బోనీకపూర్ నేరుగా ఓ తమిళ చిత్రం నిర్మించడమే ఓ విశేషం… ఇన్ని బైకులు వాడాం, ఇన్ని కొత్త కార్లు కొన్నాం, మొత్తం కార్లు ఇన్ని వాడాం, ఇన్ని కార్లు ధ్వంసం అయ్యాయి, ఇన్ని బైకులు స్క్రాప్ అయిపోయాయి అని లెక్క చెబుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈ సినిమాలో అవి తప్ప ఇంకేమీ కనిపించబోవడం లేదని..! అనుకున్నట్టుగానే ఉంది… రయ్ రయ్… సినిమా మొత్తం బైకు చేజులు, బస్సు చేజులు, కార్లు, గేర్లు… చెవుల్లో హోరు నింపే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్టు…
వలీమై అంటే శక్తి అట తమిళంలో… మరి తెలుగులో అదే పేరు ఎందుకు పెట్టినట్టు..? ఐనా అంత ఆలోచించేవారెవరు..? తెలుగులో డైలాగులు రాయించేసి, డబ్ చేసి, ప్రేక్షకుల మొహాన కొట్టడమే కదా..! అదే చేశారు… లావు అయిపోయిన హీరో అజిత్, కేరక్టరైజేషన్ సరిగ్గా లేని విలన్ కార్తికేయ, సేమ్, హీరోయిన్ హ్యూమ ఖురేషి… ఈమాత్రం సినిమాకు అంత భారీ ఖర్చు ఎందుకు పెట్టారో ఓపట్టాన బోధపడదు… భారీతనం చూసి ప్రేక్షకుడు కనెక్ట్ కాడురా బాబూ…
హబ్బ… ఓ హాలీవుడ్ రేంజులో తీశారు అని సగటు అజిత్ అభిమాని కాలర్ ఎగురవేయవచ్చుగాక, కానీ సగటు ప్రేక్షకుడిని మాత్రం రంజింపచేయడు అజిత్… పైగా సుదీర్ఘమైన నిడివి… ఎప్పుడు అయిపోతుందిరా బాబూ అన్నట్టుగా ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటాడు… ఫస్ట్ హాఫ్ కాస్త తట్టుకోగలిగినా సెకండాఫ్ పూర్తిగా అదుపు తప్పిపోయింది… ముగ్గురు కొడుకులు… ఒకడు పోలీస్, మరొకడు తాగుబోతు, ఇంకొకడు క్రిమినల్… మధ్యలో మదర్… అరవ పైత్యం…
Ads
ఏవో పాత సినిమాల్లో చూసినట్టుగా విలన్ డెన్లు, అక్కడికి హీరో గారి కుటుంబసభ్యుల్ని తీసుకుపోయి కట్టేయడం… బాబూ, దర్శకా… ఇంకా ఏలోకంలో, ఏకాలంలో ఉన్నావు తండ్రీ… అవి పాటలా..? పిచ్చి పిచ్చి ధ్వనులేవో బుర్రల్ని చుట్టుముట్టి గోల చేస్తాయి… జస్ట్, చేజింగ్ సీన్లు బాగా తీయడమే ఈ సినిమాలోని ప్లస్ పాయింట్… కొన్ని హాలీవుడ్ రేంజులో ఉన్నాయ్… కానీ ఈ ఒక్క అంశం కోసం ప్రేక్షకుడు థియేటర్లకు వస్తాడా..? ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏది ఓపెన్ చేసినా, హాలీవుడ్ యాక్షన్ సినిమాలు బోలెడు…
బోనీకపూర్‌కు టేస్ట్ లేదు సరే… కనీసం ఏజ్ బార్ అవుతున్న స్టేజ్‌లో అజిత్ కథేమిటో, సినిమా ఎటువైపు వెళ్తుందో జాగ్రత్త తీసుకోవాలి కదా… ఆ సోయి కూడా లేదు సారుకు… ఎడిటర్ అనేవాడు కాస్త మనసుపెట్టి పనిచేసి ఉంటే సినిమా కాస్త బాగుండేదేమో… అఫ్‌కోర్స్, ఆ మదర్ సెంటి‘మెంటల్’ పార్ట్ తీసేస్తే ఇంకా బాగుండేది… నో రొమాన్స్, నో కామెడీ, నో రిలీఫ్… రన్, రన్, చేజ్, చేజ్… ఇదేం సినిమా బాబోయ్ అనిపించేలా తీశాడు దర్శకుడు… ఇంకా ఎక్కువ రాస్తే వలీమై చూసినంత ఒట్టు..!!
Share this Article