Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!

August 3, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… కడివెడు పాలల్లో ఒక అశ్లీలపు బొట్టు వేస్తే ఎలాగో… సినిమా అంతా భగవద్గీత శ్లోకాలతో ప్రేక్షకులను తన్మయపరిచిన ఈ సినిమాలో సంగీత వాయిద్యాల మీద హీరోయిన్ దుస్తులను , ముఖ్యంగా లోదుస్తులను , వేసి జనం చేత రాఘవేంద్రరావు బాగానే చివాట్లు తిన్నాడు ఈ వజ్రాయుధం సినిమాతో .

రాఘవేంద్రరావు సినిమాల్లో అత్యంత వెగటు పాట ఇదే… ఇది ఆహ్లాదానికీ అసహ్యతకూ నడుమ రేఖను చెరిపివేయడం…  అంత శృంగార రసాన్ని తమరే కుమ్మరించగలరు అని సౌందర్య లహరి ప్రోగ్రాంలో హీరో రవితేజ సదరు దర్శకేంద్రునికి దండాలు పెట్టేసాడు . ఈ సీనుకి శ్రీదేవి అంగీకరించటం కూడా ఆశ్చర్యమే . వదిలేద్దాం . పాపం పరిహతమగుగాక .

Ads

కృష్ణ , రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా 1985 జూలైలో వచ్చిన ఈ వజ్రాయుధం . పరుచూరి బ్రదర్స్ కధాంశాన్ని బ్రహ్మాండంగా ఎన్నుకున్నారు . ఆధునిక దేవాలయాలుగా పిలవబడే ఒక డాం నిర్మాణంలో అవకతవకల చుట్టూ కధను నేయటం . ఈ బ్రిడ్జి అంత తేలిగ్గా కూలదు ; బ్రిటిషోళ్ళు కట్టారనే డైలాగ్ నలభై ఏళ్ళ కిందే ఈ సినిమాలో ఉంది . ఈ మధ్య కాలంలో దేశంలో కూలిపోతున్న బ్రిడ్జీలను , కుంగిపోతున్న రోడ్లను పరికిస్తే మాట పెగలదు .

సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన కృష్ణ , శ్రీదేవిలతో సమానంగా పేరొచ్చింది ఓ బాల నటికి . ఆ పాప పేరు బేబీ సీత . సినిమా అంతా భగవద్గీత శ్లోకాలను ఉటంకిస్తూ ప్రేక్షకులను సమ్మోహన పరిచింది . ఇలాంటి పాత్రలు కృష్ణ ఎడం చేత్తో చేసేస్తాడు . శ్రీదేవి పొగరుబోతు పోట్ల గిత్తగా , హీరోని జనం ముందు దోషిగా నిలబెట్టే కచ్చబోతుగా , తప్పులను తెలుసుకుని మనసు మార్చుకున్న పడతిగా చాలా బాగా నటించింది . ముఖ్యంగా డాన్స్ సీన్లలో అదరగొట్టింది .

విలనాసురులుగా రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , సత్యనారాయణ , అల్లు రామలింగయ్యలు మూడు ప్రాంతాల తెలుగు యాసను మాట్లాడుతూ తెలుగు భాష వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తారు . ఇతర ప్రధాన పాత్రల్లో కాంతారావు , శ్యామల గౌరి , అశ్విని , రాజా , పి యల్ నారాయణ , రాజా , పి జె శర్మ , శుభ , నర్రా  ప్రభృతులు నటించారు . శ్యామల గౌరికి మంచి పాత్రే లభించింది .

సినిమాలో చాలా భాగం నెల్లూరు , సోమశిల డాం చుట్టుపక్కల తీసారు . సినిమా కధకు బాగా అతికింది . వందల మంది జూనియర్ ఆర్టిస్టులకు , ఔత్సాహికులకు పని దొరికింది . కృష్ణకు 229 వ సినిమా అయిన ఈ వజ్రాయుధం విజయంలో చక్రవర్తికి , నృత్య దర్శకుడు సలీంకు , పాటలను వ్రాసిన వేటూరికి , వాటిని శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యానికి , సుశీలమ్మకు , జానకమ్మకు గొప్ప పాత్ర ఉంది .

హరునికి వందనం సురహరునికి వందనం అంటూ సాగే రతీ మన్మధుల నృత్యం కమనీయంగా ఉంటుంది . అలాగే శ్రీదేవి నర్తించే చంద్రశేఖరుని జటాఝూటాన తాండవించే పాట చిత్రీకరణ గొప్పగా ఉంటుంది . నాట్యంతో పాటు డాం నిర్మాణాన్ని జత కడుతూ బాగా తీసారు .

ఇంక డ్యూయెట్లు . చెప్పేదేముంది రాఘవేంద్రరావు పాటలు , డాన్సులు ఎలా ఉండాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి . అద్దంకి చీరెలో ముద్దొచ్చె చిన్నది , కృష్ణమ్మ పెన్నమ్మ పెనవేసుకున్నట్లు , సన్నజాజి పక్క మీద సంకురాత్రి , ఆ బుగ్గ మీద ఎర్ర మొగ్గలేందబ్బా పాటలు కుర్ర ప్రేక్షకులను గంతులేపిస్తాయి . ముసలి ప్రేక్షకులనూ మురిపిస్తాయి .

యన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు జరిగిన వెన్నుపోటు మీద , అప్పటి రాజకీయ పరిస్థితుల పైన కుప్పలకుప్పలు చెణుకులను సంధించారు పరుచూరి బ్రదర్స్ . సినిమాలోని డైలాగులన్నీ సమకాలీన రాజకీయాల మీద , ఆఫీసర్ల కాంట్రాక్టర్ల అవినీతి కుంభకోణాల మీద దండయాత్ర చేస్తాయి . ఎవరెన్ని తిట్టినా వారికేం సిగ్గు !!

ఇంతటి గరం మసాలా సినిమా యూట్యూబులో ఉంది . రాంగోపాల్ వర్మ లాంటి శ్రీదేవి అభిమానులు , కృష్ణ వీరాభిమానులు ఎన్ని సార్లయినా చూడొచ్చు , చూడగలరు . అందమే ఆనందం . ఇవన్నీ ఎలా ఉన్నా భగవద్గీత శ్లోకాలను ఇలాంటి మసాలా సినిమాలో అద్భుతంగా జొప్పించిన పరుచూరి బ్రదర్సుని , రాఘవేంద్రరావుని అభినందించక తప్పదు . An excellent , action-oriented entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions