేహంగా ఉన్నంతసేపు మొసలినోట్లో పడ్డ గజేంద్రుడిని శ్రీమహావిష్ణువు పట్టించుకోలేదు.
“లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”
అని అన్ని దిక్కుల్లో, అంతటా ఉన్నది నువ్వే. నువ్వు తప్ప నన్నిప్పుడెవరు రక్షిస్తారు? అని నిశ్చయ బుద్ధితో అడిగితే…అప్పుడు పరుగు పరుగున వచ్చి కాపాడాడు.
“అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం;
ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం”
అన్న సామెత ఎందుకు పుట్టిందో మనకెందుకు?
పురాణాలు వినడానికే. భక్తి కథలు చదవడానికే. ఆచరించడానికి కాదు. పదండి! ఏకాదశి వైకుంఠ ద్వారానికి. పదండి తోసుకు! పదండి తొక్కుకు! వైకుంఠ పరమపద టోకెన్ పథంలో పోదాం పోదాం పైకి. మళ్ళీ తిరిగిరాలేనంత పైపైకి.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article