అమరప్రేమ, అపూర్వప్రేమ, అమలినప్రేమ, అద్భుతప్రేమ, అనిర్వచనీయప్రేమ… ఏ పేరైనా పెట్టుకొండి… ఇన్నివేల సినిమాలు తీశారు కదా మనవాళ్లు… ప్రతి సినిమాలోనూ ఓ ప్రేమకథ ఉంటుంది కదా… మెయిన్ కంటెంట్ ఏమున్నా సరే, ఓ తోక ప్రేమకథ తప్పనిసరి అనే సూత్రంతో మన ఇండస్ట్రీ నానా వేషాలూ వేస్తుంది కదా…
ఒక ప్రేమకథను సినిమాగా తీయగలరా..? గాంధీ సినిమాకు మళ్లీ ఇంగ్లిషోడే దిక్కయినట్టు, ఇప్పుడు మనం చెప్పబోయే ప్రేమకథకూ హాలీవుడ్ డైరెక్టర్లే బెటరా..? ప్రేమకథల్ని అందంగా చెక్కే మణిరత్నం కూడా ఈ కథను అదే భావావేశంతో తీయలేడేమో అని డౌట్… ఇక అసలు కథలోకి వస్తే…
1942… గ్వాలియర్‌లోని విక్టోరియా కళాశాల… అక్కడ మన కథానాయకుడు, మాజీ ప్రధాని వాజపేయి చదువుకుంటున్నాడు… అక్కడే ఓ అందగత్తె చేరింది… పేరు రాజకుమారి హక్సర్… ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి రక్తబంధువు… కశ్మీర్ ప్రాంతానికి చెందిన ఓ హైఫై కుటుంబానికి చెందినది వాళ్ల కుటుంబం… దేశవిభజన అనంతరం ఆ కల్లోల స్థితిలో ఆమె ఢిల్లీకి వెళ్లిపోయింది… దానికి ముందు… ఆమెను చూడగానే మనసు పారేసుకున్న వాజపేయి ఓ లవ్ లెటర్ రాసి, ఓ బుక్కులో పెట్టి, లైబ్రరీలో ఆమెకు సైగ చేశాడు… ఆమె తీసుకుంది, చదివింది…
Ads
ఈ అందగాడు తనకూ నచ్చాడు… రిప్లయ్ రాసింది, అదే పుస్తకంలో పెట్టింది… లైబ్రరీలో దాని ప్లేసులో ఉంచింది… వాజపేయి దాన్ని తీసుకునేలోపు ఎవరో ఆ పుస్తకాన్ని తీసుకుపోయారు… ఆమెకు ఇష్టం లేదేమో, అందుకే రిప్లయ్ ఇవ్వలేదని వాజపేయి అనుకున్నాడు… తరువాత ఆమె ఢిల్లీకి వెళ్లిపోయింది… కొన్నాళ్లకు తండ్రి, సవతి తల్లి ఒత్తిడి మేరకు పెళ్లి కూడా చేసుకుంది… భర్త పేరు బీఎన్ కౌల్… (ఈ పేరుతో ఓ లెఫ్టినెంట్ కల్నల్ కూడా ఉండేవాడు… ఈయనేమో టీచర్… బ్రజ్ నారాయణ్ కౌల్…)
…(BNKaul with his wife Rajakumari and daughters)
వాజపేయి ఇక లైఫులో పెళ్లి వద్దనుకున్నాడు… అప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ తను… పలు ప్రాంతాలు తిరిగేవాడు… సంఘ్, జనసంఘ్ పని మీదే ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది… అదుగో అక్కడ మళ్లీ రాజకుమారి కనిపించింది… భర్త రామ్‌జాస్ కాలేజీలో పనిచేసేవాడు… తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు… కొన్ని దినాలపాటు అక్కడే పడుకునేవాడు… ఆమెకూ, వాజపేయికి నడుమ ‘‘అన్నిరకాల బంధాలూ ఏర్పడ్డాయనే ప్రచారం’’ పొలిటికల్ సర్కిళ్లలో బాగా పెరిగింది…
ఆ నోటా ఈ నోటా సదరు కౌల్ వరకూ చేరింది… ‘‘మేమెప్పుడూ మిస్టర్ కౌల్‌కు క్షమాపణ గానీ, వివరణ గానీ ఇచ్చుకునేలా వ్యవహరించలేదు…’’ అని చెప్పేది రాజకుమారి… కానీ సంఘ్ పెద్దలకు కూడా బాగా కోపమొచ్చింది… కీలకమైన నాయకులే నైతికంగా దిగజారి వ్యవహరిస్తే ఎలా అనేది ఆర్ఎస్ఎస్ కోపానికి కారణం… కానీ అప్పటికే వాజపేయి బాగా ఎదిగిపోయాడు పార్టీలో… చేసేదిలేక ఆర్ఎస్ఎస్ కూడా నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది… తరువాత వాజపేయి ఎంపీ అయ్యాక అధికారిక క్వార్టర్ కేటాయించారు… కౌల్ కుటుంబం కూడా అందులోకి చేరిపోయింది…
రాజకుమారి కూతురు నమిత వాజపేయి ప్రసాదించిన సంతానమే అని భావించేవారు పొలిటికల్ సర్కిళ్లలో… ప్రణబ్ ముఖర్జీ క్వార్టర్ పక్కనే ఉండేవాళ్లు… నమితను దత్తత తీసుకున్న వాజపేయి బెంగాల్‌కు చెందిన రంజన్ భట్టాచార్యతో పెళ్లిచేశాడు… కౌల్ కుటుంబం మొత్తం వాజపేయి ఇంట్లోనే ఉండేది… వాజపేయిని పాలిష్‌డ్‌గా మార్చిన సహచరి రాజకుమారే… పలు కీలకమైన ఇష్యూల్లో సలహాలు ఇచ్చేది… ప్రధానిగా ఉన్నప్పుడు సైతం ఆయన కాల్స్ అటెండయ్యేది… తనెప్పుడూ బయటికి వచ్చేది కాదు… ఫోటోలు, ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు… నమిత, భట్టాచార్య మాత్రం ప్రధాని ఆఫీసులో హల్‌చల్ చేసేవాళ్లు…
వాజపేయికి సేవలు చేసింది… అన్నీ తానైంది… ఒక్కముక్కలో చెప్పాలంటే ఆమె సహధర్మచారిణిగానే ఉంది… వాజపేయికి అల్జీమర్స్ బాగా ముదిరి, ఎవరినీ గుర్తించలేని స్థితి… ఆమె ఆయన మరణానికి నాలుగేళ్ల ముందు మరణించింది… తనలో సగం, కాదు కాదు… తన జీవితమే ఆమె అనుకున్న రాజకుమారి మరణిస్తే వాజపేయి ఆమె అంత్యక్రియలకూ వెళ్లలేని స్థితి… ఎస్, రాజకుమారి లేనిదే వాజపేయి జీవితకథ లేదు… ఆమె పాత్ర లేకుండా వాజపేయి బయోపిక్ తీయడం సాధ్యం కాదు… తీసినా వేస్ట్…
ఇక్కడ చాలెంజ్ ఏమిటంటే… వాజపేయి గౌరవానికి వీసమెత్తు భంగం వాటిల్లినా నిర్మాతను, దర్శకుడిని ఉపా చట్టం కింద లోపలేయడం ఖాయం… మరి రాజకుమారితో ఆయన బంధాన్ని ఎలా చూపించాలి..? పోనీ, రాజకుమారి భర్తను ఎలా చూపించాలి..? ఓ ప్రేమికుడికి తన భార్యను ధారాదత్తం చేసినట్టు చూపించి, ఆయననూ కించపరచలేరు కదా… ఇంతకీ రాజకుమారి వాజపేయికి కేవలం ప్రేమికురాలా..? అనధికారిక సహధర్మచారిణా..?
ఈ ప్రేమకు, వాళ్ల బంధానికి పేరేమిటి..? భర్త ఉండగానే, ప్రేమికుడిని ఇంట్లో ఉంచుకుని, తరువాత ప్రేమికుడి ఇంట్లోకే మారిపోయిన ఆమెను ఓ పాజిటివ్ కోణంలో ఎలా చూపించాలి..? ఏ పాత్ర మీద దురభిప్రాయం ఏర్పడకుండా ఆ పాత్రల్ని తీర్చిదిద్ది, ఓ అందమైన ప్రేమకథను తీయడం మనవాళ్లకు సాధ్యమేనా..? కేజీఎఫ్‌లు, ట్రిపుల్ ఆర్, పుష్పలు ఎవరైనా తీస్తారు… వాజపేయి బయోపిక్ తీయగలరా..?! ప్రశాంత్, వంగా, అగ్నిహోత్రి, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
Share this Article