.
Paresh Turlapati ………. రాజకీయాల్లో ప్రతీకార దాడులు ఉండవనే మాట అబద్ధం. అయితే కాస్త అటూ ఇటూగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తల్లిని అనకూడని మాట అని తండ్రి కంట కన్నీరు తెప్పించినవాడిగా వల్లభనేని వంశీ పేరు లోకేష్ రెడ్ డైరీలో మొదటి పేరుగా ఉండే ఉంటుంది
అయితే చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే తమవైపు నుంచి ప్రతీకార దాడులు ఉండవని.. పాలనలో దృష్టి పెట్టడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. అన్నట్టుగానే టీడీపీ నుంచి ఊహించని దాడులు వెంటనే ఏమీ జరగలేదు
లోకేష్ హిట్ లిస్ట్ లో ఉన్న కొడాలి నాని.. వల్లభనేని వంశీ.. జోగి రమేష్.. తదితరుల పనైపోయిందని అప్పట్లోనే టాక్ వచ్చింది. కొంతమంది కోర్టుల్లో ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు. మరికొంతమంది విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు
Ads
ఎవరైతే వైసీపీ పాలనలో చంద్రబాబు మీద అగ్రెసివ్ గా వెళ్ళారో వాళ్ళందరి పేర్లు లోకేష్ రెడ్ డైరీలో రాసుకున్నాడు. ఇందులో గోప్యత ఏమీ లేదు. లోకేష్ బహిరంగంగా చెప్పే రాసుకున్నాడు
టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి వేటు వైసీపీ హయంలో తమను ఇబ్బందులు పెట్టిన పోలీసు అధికారుల మీద పడింది. కరకట్ట మీద చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్లిన జోగి రమేష్ మీద కేసులు బుక్కయ్యాయి
వైసీపీ హయాంలో ఎంతమంది ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు.. లోకేష్ ల దృష్టి ప్రధానంగా కొడాలి నాని.. వంశీల మీదే ఉంటుంది. మొదట టీడీపీ టికెట్ మీద గెలిచి, వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని వీళ్ళు చేసిన రాజకీయ రచ్చ బహుశా వాళ్ళు మర్చిపోలేరేమో
ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కూడా వైసీపీ ప్రభుత్వ హయంలో గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో…! అయితే ఈ దాడుల్లో వంశీ ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు కాబట్టి క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ చెయ్యందే కోర్టుల్లో పెద్దగా నిలబడదు
వంశీ మీద కేసు ఫైల్ చేసిన గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సడెన్గా కేసు విత్ డ్రా చేసుకోవడంతో కేసులో బలం తగ్గిపోయింది. అంచేత పోలీసులు బలమైన ఆధారాల కోసం ఎదురు చూశారు
ఇప్పుడు తమ దగ్గర కాల్ రికార్డింగ్ వంటి బలమైన ఆధారం దొరకడంతోనే వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. వంశీకి బెయిలు కూడా దొరక్కుండా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టారు, సరే…
ఈ అరెస్ట్ వంశీ ఊహించిందే కాబట్టి అతడు పెద్దగా షాక్ అయ్యేది ఏమీ ఉండదు, మీడియా హడావుడి తప్పితే…. ఇలాంటి అరెస్టు వంశీకి ఇదే మొదటిది కాదు.. ఆఖరిదీ కాదు….
ఇక్కడ వంశీ గురించి రెండు మాటలు చెప్పాలి. అనంతపురం పరిటాల రవి శిష్యుడిగా వంశీ గన్నవరం రాక ముందే రాటుదేలి పోయాడు. ఇక గన్నవరంలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగినప్పుడు తన వెనుక ఓ ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేసుకున్నాడు. అతి తక్కువ టైమ్ లోనే వంశీ గన్నవరం ప్రజల దృష్టిలో పడ్డాడు. అలాగే రామాంజనేయులు దృష్టిలో కూడా పడ్డాడు
ఈ రామాంజనేయులు ఎవరంటే, మహేష్ బాబు పోకిరీ సినిమాలోలా ‘ ఎవరి పేరు చెప్తే మైండ్ బ్లాకయి దిమ్మ తిరుగుతుందో ఆడి పేరే రామాంజనేయులు ‘ అనే డైలాగ్ డిపార్ట్మెంట్లో ఈయన గురించి చెప్పుకునేవాళ్ళు. డిపార్ట్మెంట్ లో సింహ స్వప్నంగా పిల్చుకునే పోలీసు అధికారి ఈ పోలీస్ కమిషనర్ రామాంజనేయులు.
వంశీ ప్రైవేట్ సైన్యం వేసుకుని తిరగడం ఈయనకు నచ్చలేదు. అప్పట్లో పోలీస్ కమిషనర్ గా ఉన్న రామాంజనేయులుకు రాజకీయ పెద్దలను స్టేషన్ కి పిలిపించి భాగా ‘ కౌన్సెలింగ్ ‘ ఇచ్చేవాడని పేరుంది. అలాగే వంశీకి కూడా కబురు వెళ్ళింది. కానీ సీపీ గారి కౌన్సిలింగ్ కు భయపడేది లేదని ఎదురు తిరిగాడు. అప్పట్లో ఐదో పెద్ద ఇష్యూ అయ్యింది
ఏమైందో ఏమో సడెన్గా సీపీ రామాంజనేయులు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నట్టు వాట్సాప్ కాల్స్.. వీడియోలు బయటికి వచ్చాయి. దాంతో ప్రభుత్వానికి సీపీ రామాంజనేయులును ట్రాన్స్ఫర్ చేయక తప్పలేదు. ఇదంతా వంశీ తనపైన పన్నిన కుట్ర అని అప్పట్లో మీడియా ముందు వాపోయారు రామాంజనేయులు. ఇదీ గత చరిత్ర
ఇక ప్రస్తుతానికి వస్తే, వంశీ అరెస్టును హైద్రాబాదు నుంచి విజయవాడ వరకు పోలీసు వాహనాలను ఫాలో అయి లైవ్ కవరేజ్ ఇవ్వడానికి ఒకరెనుక ఒకరు అన్ని ఛానళ్ళు పోటీ పడ్డాయి. కేసుల్లో కోర్టులకు వెళ్తున్న రాజకీయ నాయకులకు ఈ హీరో వర్షిప్ కవరేజ్ ఎందుకో అర్ధం కాదు
గడిచిన కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల ఈ అరెస్టులు.. విడుదలలు సాధారణం అయిపోయాయి. ముఖ్యమంత్రులుగా చేసిన జగన్.. చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలకే తప్పలేదు
(మీరు గమనించారో లేదో ఇప్పుడు కేసులూ.. అరెస్టులు అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడూ భయపడట్లేదు.
ఇలా లోపలికి వెళ్ళి అలా బెయిలు తెచ్చుకుని రెండు వేళ్ళు చూపుతూ ఉరేగింపుగా ఇంటికెళ్ళి పలావ్ తింటున్నారు)
ఇవన్నీ రాజకీయాల్లో టీ కప్పులో తుఫాను చందంగా మారిపోయాయి. కాసేపు సంచలనం అనిపిస్తాయి.. అంతలోనే మరుపుకు వెళ్లిపోతాయి. ఇంకో ఇష్యూ వచ్చేదాకా అంతే!! ……… పరేష్ తుర్లపాటి
Share this Article