Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వనజీవి… ధరణి మాతకు ఆకుపచ్చని పట్టుచీర నేసిన ధన్యజీవి…

April 14, 2025 by M S R

.

“చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక
వసంతమన్నా దక్కేది…
మనిషినై పుట్టి అదీ కోల్పోయాను”
అని గుంటూరు శేషేంద్ర శర్మ బాధపడ్డాడు కానీ…

వనజీవి రామయ్య బాధపడలేదు. మనిషిగానే పుట్టి వనవసంతాల ఆకుపచ్చని ఆశలను నాటుతూ వెళ్ళాడు. నాటిన ప్రతి మొక్కముందూ చేతులు జోడించి మనిషికి వసంతాన్ని ఇమ్మని వేడుకున్నాడు. తానే చెట్టయి ఎదిగి కొమ్మల రెమ్మల చేతులు చాచి సేదతీరడానికి జగతికి నీడనిచ్చాడు.

Ads

వివస్త్ర అవుతున్న ధరిత్రికి ఆకుపచ్చ పట్టుచీర కప్పాడు. ఊపిరి తీసుకోవడానికి కరువైన గాలిని కరువుదీరా ఇచ్చాడు.

సంస్కృత పదవ్యుత్పత్తి ప్రకారం “శతమనంతం భవతి”. శతం, సహస్రం అంటే వంద, వెయ్యి అనే అర్థం అంకెలవరకే. లెక్కల భాష దాటి సాధారణ వాడుకలో ఆ రెండు మాటలకు అర్థం “లెక్కపెట్టలేనంత” అని ఆ నిర్వచనం స్పష్టంగా చెబుతోంది. అందుకే నువ్వు వంద చెప్పు… వెయ్యి చెప్పు అంటే ఎన్నయినా చెప్పు అనే అర్థమే తీసుకుంటున్నాం.

ఆ కోణంలో వనజీవి రామయ్య తన జీవితకాలంలో నాటిన మొక్కలు… చెట్లుగా ఎదిగి లోకానికి పచ్చటి మెట్లుగా పెరిగినవి కోటిన్నరకు పైగా అని అంకెల్లో చెబితే అక్షరాలా ఆయన్ను అవమానించినట్లే. మనం లెక్కపెట్టలేనంత వనయజ్ఞం ఆయనది.

“పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి నద్యః ।
పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థమిదం శరీరమ్”

పరులకోసమే చెట్లు పండుతున్నాయి. పరులకోసమే నదులు ప్రవహిస్తున్నాయి. పరులకోసమే ఆవులు పాలు ఇస్తున్నాయి. అలాగే పరులకోసమే ఈ శరీరముంది- అన్న ఆదర్శం అక్షరాలా అన్వయమైన ధన్యజీవి వనజీవి రామయ్య.

మెడలో చెట్టును చుట్టుకుని, చంకలో మొక్క పిల్లలను పట్టుకుని, వీపున మొక్కలను కూర్చోబెట్టుకుని, సైకిల్ మీద గునపంతో ఆయన బయలుదేరితే ఎడారులన్నీ ఎదవిచ్చి పిలిచాయి. నాటాల్సిన చోట్లన్నీ చేతులు జోడించి నిలిచాయి.

మోడువారిన బతుకుల్లోకి తోటల పాటలను వెంటబెట్టుకుని వచ్చాడు రామయ్య. ఆకురాలిన వనాల్లో ఆమనులను నాటి వెళ్ళాడు.

ఆ కొమ్మలు-
నేలకు చిగుళ్లు తొడుగుతున్నాయి.
గాలికి గంధాలు పుస్తున్నాయి.
ప్రాణాలకు పత్రహరితాలను అద్దుతున్నాయి.
కొమ్మకు కట్టిన ఉయ్యాలలై ఊగుతున్నాయి.
మన జన్మలకు ఊపిరులు ఊదుతున్నాయి.

రాముడు వనవాసానికి వెళుతుంటే అయోధ్య వాసులందరూ సరయూ నది దాకా వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారు. వేళ్ళున్నందుకు కదల్లేక చెట్లు కొమ్మలచేతులు ఆ రామయ్య వెళ్ళినవైపు చాచి విలపించాయన్నాడు వాల్మీకి. ఈ వనజీవి రామయ్య ఏ వనవాసానికి, ఎటు వెళ్ళాడో తెలియక ఆయన పెంచిన కోట్ల కోట్ల కొమ్మలు అన్ని వైపులా చేతులు చాచి మొక్కుతున్నాయి.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions