.
Subramanyam Dogiparthi
…… వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం స్వరం మారుతున్నది, వరస మారుతున్నది … సి నారాయణరెడ్డి గారు వ్రాసిన ఈ ఆలోచనాత్మక గీతం కన్నెబోయిన శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాస్ గా మార్చేసింది . ప్రపంచానికో గొప్ప గాయకుడిని ఇచ్చింది .
నేను నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న సమయంలో యూనివర్సిటీ కాలేజి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా ఆయన వచ్చినప్పుడు వేదిక మీదుండి ఆయన నుండి ఈ పాటను వినే అవకాశం కలిగింది . ఇరవై ఏళ్ళ కింద . ఆయన నాగార్జున యూనివర్శిటీలో పిజి చేసారు .
Ads
నారాయణరెడ్డి గారు వ్రాసిన ఈ పాట విశేషం ఏమిటంటే వందే మాతరం పాటలోని ముఖ్య పదాలను తీసుకుని సమకాలీన సమస్యలతో ముడి పెట్టడం . గొప్ప ప్రయోగం . వందే మాతరం సినిమాకు గుండె కాయ లాంటి ఈ పాటను ఆయన ఈ సినిమా కోసం వ్రాయలేదు . ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైన ఈ పాటను ప్రజా నాట్యమండలి వారు ఎప్పటి నుంచో పాడుతున్నారు .
ప్రజా నాట్యమండలి నేపధ్యం నుండి వచ్చిన టి. కృష్ణ ఈ సినిమాకు ఉపయోగించుకున్నారు . శ్రీనివాసుని వందే మాతరం శ్రీనివాసుని చేసారు . తన వందే మాతరం సినిమాను ఓ సూపర్ హిట్ సినిమాను చేసారు .
ఈ వందే మాతరం సినిమాకు మరి కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి .
డా రాజశేఖర్ని తెలుగు తెరకు పరిచయం చేసింది . కొండవీడుని రాజధానిగా చేసుకుని రెడ్డి రాజ్యాన్ని ఏలిన ప్రాంతమైన ఫిరంగిపురం , అమీనాబాద్ గ్రామాల్లో ఈ సినిమా షూటింగ్ అంతా జరిగింది . ఈ ప్రాంతంలో ఉన్న ప్రాచీన ఆలయాలను , అవశేషాలను టి. కృష్ణ సినిమానుగుణంగా బాగా ఉపయోగించుకున్నారు . ఇవన్నీ మా గుంటూరు జిల్లాలోనివే .
కధాంశం పాతదే . 1940s నుండీ గ్రామ సీమల్లోని ముఠా తగాదాలు , మూఢ నమ్మకాలు , వాటి మైకంలో విద్య వైద్యాన్ని గాలికి వదిలేయటం వంటి రుగ్మతల మీద పుంఖానుపుంఖాలుగా సినిమాలు వచ్చాయి . వాటిని ఆవిష్కరించే తీరు , సామాన్య ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చెప్పడం , శ్రావ్యమైన సంగీత నృత్యాలతో చెప్పడం ముఖ్యం . అవన్నీ చేసాడు టి. కృష్ణ .
వి యస్ కామేశ్వరరావు అందించిన కధను బిర్రయిన స్క్రీన్ ప్లేతో ఆవిష్కరించారు . మాటల్ని కూడా ఈ కామేశ్వరరావు గారే చాలా పదునుగా వ్రాసారు . ఈ సినిమా ఘన విజయానికి ఒక కారణం సంగీతం , నృత్యం . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . స్కూల్ పిల్లలు ఏదయా మీ దయా మా మీద లేదు అంటూ పాడుకుంటూ కలెక్టర్ దగ్గరకు వస్తూ పాడే పాట చాలా గొప్పగా ఉంటుంది . దసరా పండుగ సమయంలో మా చిన్నప్పుడు పాడిన జయా విజయీ భవ దిగ్విజయీ భవలోని పదాలను తీసుకుని ఈ సినిమా పాటను అల్లారు .
మరో చక్కటి పాట విజయశాంతి , స్కూల్ పిల్లల బృంద నృత్యంతో నా పేరే పల్లెటూరు మన దేశానికి మరో పేరు . ఆనాటి గ్రామాలలో ఉన్న అన్నయ్య , అక్కయ్య , మామ , బాబాయ్ అని వరసలు పెట్టుకుని జీవించే సంస్కృతిని , సంస్కారాన్ని అద్భుతంగా చూపారు ఈ పాటలో . అదృష్ట దీపక్ వ్రాసారు ఈ పాటను .
విజయశాంతి , రాజశేఖర్ల డ్యూయెట్ ఆకాశమా నీవెక్కడ అవని పైనున్న నేనెక్కడ చాలా అందంగా చిత్రీకరించారు టి కృష్ణ . సినిమా అంతా విజయశాంతిని చాలా అందంగా ప్రెజెంట్ చేస్తారు టి. కృష్ణ . ఆమె కోసమే పుట్టి ఉంటాడు ఆయన . మరో పాట జయమాలిని మీద ఉంటుంది . అల్లాటప్పా ఆడదాన్ని కాదురబ్బాయా పాట హుషారుగా ఉంటుంది . నత్యాలను కంపోజ్ చేసిన చిన్నాని మెచ్చుకోవాలి .
నారాయణరెడ్డి గారితో పాటు అదృష్ట దీపక్ , దాసం గోపాలకృష్ణ పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , శైలజ , మాధవపెద్ది రమేషులు పాడారు అద్భుతంగా . ప్రజా నాట్యమండలి పటాలం అంతా కనిపిస్తుంది . టి. కృష్ణ , మాదాల రంగారావు సినిమాల్లో ప్రజా నాట్యమండలి వారికి విస్తృతంగా అవకాశం ఇవ్వడం ముదావహం .
ఈ సినిమాలో ఎప్పటిలాగే మెచ్చుకోవలసింది నిర్మలమ్మను , సుత్తి వేలుని … ఇరగతీసారు . సుత్తి వేలుకు సపోర్టింగ్ ఏక్టరుగా నంది అవార్డు కూడా వచ్చింది . వారిద్దరి తర్వాత చెప్పుకోవలసింది కోట శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వరరావు , నల్లూరి వెంకటేశ్వర్లు , సాక్షి రంగారావు , రాజేంద్రప్రసాద్ , చిట్టిబాబు , డబ్బింగ్ జానకి , పి యల్ నారాయణ , సాయిచంద్ , ప్రభృతులను . సినిమా చాలా వరకు ఫిరంగిపురం చుట్టూ ఉన్న ఔట్ డోర్ లొకేషన్లే .
టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య కో డైరెక్టర్ . తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందిన ఈ సినిమాకు నిర్మాత వై అనిల్ బాబు . వీరు బహుశా మా గుంటూరు జిల్లా ఫిరంగిపురం ప్రాంతం వారేమో తెలియదు . అందువలన ఈ ప్రాంతాన్ని ఔట్ డోర్ షూటింగుకు ఎంచుకొని ఉండవచ్చు .
బహుశా ఈ సినిమాను చూడనివారు ఎవరూ ఉండకపోవచ్చు . ఒకరూ అరా ఉంటే తప్పక చూడవలసిన సినిమా . యూట్యూబులో ఉంది . కళాపోషణతో పాటు మనిషికి సామాజిక స్పృహ కూడా ఉండాలిగా ! నా రివ్యూ పూర్తి చేసే ముందు విన్నపం ఏమిటంటే… కొండవీడు , ఫిరంగిపురం , అమీనాబాదులలో , చుట్టుపక్కల పురాతన దేవాలయాలు ఉన్నాయి.. . రెడ్డి రాజుల , కాకతీయుల కాలం నాటివి … ఇప్పుడు కొండవీడు మీదకు ఘాట్ రోడ్ కూడా ఉంది … ఒక రోజు టూర్ ప్లాన్ చేసుకుని వీటన్నింటినీ చూడండి … #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article