Siva Racharla…… ఒక్క ఓటుతో కూలిన ప్రభుత్వం… ఇది చదివే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లోక్ సభలో జరిగే విశ్వాస లేదా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయొచ్చా?. సమాధానం అలోచించి చదవండి.
ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు ఎన్నికల ముందు చర్చకోసమే ప్రవేశ పెడుతున్నారు. కానీ సంకీర్ణ కాలంలో ముఖ్యంగా 1996-2008 మధ్య అవిశ్వాస లేదా విశ్వాస తీర్మానం అంటే రాజకీయ, వ్యాపార , మీడియా వర్గాలు కాళ్ల బొటన వేళ్ల మీద నిల్చునేవి.
అవిశ్వాస తీర్మానం మీద చర్చలో పాల్గొన్న హోమ్ మంత్రి అమిత్ షా , 1999లో వాజ్ పాయ్ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలిపోయిందని, తాము ఎలాంటి కొనుగోలుకు, ప్రలోభాలకు పాల్పడలేదని… లేదంటే నాటి బీజేపీ ప్రభుత్వం నిలిచేది అన్నారు. ఆ రోజు ఏమి జరిగింది?
Ads
1999 ఎన్నికలు
1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో BJP 182, మిత్రపక్షాలతో కలిసి NDAగా 254 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 141, కమ్యూనిస్టులు 45 స్థానాలు, జనతాదళ్ 40 స్థానాలు గెలిచారు.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39 పార్టీలకు లోక్ సభలో ప్రాతినిధ్యం దక్కింది. 13 పార్టీలు సింగల్ సీట్, ఐదు పార్టీలు కేవలం రెండేసి సీట్లు ,ఒక పార్టీ మూడు సీట్లు,మూఢు పార్టీలు నాలుగేసి సీట్లు, రెండు పార్టీలు ఐదేసి సీట్లు గెలిచాయి. సింగిల్ సీట్ 13 పార్టీలు గెలవటం ఒక రికార్డ్.
NDAలో BJP తరువాత 18 స్థానాలతో రెండవ పెద్ద పార్టీ జయలలిత AIADMK. ఎన్నికల అనంతరం తెలుగుదేశం లాంటి పార్టీల మద్దతుతో వాజ్ పాయి రెండవసారి ప్రధాని అయ్యారు. ఒక్క సీట్ గెలిచిన బూటా సింగ్ లాంటి వారు మంత్రులయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రేస్ ఓటమి తరువాత సోనియా గాంధి 14-Mar-1998న కాంగ్రేస్ అధ్యక్ష పదవి స్వీకరించటంతో కాంగ్రేసులో తిరిగి గాంధీ కుటుంబ ఆధిపత్యం మొదలైంది.
వాజ్ పాయి మీద సుబ్రమణ్య స్వామి కక్ష
సుబ్రమణ్యస్వామి IITలో ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్ధిక విధానాల మీద ఇందిరతో ఏర్పడ్డ విభేధాలతో IIT నుంచి సుబ్రమణ్యస్వామిని బలవంతంగా రాజీనామా చేయించారు.
మొదటి నుంచి RSSతో అనుబంధం ఉన్న సుబ్రమణ్య స్వామి ఎమర్జెన్సి ముందు నాటి ఇందిరా వ్యతిరేక ఉద్యమాల్లో కీలక నాయకుడిగా ఎదిగాడు. 1974లో జనసంఘ్ తరుపున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సి రోజుల్లో అమెరికాకు పారిపోయారు. స్వామి మీద కోర్టు అరెస్టు వారెంటు కూడా ఇచ్చింది. ఎమర్జెన్సి ఎత్తేసిన తరువాత 1976లో రాజ్యసభలో ప్రసంగించి ఆరెస్టు కాకుండా పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నారు. ఎమర్జెన్సి ఎత్తేసిన తరువాత 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరుపున ఈశాన్య బొంబయి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
జనతా మొరార్జి ప్రభుత్వంలో జనసంఘ్ తరుపున వాజ్ పాయి, అద్వాని మంత్రులయ్యారు. వాజ్ పాయ్ కుట్ర చెయ్యటం వలనే తాను మంత్రిని కాలేకపోయానని సుబ్రమణ్య స్వామి అనేకసార్లు చెప్పారు. అప్పటి నుంచే సుబ్రమణ్య స్వామికి వాజ్ పాయికి విరోధం మొదలైంది.
1998 ఎన్నికల్లో జయలలిత మద్దతుతో సుబ్రమణ్యస్వామి మధురై నుంచి జనతా పార్టీ తరుపున లోక్ సభకు ఎన్నికయ్యారు. వాజ్ పాయ్ జయలలిత పార్టీ నుంచి ఇద్దరిని మంత్రులుగా తీసుకున్నారు కానీ గత విరోధంతో సుబ్రమణ్యస్వామిని మాత్రం మంత్రి మండలిలోకి తీసుకొలేదు.
మిత్రపక్షం జయలలిత బ్లాక్ మెయిలింగ్
కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న 1996 రోజుల్లో అవినీతి ఆరోపణలతో జయలలిత అరెస్టు అయ్యారు. తరువాత 1998లో వాజ్ పాయి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జయలలిత కరుణానిధి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చెయ్యమని, తన మీద కేసులు ఎత్తివేయమని వాజ్ పాయి మీద జయలలిత వొత్తిడి చేసేవారు.
వాజ్ పాయి ప్రభుత్వంలో ఒక్క సీటు ఉన్న బూటా సింగ్ లాంటి పార్టీలు కూడా భాగస్వాములు. కప్పలతడక ప్రభుత్వం అన్నదానికి సరైయిన ఉదాహరణగా ఉండేది. అయినా కానీ జయలలిత ఒత్తిడికి వాజ్ పాయి తలూపలేదు, కరుణానిధి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోలేదు.
1998 డిసెంబర్ నెలలో అడ్మిరల్ విష్ణు భగత్ ప్రభుత్వం నియమించిన డిప్యూటి అడ్మిరల్ నియమకాన్ని వ్యతిరేకించటం సంచలనం కలిగించింది. ప్రభుత్వం విష్ణు భగతును 30-Dec-1998న విధుల నుంచి తొలగించింది . విష్ణు భగత్ అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ పెర్నాండేజ్ మీద తీవ్ర విమర్శలు, ముఖ్యంగా ఆయుధ వ్యాపారులకు అనుకూలంగా పనిచేస్తున్నాడని విమర్శలు చేశారు.
వాజ్ పాయ్ ప్రధాని అయినప్పటి నుంచి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలని డిమాండు చేస్తూ పలుసార్లు పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జయలలిత విష్ణు భగత్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఫెర్నాండేజును రక్షణ శాఖ నుంచి తప్పించి విష్ణు భగతును తిరిగి అడ్మిరల్ గా తీసుకోవాలని వాజ్ పాయ్ మీద ఒత్తిడి తెచ్చారు.
వాజ్ పాయ్ జయలలిత డిమాండ్లను అంగీకరించక పోవటంతో 27-Mar-1999న జయలలిత పార్టీ మంత్రులు ఇద్దరు రాజీనామా చేయగా అదే రోజు వాజ్ పాయి సిపార్సుతో రాష్ట్రపతి వాటిని అంగీకరించారు. దీనితో జయలలిత వాజ్ పాయి ప్రభుత్వంతో పూర్తి తెగదెంపులు చేసుకున్నారు.
టీ పార్టీ రాజకీయం
మరో వైపు సుబ్రమణ్యస్వామి వాజ్ పాయి ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా 29-Mar-1999న డిల్లిలోని హోటల్ అశోకాలో రాజకీయ పక్షాలతో టీ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ టీ పార్టీలో మొదటిసారి సోనియాగాంధి జయలలిత కలిశారు. వివిధ పక్షాలను హజరుపర్చే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. జయలలిత కూడా స్వయంగా అనేక పార్టీలతో మాట్లాడి ఈ టీ పార్టీకి హాజరుకమ్మని ఆహ్వానించారు. ఈ పార్టీలోనే సుబ్రమణ్యస్వామి సోనియా, జయలలిత, మమతల త్రయాన్ని లక్ష్మి, సరస్వతి, దుర్గలతో పోల్చాడు.
మొత్తానికి టీ పార్టీకి అతిరధ మహారధులు అందరు హాజరయ్యారు. మాజీ ప్రధానులు చంద్ర శేఖర్ , PV, దేవగౌడ, గుజ్రాల్తో పాటు సోనియా, మమతా, మాయావతి, ములాయం & లాలు (అప్పట్లో ఇద్దరు కలిసి లోక్ తాంత్రిక్ పేరుతో ఒక మోర్చాను ఏర్పాటు చేశారు), ఫరూక్ అబ్దుల్లా, బీజేపీ కాంగ్రేసుల తరువాత ఎక్కువ మంది (45) సభ్యుల బలమున్న లెఫ్ట్ పార్టీలు, డీఎంకే , మూపనార్ తదితరులు హాజరయ్యారు… దీనితో ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం వెళ్ళింది.
విశ్వాస తీర్మానం
14-Apr-1999న జయలలిత రాష్ట్రపతిని కలిసి వాజ్ పాయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనితో 275 మంది సభ్యుల మద్దతున్న వాజ్ పాయ్ ప్రభుత్వం బలం 257కు తగ్గి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టక ముందే ప్రభుత్వం మైనారిటీలో పడటంతో రాష్ట్రపతి వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని సభలో బలం నిరూపించుకోమని ఆదేశించారు.
డిల్లీలో రాజకీయ వేడిపెరిగింది. ప్రభుత్వం కూలిపోతుందా లేక నిలబడుతుందా అన్న చర్చలతో అన్ని పార్టీల నాయకులు డిల్లీకి చేరుకున్నారు. ఆరు మంది సభ్యులున్న DMK, ఐదు మంది సభ్యులున్న BSP, నలుగురు సభ్యులున్న చౌతాలా లోక్ దళ్ పార్టీల నిర్ణయం కోసం అందరూ ఎదురు చూశారు. చౌతాలా పార్టీ కొన్ని నెలల ముందే NDA నుంచి బయటకు వొచ్చింది కానీ హర్యానాలో కాంగ్రెస్ ప్రధాన పోటీ కాంగ్రేస్తోనే కావటం చౌతాలా లోక్ దళ్ కాంగ్రేసుకు మద్దతు ఇవ్వరని బీజేపీ అంచనా వేసింది.
ప్రభుత్వానికి మద్దతు కూడగట్టటానికి బిజెపి నాయకులు అద్వాని, ప్రమోద్ మహజన్ తదితరులు రంగంలోకి దిగారు. వారి ప్రయత్నాలు సఫలమయ్యి లోక్ దళ్ చౌతాలా, ఫరూక్ అబ్దుల్లా National Conference, DMK మద్దతు ఇవ్వటానికి అంగీకరించాయి. మాయావతి వోటింగులో పాల్గొనకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించారు. దీనితో ప్రభుత్వం విశ్వాస తీర్మానం గెలవటానికి కావలసిన బలం సమకూరింది.
విశ్వాస తీర్మానం మీద ఓటింగ్ – డ్రామా
17-Apr-1999న ప్రభుత్వ విశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగింది. అనారోగ్యంతో హాస్పటల్లలో ఉన్న సభ్యులను ఆయా పార్టీలు సభకు స్ట్రెచర్ల మీద తీసుకొచ్చాయి. డిల్లీలోని ఫలు ఆసుపత్రుల అంబులెన్సులు పార్లమెంట్ ఆవరణలో సిద్దంగా ఉంచారు.
సభ మొదలైంది, మాయావతి లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం అని ప్రకటించారు. దీనితో సభలో కలకలం మొదలైంది. బిజెపి నాయకులు విపక్ష పార్టీల నాయకుల వద్దకు పరుగు తీసి చర్చలు చేశారు.
లోక్ సభలో ప్రత్యక్షం అయిన సీఎం
ఇంతలో ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ సభలో ప్రత్యక్షమయ్యారు.1998 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయిన గమాంగ్ 2 నెలల ముందే ఫిబ్రవరిలో ఒరిస్సా ముఖ్యమంత్రిగా కాంగ్రేస్ పంపించింది. ఆరు నెలల వరకు లోక్ సభ సభ్యుడిగా కొనసాగటానికి చట్టం అనుకూలంగా ఉండటంతో గమాంగ్ లోక్ సభకి రాజీనామా చెయ్యలేదు. గమాంగ్ ను ఓటు వెయ్యకుండా అడ్డుకోవాలని బిజెపి చేసిన వినతిని స్పీకర్ బాలయోగి తిరస్కరించారు. ప్రభుత్వ విపక్ష బలాలు దాదాపు సమానంగా ఉన్నాయి, ఏమి జరుగుతుందోనన్న ఆత్రుత పెరిగింది.
ఒక్క ఓటుతో ఓడిన ప్రభుత్వం
మణిపూర్ నుంచి గెలిచిన ఒక సభ్యుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వెయ్యటంతో విపక్షాలకు షాక్ తగిలింది. ఇంతలో National Conference పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రొఫెసర్ సైఫుద్దీన్ సోజ్ విశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా ఓటువేశారు మళ్ళీ హడావుడి…
క్రికెట్లో చివరి ఓవర్లో బంతి బంతికీ ఫలితం మారేట్లు ఉత్కంఠ మధ్య చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 270 ఓట్లు పడ్డాయి… అధికార పక్షంలో దిగ్బ్రాంతి, విపక్షాలలో కేరింతలు. ప్రధాని వాజ్ పాయ్ లేచి చివరి ప్రసంగం చేసి రాజీనామా చెయ్యటానికి రాష్ట్రపతి భవనుకు వెళుతున్నానని ప్రకటించారు…
సుబ్రమణ్య స్వామీ మాటల్లో లక్ష్మి, సరస్వతి, దుర్గ త్రయం అంటే సోనియా, జయలలిత, మమత వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని కూల్చారు. తెరవెనుక ఇంత రాజకీయం నడిపిన ఇండియన్ “షెర్లాక్ హోమ్స్” సుబ్రమణ్యస్వామి పార్లమెంటుకు ఆరుసార్లు ఎన్నికయినా మంత్రిగా పనిచేసింది మాత్రం కేవలం 8 నెలలు, చంద్రశేఖర్ మంత్రి వర్గంలో 1990-1991 మధ్య మంత్రిగా చేశారు.
13 రోజులు 13 నెలలు 13 సంవత్సరాలు
మొదట 1996లో 13 రోజులు ,ఇప్పుడు 1998లో 13 నెలలు పాలించాము రేపు 13 సంవత్సరాలు పాలిస్తామని ప్రసంగంలో చెప్పిన వాజ్ పాయి 1999 ఎన్నికల్లో గెలిచారు కానీ 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే 2004లో India Shining నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయారు. దీనితో మోడీ పీఎం అయ్యేవరకు ఐదు సంవత్సరాల పూర్తికాలం పాలించిన కాంగ్రేసేతర ప్రధాని అంటూ ఒక్కరూ లేకుండా పోయారు.
ప్రభుత్వ, ప్రతిపక్షాల బలాబలాలతో సంబంధం లేకుండా విశ్వాస లేక అవిశ్వాస తీర్మానాలు జరగటం మంచిదే. గతంలో మంచి చర్చ జరిగేది కానీ ఇప్పుడు Flying Kiss లాంటి ఫిర్యాదులతో సబ్జెక్టు మీద చర్చ లేకుండా సైడ్ లైన్ అవుతుంది… నిన్న జరిగిందీ అదే…
Share this Article