సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా కథలు పడతారు… బొచ్చెడు కథలు చెబుతారు… ప్రత్యేకించి కథలుకథలుగా వ్యాప్తి చెందే పుకార్ల కథలయితే ఇక చెప్పనక్కర్లేదు… ప్రేక్షకులకు తెర మీద కథలు సరిగ్గా చెప్పడంలో మాత్రం చాలామందికి శ్రద్ధ ఉండదు… డైరెక్టర్ వంశీ డిఫరెంట్… సినిమాలో కథ బాగా చెబుతాడు… కలం పడితే మంచి కథలు కూడా రాస్తాడు… భావుకుడు కదా… కథల్లో అనుభూతి, భావప్రకటన, ఉద్వేగస్థాయి కాస్త ఎక్కువ…
తాను సినిమాలు తీస్తున్న నాటి రోజుల జ్ఞాపకాల్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంటుంటాడు… తాజా పోస్టులో కొన్ని పేరాలు చదివితే నవ్వొచ్చింది… తరువాత ఆలోచిస్తే, అదే మంచి కథ కదా అనిపించింది… బాగుంది… ప్రత్యేకించి అక్కడెక్కడో ఎవడూ పలకరించని, పెద్దగా నరమానవుడెవడూ కనిపించని ఓ చిన్న రైల్వే స్టేషన్… సదరు స్టేషన్ మాస్టర్ భార్య… హీరోయిన్ భానుప్రియను అస్సలు గుర్తించకపోవడం హాశ్చర్యం అనిపిస్తుంది… అప్పటికే సితార, అన్వేషణ సినిమాలతో తెలుగులో బాగా పాపులర్ అయిపోయింది ఆమె… ఈ వంశీయే వాటికి దర్శకుడు… ఇంతకీ ఈ కథేమిటంటే..?
ఆలాపన తీస్తున్న రోజులవి… బొర్రాగుహలు, అరకులోయలు, టన్నెళ్ల రైల్వే మార్గం, ఆ అడవులు, ఆ పర్వతాలు, ఆ లోయల్లో పడి షూటింగు చేస్తున్నారు వంశీ అండ్ టీం… భానుప్రియ హీరోయిన్… వెంట చెల్లెలు శాంతిప్రియ కూడా ఉంది… ఓరోజు షూటింగ్ చేస్తూ చేస్తూ చిమిడిపల్లి స్టేషన్ చేరుకున్నారు… ఇక్కడి నుంచి వంశీ మాటల్లోనే…
Ads
‘‘మాష్టారూ ఒకళ్ళిద్దరు స్టాఫూ మాత్రం ఉన్న ఆ అతి చిన్ని స్టేషను అడవిలోంచి తీసుకెళ్తా నడిదారిలో వదిలెళ్ళిపోయిన ఒంటరి మనిషిలాగుంది. మమ్మల్ని చూసిన స్టేషన్ మాష్టారు శివరాజు ఎదురుచూస్తున్న ఆత్మీయుడ్లా వచ్చేసేడు. ఆ తర్వాత ఆ ఇద్దరాడోళ్ళనీ వాళ్ళ క్వార్టర్స్ లోకి తీసుకెళ్లి భార్యదగ్గర పెట్టేడు.
అదో పనిష్మెంటు స్టేషనంట. ఇక్కడ్నించి బయటికెళ్ళాలంటే ఆ రైలు తప్ప ఇంకోదారి లేదంట. ఈ అడివి లోపల జరిగిన కథలు చెబుతుంటే రాత్రిక్కూడా ఏం తినబుద్దేసేలా లేదు మాకు.
తన అసిస్టెంటైన అప్పలనర్సుని పిల్చి, ఇక్కడ దొరికే మేకపాలతో మా అందరికీ టీ పెట్టిస్తున్న ఆ శివరాజుగారు కనిపించిన ప్రతి మనిషి కళ్లలో దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించారు నాకు.
వాళ్ళ క్వార్టర్స్లోకెళ్ళిన ఆ హీరోయిను అక్కా చెల్లెళ్ళని సొంత చెల్లెళ్ళ కంటే ఎక్కువ ప్రేమతో ‘‘ఉప్మా చేస్తా తింటారా?’’ అందా ఎస్సెమ్ గారి భార్య లీల.
ఆకలి మీదున్నాం ఎందుకు తినం… నన్ను ఉల్లిపాయలు కొయ్యమంటారా?’’ అంది శాంతి.
‘‘బాత్రూమెక్కడా… ఉతికిన చీరొకటిస్తారా, స్నానంచేసి మేం వెళ్ళేదాకా అది కట్టుకుంటాను’’ అంది భానుప్రియ.
‘‘అలాగే’’ అంటా ఆ అక్క చెల్లెళ్లకి ఏం కావాలంటే అది చేసిపెట్టేస్తున్న ఆ లీల గారికేసి చూసిన భాను ‘‘నా సినిమాలు ఏమేం చూసేరు?’’ అంది.
ఓ పక్కన ఉప్మా చేసే పనిలో ఉన్న ఆ లీల ‘‘మీ సినిమాలు నేను చూడ్డమేంటీ?’’ అంది.
‘‘అదేంటీ! నేను సినిమా హీరోయిన్ని తెలుసా?’’ అంది భానుప్రియ.
తెలీదన్నట్టు నవ్వేసిన లీలగారు ‘‘నేనేం చూడలేదమ్మా… అసలు మిమ్మల్ని చూడ్డం ఇదే మొదటిసారి’’ అంది.
‘‘ఔనా!’’ అంటా షాకైపోయిన అక్కా చెల్లెళ్లు ‘‘మరి మాకోసం అన్నీ ఇంత ఇదిగా చేసేస్తున్నారెందుకూ?’’ అన్నారు.
నవ్విన ఆ లీల… మీలాగా ప్రేమతో పలకరించే ఒక మనిషి ఇక్కడికొచ్చి ఎన్నాళ్లయిందనీ… అలాగొచ్చారనే మిమ్మల్నిలాగ చూసుకోవడం’’ అంటా చేసిన ఉప్మాని పళ్ళాల్లో వేస్తూ ‘‘ఎప్పుడో ఊర్నుంచి తెచ్చుకున్న ఆవకాయ ఉంది వెయ్యమంటారా?’’ అంది.
బయట చూస్తే సన్నటి సిరివెన్నెల, చెప్పలేనంత చలిగాలి. వాసనొస్తున్న ఆ స్టేషన బిల్డింగ్ పక్కన మల్లెపందిట్లోకెళ్లి నాలుగవ్వుల్ని తెంపి తెచ్చుకుంటున్న నన్ను ‘‘ ఈ సినిమా పేరేంటీ?’’ అన్నారు శివరాజు.
‘‘ఆలాపన.’’
నవ్విన శివరాజు ‘‘రేపు సినిమా ఎలాగుంటదో తెలీదు గానీ పేరు మాత్రం చాలా బాగుంది’’ అన్నారు.
అంతసేపూ సైలెంట్‍గా ఆకాశంవేపు చూసిన మోహన్ ఆ ఎస్సెమ్ శివరాజువేపు తిరిగి ‘‘ఇప్పుడు ట్రైనేమీ రాదా?’’ అన్నాడు.
‘‘గూడ్సు ఒకటి ఇప్పుడే శివలింగపురం వదిలింది’’ అన్న శివరాజు ‘‘మీకు ట్రైను ఎంత లేటుగా వస్తే మాకంత ఆనందం’’ అన్నారు.
‘‘అదేంటీ అలాగన్నారు?’’ అన్నాడు రఘు.
‘‘మీలాంటోళ్ళ సందడి ఈ స్టేషన్లో చూసి ఎన్నాళ్ళయిందనీ? మీరెళ్ళిపోయాక మా బతుకులు మామూలే గదా? ఈ కొండల్లోపల ఈసురోమంటా ఏడవాలి.’’ అన్నారు.
‘‘మరైతే ఎవరూ రారా ఇక్కడికీ?’’ అన్నాడు మోహన్.
నవ్విన శివరాజు ‘‘ఎవరొస్తారు? రాత్రుళ్ళు ఎలుగుబంట్లు, అప్పుడప్పుడూ చిరుతపులులు తప్ప’’ అంటా నవ్వి ‘‘ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుద్దా అని చూస్తున్నాం. భీమిలిలో చదూకుంటున్న మా పిల్లలక్కడ, మేం ఇక్కడ…’’ అంటుంటే ‘‘ఐతే …మీకు భీమిలి తెలుసన్నమాట’’ అన్నాను.
‘‘మాది భీమిలే. నా వైఫ్‍ది విజయనగరం అవతలున్న నెల్లిమర్ల’’ అన్నారు.
‘‘చాలా సంతోషవండి. మీ భీమిలిలో ఉన్న ఆ నెల్లిమర్ల జూట్ మిల్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో రెండ్రోజులున్నాం వెనకటికి’’ అన్నాను.
చాలా సంబరపడిపోయినా శివరాజుగారు చాలా ఇదిగా మాటాడేస్తుంటే గూడ్సు బండొస్తున్న సంగతి తెల్సింది. లోపలున్న హీరోయినాళ్ళకి కబురు చేసేప్పటికి, కట్టుకున్న చీరవిప్పి వాళ్లకిచ్చి, తిరిగి ఆ ఎర్ర డాన్స్ కాస్ట్యూమ్ వేసేసుకుని రెడీ అయిపోయింది…. ఆగిన గూడ్స్ ఇంజన్ డ్రైవర్‍తో మాటాడిన శివరాజు మమ్మల్నందర్నీ టాప్ ఓపెనై ఉన్న ఆ గూడ్స్ పెట్టెల్లో ఎక్కించేక కదిలిందది.
Share this Article