Siva Racharla ……. ఒక్క ఓటు – సీఎం పదవి జీవితకాలం లేటు ! మీకు కాలం విలువ తెలుసా? ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే 0.1 సెకండ్ తేడాతో ఒలంపిక్ మెడల్ కోల్పోయిన మిల్కా సింగ్ ను అడగండి … పర్సనాలిటి డెవలప్ మెంట్ పాఠాల్లో విరివిగా చెప్పే ఉదాహరణ ఇది.
జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే తెలిసుంటారు కానీ కేవలం ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు తెలుసా?
2008 రాజస్థాన్ ఎన్నికల్లో అప్పటి పీసీసీ అధ్యక్ష్యుడు సీఎం రేసులో అశోక్ గెహ్లాట్ తో పోటీ పడిన సీపీ జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. సీఎం స్థాయి నేత ఓటమి ఆశ్చర్యం అయితే కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోవటం జోషికి అతిపెద్ద షాక్.
Ads
సీపీ జోషికి 62,215 ఓట్లు, ప్రత్యర్థిబీజేపీ కి చెందిన కల్యాణ్ సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 96 సీట్లు గెలిచి సాధారణ మెజారిటీ 101కి ఐదు సీట్ల దూరంలో ఆగిపోయింది. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
సీపీ జోషి డిమాండ్ మేరకు రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం రావడంతో బీజేపీ కల్యాణ్ సింగ్ గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే కల్యాణ్ సింగ్ చౌహాన్ భార్య రెండు చోట్ల టెండర్డ్ ఓటు వేశారని వాటిని రద్దు చేయాలని సీపీ జోషి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.సుప్రీం ఆదేశంతో టెండర్డ్ ఓట్లతో కలిపి ఎన్నికల సంఘం మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించింది. ఈసారి లెక్కింపులో సీపీ జోషి మరియు కల్యాణ్ సింగ్లకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం డ్రా తీసింది అందులో విజయం కల్యాణ్ సింగ్‌ను వరించింది.
ఆ విధంగా సీపీ జోషికి అన్ని స్థాయిల్లో దురదృష్టం ఎదురైంది. 2009 లో ఎంపీగా గెలిచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసేశారు . ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.
2004 కర్ణాటక ఎన్నికల్లో చామరాజానగర జిల్లా సంతమారహళ్లి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన జెడిఎస్ అభ్యర్థి ఏ.ఆర్ .కృష్ణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి.
నిన్నటి 2023 ఎన్నికల్లో కొల్లేగల్ (Kollegal) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఏ.ఆర్ .కృష్ణమూర్తి గెలిచారు. 2004లో ఒక్క ఓటు మెజారిటీతో గెలిచిన ధ్రువనారాయణ 2008లో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. 2009 మరియు 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున చామరాజ నగర్ నుంచి గెలిచి 2019లో ఓడిపోయారు.
దేశ చరిత్రలో వీరిద్దరే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన నేతలు. వీరిద్దరి గురించి ఒక వార్త ప్రచారంలో ఉంది. సొంత డ్రైవర్లు ఆ ఎన్నికల్లో ఓటు వేయలేదని,వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వకుండా పోలింగ్ రోజు మొత్తం నియోజకవర్గం తిరిగారని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఒక్క ఓటుతో అవకాశాలు కోల్పోవటం అంటే ఇదే.
2007-2014 మధ్య బలమైన పీసీసీ అధ్యక్షులు సిఎం పదవికి పోటీపడిన వాళ్ళు చాలా మంది ఓడిపోయారు. అందులో 2009 ఎన్నికల్లో ఆంధ్రా నుంచి డి.శ్రీనివాస్ ,2008 కర్ణాటక ఎన్నికల్లో పరమేశ్వర్ ,2008 రాజస్థాన్ ఎన్నికల్లో పీసి జోషి ఓడిపోయారు. వీరి ఓటమి యాదృచ్చికం కాకపోవచ్చు.
మరికొన్ని స్వల్ప మెజార్టీలు
2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి మీద కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు.
మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జయనగర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్య 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటి రీకౌంటింగ్లో 105 ఓట్లతో గెలిచిన సౌమ్యబీజేపీ నేతల డిమాండ్ తో జరిగిన రీ కౌంటింగ్లోబీజేపీ అభ్యర్థి రామూర్తి 16 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈఎన్నికల్లో కాంగ్రెస్ నేత గుండూరావు గాంధీనగర్ నియోజకవర్గం నుంచి 105 ఓట్ల తేడాతో గెలిచారు.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ 1000 ఓట్లతో నలభై స్థానాలు గెలిచింది అని చాలా ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో
1000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ 5,బిజెపి 3
2500 లోపు మెజారిటీతో కాంగ్రెస్ 2,బిజెపి 5,జెడిఎస్ 1
5000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ 15,బిజెపి 9,జెడిఎస్ 2
7500 లోపు మెజారిటీతో కాంగ్రెస్ 5,బిజెపి 3,జెడిఎస్ 1
10000 లోపు మెజారిటీతో కాంగ్రెస్ 10,బిజెపి 7 సీట్లు ,జెడిఎస్ 2 గెలిచాయి,మూడో ఫోటో చుడండి.
మొత్తంగా చూస్తే 1000 లోపు మెజారిటీ తో జెడిఎస్ తో సహా మూడుపార్టీలు 2023 ఎన్నికల్లో 8 సీట్లు, 2018లో 5 సీట్లు, 2013లో 12 సీట్లు గెలిచాయి. దాని అర్ధం ప్రతి ఎన్నికలో దాదాపు స్వల్ప మెజారిటీతో గెలిచిన స్థానాలు ఒకే విధంగా ఉన్నాయి. నాలుగో ఫోటో చూడండి.
లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి సింగల్ డిజిట్ మెజారిటీలు నమోదయ్యాయి.
1989 ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కొణతాలకు 2,99,109 ఓట్లు , టీడీపీ అభ్యర్థి అప్పల నరసింహకు 2,99,100 ఓట్లు వచ్చాయి.
1998 లోక్ సభ ఎన్నికల్లో బిహార్‌లోని (ఇప్పుడు జార్ఖండ్) రాజ్‌మహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మారండి కూడా 9 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ ఎన్నికల్లోబీజేపీ అభ్యర్థి సోమ్ మారండికి 1,98,889 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి థామస్ హన్సడా కు 1,98,880 ఓట్లు వచ్చాయి.
2004 లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి ఎంపీగా గెలిచిన టీడీపీ నేత కొండపల్లి పైడితల్లి నాయుడు గారు అనారోగ్యంతో 2006లో చనిపోయారు. 2006 డిసెంబర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో పైడితల్లి నాయుడు కుమారుడు అప్పలనాయుడు మీద బొత్సా ఝాన్సీ గారు కేవలం 157 ఓట్ల తేడాతో గెలిచారు.
ఒక్క సెకన్ , ఒక ఛాన్స్ , ఒక్క ఓటు.. ప్రతిదీ కీలకమే..
Share this Article