Pasalapudi Vamsy మంచి రైటరా..? మంచి డైరెక్టరా..? అనే ప్రశ్నకు క్షణంలో పావువంతు కూడా ఆలోచించకుండానే మంచి రైటర్ అని చెప్పేయొచ్చు… కథ రాస్తే అది హిట్టే… మంచి ప్రజెంటర్… తన కథల్ని చదివిన ప్రతిసారీ ఒకటీరెండు ప్రశ్నలు తొలుస్తా ఉంటయ్… తను నిజంగా జరిగిన సంఘటనల్నే మనకు కథలుగా చెబుతున్నాడా..? వాటికే కాస్త కల్పన అద్దుతున్నాడా..? ఎవరైనా చెప్పిన ముచ్చట్లను తనదైన స్టయిల్లో అక్షరీకరించి మనతో షేర్ చేసుకుంటున్నాడా..? ఏదయితేనేంలే… కథలే అనుకుందాం…
పోనీ, నిజంగా జరిగిన ముచ్చట్లే అనుకుందాం… ఎంత బాగా కథ చెప్పాడు అనేదే ముఖ్యం కదా… ఇప్పుడు ఓ కథ రాశాడు… పొలమారిన జ్ఞాపకాలు పేరిట సీరీస్ రాస్తున్నాడు కదా… తాజా కథ పేరు ‘ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ’… సహజంగానే కథ, కథనం అన్నీ అదుర్స్… మనల్ని ఎక్కడికో తీసుకుపోతాడు… మధ్యమధ్యలో దాసరి వారి మేఘసందేశం పదే పదే గుర్తొస్తుంది… ‘ముందు తెలిసినా ప్రభూ’ వంటి ఆపాత మధురాలు గుర్తొస్తాయి… అక్కడక్కడా ప్రేమనగర్ గుర్తొస్తుంది… అందులో హీరో హీరోయిన్ కోసం ఓ ప్రేమమందిరం కట్టించడం కూడా..!
రంగసానికి ఆ ‘విలువ’ మాత్రమే కాదు, విలువలూ ఉంటాయని చెబుతాడు వంశీ… అలవిమాలిన మంచితనాన్ని, ప్రేమను కళ్లెదుట ప్రదర్శిస్తాడు హీరో తత్వం గురించి చెబుతూ…! మంచి నటులు గనుక దొరికితే… ఇది సినిమా తీయదగిన కథ… కాకపోతే ఆ పాతరోజుల్లోకే తీసుకుపోవాలి ప్రేక్షకుడిని… ఇవి థియేటర్ దాకా ప్రేక్షకుడిని రప్పించవు కాబట్టి ఓటీటీని వెతుక్కుని ఓ వెబ్ సీరీస్ వదిలితే మరీ బెటర్… కాస్త మనసుపెట్టి ‘‘సిగలో అవి విరులో, అగరు పొగలో అత్తరులో’’ అని పాడుకునేలా చేయాలి… అంతే… ఈ కథ చదవండి ఓసారి…
Ads
అది 1930, నవంబరు నెల శీతాకాలం రోజులు………..
ఆ అద్దాల మేడ వెనక రకరకాల రంగుల గులాబీ పూలతో నిండిపోయున్న ఆ ఉద్యానవనం కళకళ్లాడిపోతుంది.
ఆ శీతాకాలం పండు వెన్నెల జాబిలిలో, ఆ నిండు పున్నమి రాత్రిలో చుట్టూ తెల్లగులాబీలు పూచిన ఆ చీడీ మీద కూర్చుని తన ఒళ్లో ఉన్న ఆ వీణ మీద కొండ మలహరి రాగం వాయిస్తున్నాడా శాస్త్రిగారు.
ప్రవరాఖ్యుడి పోలికల్తో వున్న ఆ శాస్త్రినే చూస్తున్న అందాల ఆ జగదాంబ “మొల్లలేని నాకు తన్నే ముడుచు కొమ్మననే నే జెల్లపూవు కొప్పుతావి చెంచుదాననే” అంటా పాడతా ఆడుతుంటే గూళ్ళల్లో పక్షులన్నీ మైమరచిపోతా వింటున్నాయి.అందంగా విచ్చుకున్న గులాబీలు ఆనందంగా నవ్వుతున్నాయి.
అలా చాలా సేపయ్యింది.
నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి.
అడుగులో అడుగేసుకుంటా ఆ శాస్త్రి దగ్గరగా వచ్చేసినా జగదాంబ అతన్లో కలిసి పోతుంది.
శృంగారంలో వాళ్లు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకుని తమకంతో బయటికొచ్చింది.
కలగలిసి పోతున్నాళ్లకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకున్న పురిలో తన ముఖం దాచుకుంటా పచ్చగడ్డి మీద పడున్న ఆ పట్టుచీరా పట్టుపంచల్ని తొక్కుకుంటా ఆకు సంపంగి చెట్టుకింది కెళ్లిపోతుంటే, నవ్వుతా విరబూస్తున్న ఆ గులాబీలు చప్పుడురాని నవ్వులు నవ్వుతున్నాయి.
***
చామనఛాయ , వెనక్కి నొక్కి దువ్విన ఉంగరాల జుట్టు, పంచె, లాల్చీ, కండువా. అగ్రహారీకుడైన ఆ ఆణివిళ్ళ చినవెంకటశాస్త్రి అందగాడు. ఆవేళ అగ్రహారం వీధిలోంచి చాలా దర్జాగా నడిచెళ్తుంటే రెప్పార్పకుండా ఆయన్నే చూస్తున్నారా వూరి జనం. ఎదురొచ్చిన వేదుల సుబ్బరాయ శాస్త్రితో ఏదో మాటాడేకా ఏనుగుల రావి దాటి,నక్కల కాలవగట్టు దాకా వెళ్ళి తిరిగొస్తున్న తనకి ఆ చీడీల మీద కూర్చున్న జనాలు లేచి నిలబడి దణ్ణాలు పెడ్తున్నారు.
తండ్రి ద్వారా ఐదు వందల ఎకరాలొచ్చింది శాస్త్రికి. అదంతా ఈ కాకరపర్రు లోనూ, తూర్పు గోదావరి జిల్లా జగన్నాథగిరి, విశాఖ జిల్లా బొదుగుల్ల, వల్లూరిపల్లి అగ్రహారాల్లో వుంది.
చిన్న వయసులోనే చాలా విద్యలబ్బిన శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు ‘చెంపు రామాయణం’ రాసేరు. బొబ్బిలి వీణ ముందు కూర్చుంటే డబ్భై రెండు మేళకర్త రాగాల ఆరోహణ అవరోహణలు అవలీలగా వాయించి చూపించే అతనికి ఉదయ రవిచంద్రిక రాగం అంటే చాలా ఇష్టం. మలయమారుతం కూడా ఇష్టమే.
వాళ్ల అద్దాలమేడకి ముందూ వెనకా పెద్ద గులాబీపూల తోట. ఇంటి వెనకో అందమైన పర్ణశాల. పండిత గోష్టులూ కవి సంగమాలు అందులోనే. సుస్వరం కావడంతో పాడుతుంటే వింటున్న జనం ముగ్దులై పోతున్నారు.
మేడనిండా దాసదాసీ జనం. ఏ బంధువొస్తున్నాడో ఏ బంధువుపోతున్నాడో. పోతూ పోతూ ఏం పట్టుకు పోతున్నాడో ఏ మాత్రం తెలీటం లేదు. ఒక వేళ తెల్సినా పల్చగా నవ్వేస్తా “పోన్లెద్దూ పాపం ఏ అవసరమో వాడికి” అంటున్నారు.అంతేగాకండా ఆ వచ్చినవాడు ఏం అడిగినా సరే ఇచ్చెయ్యడమే. కాదు ,లేదు అన్న మాట లేదు. ఇంట్లోంచెప్పుడూ బయటికి రాని భార్య సూరమ్మ గారికియ్యేం తెలీవు.
పుట్టిన కూతురికి జానకీ దేవి అని పేరు పెట్టిన శాస్త్రి, ఆ చంటి బిడ్డ ఆడుకునే బొమ్మలు రంగూన్ నించి తెప్పించేరు.
అలా జానకీ దేవికి మూడో ఏడు వచ్చేక సూరమ్మగారు చనిపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఇంజరం గ్రామం మనిషైన బుల్లెమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఒక రోజు వాళ్ల కాకరపర్రు జనమంతా శాస్త్రిగారి మేడలో కొచ్చి ఊరికి మీరు ప్రెసిడెంటుగా చెయ్యాలంటా పట్టుబట్టేరు.
నవ్వేసిన శాస్త్రి “సరే” అంటా రంగంలోకి దిగేరో లేదో వీధి దీపాల సందడి కి శ్రీకారం చుట్టేసేరు.ఊరి వీధుల్లో స్థంభాలు పాతించి వాటి మీద పలకల గాజు తలుపులున్న చిమ్నీ దీపాలు పెట్టించి సొంత ఖర్చుల్తో పెట్టుకున్న పనోడితో రోజూ దీపాల వేళప్పుడు ఆ దీపాల్లో చమురుపోయించి మా గొప్పగా వెలిగిస్తుంటే ఊరు మొత్తం ఆ చమురు దీపాల్తో వైకుంఠపురంలా గెలిగిపోతుంది.
అది చెప్పడానికి ఊరి జనమొస్తే “అవునా… అయితే పదండోసారి చూసొద్దాం” అంటా వాళ్ళతో పాటు కదిలిన శాస్త్రి, మా గొప్పగా వెలిగిపోతున్న ఆ దీపాల్ని చూస్తా నడుస్తున్నారు. వేదుల రామచంద్రశాస్త్రిగారింటి దగ్గర ఐదు నిమిషాల పాటు నిలబడి పోయేకా నెమ్మదిగా కదుల్తా చర్ల కామరాజు గారింటి దగ్గర మళ్లీ ఆగిపోయేరు. అక్కడ్నించి బ్రాహ్మణవీధి వేపెళ్ళి, ఎప్పటికో వాళ్ల మేడలోకి తిరిగొచ్చిన శాస్త్రి ఒకసారి లోపలి కెళ్ళి పరమానందంగా గప్గప్ మని పొగ వదుల్తా చుట్టకాల్చుకుంటా వచ్చేరు.
నిలబడ్డ గుంపులో ఒకడైన ఆకుండి ఆదినాణ ఆయన కాలుస్తున్న చుట్టని పరిశీలనగా చూసేడు.
అది వల్లూరుపల్లి నించొచ్చే ఏడాది శిస్తుకి సమాన మైన వంద రూపాయిల నోటుతో చుట్టుకున్న చుట్ట..
అలా ప్రవర్తిస్తా ఊర్నలాగ పరిపాలిస్తా వస్తున్నా ఆణివిళ్ల చినవెంకటశాస్త్రి ఖర్చులు బాగా పెరగటంతో బొదుగుల్ల అగ్రహారం భూమి పూర్తిగా అమ్మేసేరు.
***
***
పెదనాన్న కొడుకు ఆణివిళ్ళ వీరవెంకటసత్యనారాయణమూర్తి{అబ్బాయి}పెళ్లి. ఒక రోజూ రెండ్రోజులుగాదు ఏకంగా ఐదు రోజులు. పెళ్లి కొడుకుని ఏనుక్కి కట్టిన అంబారీ మీద ఊరేగిస్తున్నారు. అసలీ పెళ్లిలో మా గొప్ప ఆకర్షణేంటంటే మేళాలు.
చిలకలూరిపేట, వేల్పూరు, పెద్దాపురం, మురమండ, మండపేటల నించి అయిదు రాత్రుళ్ళూ ఆడ్డానికి, తెప్పించిన ఆ మేళాల్ని అనుసింగరాజు గారింట్లో పెట్టి ఆ ఇంటి ముందరే పెద్ద పందిరి, దాని కింద మేళం ఆడ్డానికి బల్లలూ వేసేరు.
కొత్తగా వచ్చిన పెట్రొమాక్స్ లైట్ల వెలుగుల్లో ఒకో రాత్రీ ఒకో మేళం.
వాటిని పరమానందంగా చూస్తున్న శాస్త్రి ఆఖరి రోజున మండపేట నించొచ్చిన ఆ మేళంలో అందాల రాశి ఆ జగదాంబని కంచు కాగడాల వెలుగులో చూసేరు మొదటిసారి.
అలా చూసినప్పుడు అసలిలాంటి అందగత్తెని పుట్టేకా ఎప్పుడూ చూళ్ళేదని చాలా గట్టిగా అనేసు కున్నారు.
మేళం అంటే ప్రధానంగా నాట్యం, అభినయం వాటిలో మాంచి ప్రావీణ్యం వున్న జింకావధాని, నల్లమందు వెంకన్న, భాష్యకారశాస్త్రి, వేదుల రామచంద్రుడు లాంటోళ్ళు చెప్పిన రీతులకి మా గొప్పగా నాట్యం చేసి అందరి మెప్పులూ పొందిన ఆ జగదాంబని రెప్పార్పకుండా చూస్తున్నారు శాస్త్రి.
అది గమనించిన జగదాంబ, ఆ శాస్త్రినే చురుగ్గా చూస్తా నవ్వేటప్పటికి తనలో తన్మయానందం పొలమారినట్టయ్యిందా శాస్త్రికి.
“అన్నమాచార్య కీర్తన…… “చూడగల్గెను రాముని సుందర రూపం తెలుసా?” అనడిగిన ఆయనకేసి చాలా అందంగా చూసి అరవైమూడో మేళకర్త లతాంగి రాగంలో అద్భుతంగా పాడతా నాట్యం చేసేటప్పటికి అలాగుండి పోయిన శాస్త్రి కాసేపటికి తేరుకుని “నారాయణ తీర్థుల హరితరంగం……… ఏహి ముదం దేహి శ్రీకృష్ణా….” అని అన్నారో లేదో అరక్షణంలో అందేసుకుని పాడుతా నాట్యం చేస్తుంటే హార్మోనియం, డోలక్ వాళ్లు మాగొప్పగా తోడైపోయేరు.
అలాగా రాత్రంతా శాస్త్రి ఇలా అడగడం పాపం. వెంటనే అందేసుకుని ఆడి చూపిస్తుంటే ఆ జగదాంబ ని అలా చూస్తానే ‘ఈ మనిషి మామూల్ది కాదు అసలిక్కడ పుట్టాల్సిన మనిషి కాదు’ అని మళ్లీ మళ్లీ అనేసుకున్నారు.
ఇంటికెళ్ళేరు గానీ నిద్రరావడం లేదు. కంచుకాగడా వెలుగులో జగదాంబ ముఖమే కనిపిస్తుంది. చిత్రమైన నవ్వుతో కనిపిస్తుంది. చిత్రమైన నవ్వుతో కనికరిస్తుంది.
మర్నాడు వాళ్ల మేళంలో కొందరితో పాటు జట్కాబండి ఎక్కుతా ఆ మనిషి చేసిన ఆ గమ్మత్తైన సైగ సుతిమెత్తగా అర్థమైందా శాస్త్రికి.
***
ఆ తెల్లవారు ఝామునే కాకరపర్రులో వాళ్ల మేడముందు జట్కా బండి ఎక్కినా చినవెంకటశాస్త్రి ఆ ఎర్రకంకర దారమ్మట పెరవలి మీదుగా సిద్దాంతం రేవులో ఆగి అక్కడ పడవెక్కి వశిష్టగోదారి పాయ దాటి, అక్కడ మళ్లీ ఇంకో జట్కా బండెక్కి, రావులపాలెం రేవు దాకా వెళ్లి దిగి మళ్లీ పడవెక్కి, గౌతమీగోదారి పాయదాటి ఆలమూరు రేవులో మళ్లీ జట్కా బండెక్కి మండపేట ఊళ్లో ఆ జగదాంబ ఇంటి ముందు దిగేటప్పటికి తన కోసమే ఎదురు చూస్తున్న ఆ అందాల జగదాంబ వెచ్చగా తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే జన్మలో ఎరగని తన్మయత్వం. ఎప్పుడూ లేని చిత్రమైన అదురు విచిత్రమైన బెదురు.
రెండు గోదావరి పాయలు దాటి అలిసిపోయి వచ్చినాయనకి పన్నీరు కలిపిన వేడ్నీళ్ల స్నానం చేయించి, లుంగీలా చుట్టుకోడానికి పొందూరు ఖద్దరు పంచ, లాల్చీ ఇచ్చి దాని మీద కునేగా మరికుళందు సెంటు రాస్తున్న ఆమె శరీరంలోంచి చిత్రమైన సువాసనలు.
వాటిని అనుభవిస్తా తన కళ్ళల్లో కాంతిని తాగేస్తున్న ఆ శాస్త్రిని నెమ్మదిగా పందిరి మంచం దగ్గరకి తీసుకెళ్లి, ఆ బూరుగు దూది పట్టుపరుపు మీదకి జారేసి అతని పక్కన తనూ చేరేకా జరిగిన శృంగారం ఎంత సువాసనొచ్చిందో చెప్పడం ఎవరితరం కాదు. అసలు అనుభవిస్తున్న వాళ్లతరం కూడా కాదు. ఆ జగదాంబ ఒలకబోస్తున్న ఆ శృంగారం రుచికి ఎలాంటి పేరు పెట్టాలో అంత భాష తెల్సినా శాస్త్రిగారికసలు అర్థం గావటం లేదు.
అలాగలా అనుభవించి అలిసి సొలసిన ఆ శాస్త్రిగారు నిద్రలోకెళ్ళి, ఎప్పుడో పొద్దోయేకా లేచేరు.
రాత్రి ఆయన ముందు పరిచిన అరిటాకులో అతి రుచికరమైన కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ వేసింది. బ్రాహ్మల వంటావిడ్ని పిలిపించి చేయించిన ఆవపెట్టిన పనసపొట్టుకూర, ములక్కాళ్ళేసి కాచిన పప్పుపులుసు ఆ వంకసన్నం బియ్యంతో వండిన అన్నంలో కలుపుకుంటున్న శాస్త్రి ఎంత ఆరగించేడో ఆయనకే తెలీదు.
ఆ వేళ వెన్నెల మొదటి రోజు. దొడ్లో తీగమల్లి పందిరి కిందేసిన మంచం మీద తెల్లటి ఆ పరుపు. పరిమళాలు చిందిస్తున్న తన ప్రియురాల్ని మృదువుగా తన గుండెలకి హద్దుకుని మల్లెపందిరి తీగల సందుల్లోంచి చంద్రుడ్ని చూస్తుంటే ఎలా చెప్పాలా అనుభూతి గురించి???.
వాత్సాయన కామసూత్రాల్ని ఔపోసన పట్టిన ఆ జగదాంబ అతనక్కడున్న ఆ వారం రోజులూ స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే వుందనిపించింది.
ఇక్కడ్నించి ప్రయాణంలో శ్రమని మర్చిపోయిన శాస్త్రి మండపేట వెళ్ళడం ఒకోసారి జగదాంబే కాకరపర్రు రావడం సాధారణం అయిపోయింది. ఇంట్లోంచి బయటికి రాని ఆ శాస్త్రిగారి రెండో భార్య బుల్లెమ్మాయి రంగుల కిటికీ అద్దాల్లోంచే ఆ అందాల జగదాంబని రెప్పార్పకుండా చూస్తుంది.
***
ఇంగ్లండ్ నించి బొంబాయికి, ఆ బొంబాయి నించి కాకరపర్రుకీ తెప్పించిన కారులో జగదాంబనెక్కించి షికార్లు చేస్తున్న శాస్త్రి, కారులో పోసే పెట్రోల్ని బెజవాడ నించి తేవడానికి ఇద్దరు గుమాస్తాల్ని పెట్టేరు. నిడదవోలు లో రైలెక్కెళ్ళి ఆ పెట్రోలు తెచ్చి కార్లో పోసే వాళ్ళకి బోల్డన్ని జీతాలు.
ఆ రాత్రి ఆ జగదాంబని ముద్దు పెట్టుకున్నప్పుడు “పంచదార పాకంలా ఇంత బాగున్నాయేంటి మీ పెదాలూ?” అంది.
అంతే.
దగ్గర్లో ఎక్కడా దొరకని ఆ ఖరీదైన పంచదార రాజమండ్రీ నించి తెప్పించి చేయించిన మిఠాయిలు మొహం మొత్తేలా ఆ జగదాంబతో తినిపించడమే గాకుండా వాళ్ళ కాకరపర్రు వూరి వాళ్ళదంరికీ పంచిపెడ్తుంటే ఒకటే సందడి తింటున్న ఆ జనాల్లో.
జగదాంబకి పుట్టిన ఆ కూతురు అచ్చం ఆ శాస్త్రిగార్లాగే వుంది. ఆ పసిబిడ్డని ఎత్తుకుని తెగాడిస్తా ఆ పిల్ల ఆడుకునే బొమ్మలు ఇక్కడ్నించీ అక్కడ్నించీ గాకుండా సరాసరి నేపాల్నుంచి రప్పించేరు. వాటితో ఆనందంగా ఆడుకుంటున్న ఆ పిల్లని పరమానందంగా చూస్తా “జానకీదేవీ” అని పిలుస్తుంటే అది వింటా చూస్తున్న జగదాంబ కూడా అలాగే పిలుస్తుంది.
రేపట్నుంచి వెన్నెల రోజులు మొదలవుతాయనగా పసిబిడ్డ జానకీదేవిని ఎత్తుకుని మండపేట నించి వచ్చే జగదాంబ ఆ అద్దాల మేడలో పరమానందంగా కలతిరుగుతుంటే చూస్తున్న శాస్త్రి సంబరం ఇంతా అంతా గాదు.
వెన్నెల రాత్రుళ్ళప్పుడు ఇంటి వెనకున్న ఆ గులాబీ తోటలో తప్పటడుగులేస్తున్న ఇద్దరు జానకీదేవిల్నీ ఆడిస్తా వుంటే నిద్రొచ్చితూల్తున్న ఆ బిడ్డల్ని పాలేరోళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయేరు.ఆతర్వాత బొబ్బిలి వీణ అందుకుని పిభరే రామరసం వాయిస్తా వుంటే కాళ్ళకి గజ్జలు కట్టిన ఆ జగదాంబ కోమలమైన తన గొంతుతో పాడతా నాట్యం చెయ్యడం మొదలెట్టింది…. అలాగ ఎంతసేపో.
ఆ తర్వాతెప్పుడో తన ఒళ్ళోవాలి పోయేకా వాత్సాయనుడు నిద్రలేస్తున్నాడు.
***
అప్పుడప్పుడూ చంటిబిడ్డతో పాటు కాకరపర్రు వచ్చేసి ఈ మేడలో కలతిరగడం అలవాటైపోయినా జగదాంబ కోసం వాళ్ళ మండపేటలో అచ్చం ఇలాంటి అద్దాలమేడ కట్టడం మొదలెట్టేరు శాస్త్రి.
మేస్త్రి గుర్రం ఆంజనేయులు, వడ్డా పాపయ్య గుమ్మాలకి నెగిషీలు చెక్కడం మొదలెట్టారు. కిటికీలకి బెల్జియం నించి తెప్పించిన అద్దాలు బిగిస్తున్నారు.
ఇదే గాకుండా ఇలాంటి విచ్చలవిడి ఖర్చులు చాలా పెరిగిపోడంతో వాళ్ళ కాకరపర్రుకి పాతికమైళ్ళ దూరంలో వున్న వల్లూరుపల్లిలో మొత్తం పొలం, కాకరపర్రులో మూడొంతుల పొలం మాయమై పోయినియ్యి.
అయినా ఆ శాస్త్రిగారి విచ్చలవిడి ఖర్చులేమాత్రం తగ్గటం లేదు. అవే దానధర్మాలు.అవే జల్సాలు. వచ్చినోళ్ళు ఎంతెంత పట్టుకుపోతున్నారో ఏ మాత్రం గమనించడం లేదు. బంధువునంటా పాలకొల్లు అవతల శివదేవుని చిక్కాల నించొచ్చినా మనిషి తన అవసరాలు చెపితే జాలిపడి ఖాళీ దస్తావేజుల మీద సంతకం పెట్టేసేరు.
యలమంచిలి పక్కన కొక్కిరాపల్లి నించొచ్చిన బంధువు బీదరుపులరిస్తే ఇనప్పెట్లో రొక్కం మొత్తం ఇచ్చేసేరాడికి. రాజమండ్రీలో కారు అమ్మేసి డబ్బట్టుకుని లాంచీ లో వస్తుంటే కొడుకూ కోడలూ అన్నం పెట్టడం లేదని ఒక ముసలితల్లి ఏడ్చేటప్పటికి మొత్తం డబ్బు ఆవిడ కిచ్చేసి వాళ్ళ కాకరపర్రు రేవులో దిగిపోయి మేడలో కొచ్చేసేరు.
మండపేటలో కడ్తున్న అద్దాలమేడకి వెనక దూలాలు కావాలి. చేతిలో చూస్తే డబ్బులేదు. అప్పుడీ కాకరపర్రు మేడ వెనక దూలాలు పీకి పట్టుకెళ్ళి ఆ మండపేట మేడకి బిగించేరు. ఇక్కడున్నట్టే అర్థచంద్రాకారం గేటు ఇక్కడది పీకి అక్కడ పెట్టేరు.
బొదుగుల్ల పొలం మొత్తం పరాయిదైపోయింది.
***
ఆరొందల ఎకరాల ఆస్థి హారతి కర్పూరమై పోయింది.
అప్పుల వాళ్ళయితేనేం, బంధువులమంటా ఇంజరం పక్కన పల్లెపాలెం నించొచ్చిన జనాల కారణంగానైతేనేం ఇంట్లో వున్న సామాన్లన్నీ మాయమైపోతున్నాయి. ఇనప్పెట్లో బంగారు నగలెప్పుడో వెళ్ళిపోతే,అద్దాల బీరువాల్లో వెండి సామాన్లూ, సరంబీల మీద రాగీ ఇత్తడి సామాన్లిప్పుడెళ్ళిపోతున్నాయి.
ఆఖరికి ఎంతో మోజుపడి తెప్పించుకున్న తన పడగ్గదిలో పందిరిమంచం, బిళ్ళారీ అద్దాలూ, చిమ్నీ దీపాలూ అమ్మకానికి పెట్టాల్సొచ్చింది.
సామాన్లు సవ్వారీ బళ్ళ మీదెళ్ళి పోయినియ్యిగానీ డబ్బులు రాలేదు.
అదంతా చూస్తున్న పెదనాన్న పిల్లలూ వాళ్ళూ మిగిలింది అమ్మకుండా అడ్డుపడ్డంతో శాస్త్రిగారి కష్టాలు మొదలైనియ్యి.
కటిక పేదరికంతో కూరుకుపోతున్నాడా అభం శుభం ఎరగని అమాయకుడైన అందాల శాస్త్రిగారు.
గుర్రాలకి దాణా పెట్టడానికీ పడవలోళ్ళకి కిరాయి ఇవ్వడానికీ సాదరు ఖర్చుల్లేక మరి మండపేట వెళ్ళలేకపోతున్నాడు.
తన దగ్గర కొచ్చెయ్యమంటా బతిమాల్తున్న జగదాంబ ఏలోటూ రాకుండా చూసుకుంటానని ఏడుస్తుంది.
ఎటో చూస్తా నవ్వేసిన శాస్త్రి “ఏలోటూ రాకుండా నువ్వు సుఖంగా వుండు” అంటా దీవించేరు తప్ప ఆ మండపేట మాత్రం వెళ్ళలేదు.
***
శాస్త్రిగారి పరిస్థితి గురించి విన్న పెనుగొండ జమీందారు ఆయనకి సన్మానం చేసి రకరకాల బట్టలూ,వస్తువులూ,నగలూ ఇచ్చి గుర్రబ్బండిలో సాగనంపితే…..దారిలో ఆ గుర్రబ్బండోడు చెప్పిన తన కన్నీటి కధ కి కరిగి నీరై పోయిన శాస్త్రి,అవన్నీ వాడినే ఉంచుకోమని ఆ బండి దిగిపోయి కాలి నడకన కాకరపర్రు వచ్చేసేరు.
తణుకు జమీందార్ల మేడలో జగదాంబ మేళం ఆడ్తుందని తెల్సిన శాస్త్రి, కాలినడకన బయల్దేరెళ్ళి పోయి తనెవరో తెలీకుండా ముఖమ్మీద కండువా వేసుకుని తలుపు వెనక నిలబడి చూస్తున్నారు.
ఆ జమీందార్లలో ఒకరైన రఘురామారావు“మొల్లలేని నాకు తన్నే ముడుచుకొమ్మననే” అన్న అన్నమయ్య శృంగార కీర్తన ఆలపిస్తా నాట్యం చెయ్యమన్నారు.
“అది భర్త ముందు మాత్రమే ఆలపిస్తా ఆడ్డం మా సాంప్రదాయం” అంటా పరమ నిజాయితీగా చెప్పేసిన ఆ జగదాంబ కండువా ముసుగులో ఆ భవంతి ద్వారం మూల దాక్కుని చూస్తున్న ఆ శాస్త్రి ముందు కొచ్చి ఆ కీర్తన పాడతా ఆడ్డం మొదలెట్టింది.
అది చూసినా జమీందారు నిర్ఘాంతపోయేరు.
***
అందగాడూ, మహాపండితుడూ, మహాదాత, గులాబీరేకు లాంటి జగదాంబ ప్రేమికుడూ అయినా ఆ ఆణివిళ్ళ చినవెంకట శాస్త్రి,లేత గులాబీలాంటి ఆ జగదాంబ నే జపిస్తా చనిపోయేరు.
కానీ,
ఆ కాకరపర్రులో వున్న ఆ అద్దాలమేడ చుట్టూ ఉన్న ఉద్యానవనంలో ఆనాటి నించీ ఈనాటి వరకూ ఒక్కటంటే ఒక్క గులాబీ పువ్వు మళ్ళీ పూయ లేదు.
కావాలంటే ఇప్పుడే బయల్దేరెళ్ళి చూడండా కాకరపర్రు గ్రామంలో ఉన్న ఆ అద్దాలమేడ వెనక……
***
Share this Article