ఎక్కడో తగలరాని తావులో తగిలింది, అది కంటికే కనపడని గాయమైంది… ఈ పాట గురించి సెన్సార్ వాళ్ళు ద్వందార్థం ఉంది అంటూ అభ్యంతరం చెబితే, నిర్మాత ఆత్రేయ గారినే అక్కడికి తీసుకుని వెళ్తే, ఆయనే వాళ్లకు వివరించాడని… మీరనుకున్నట్టు నేను బూతు రాయలేదు… తగలరాని తావు అంటే మనసు అనే అర్థం మాత్రమే అంటూ వివరణ ఇచ్చేసరికి సెన్సార్ వాళ్ళు ఇక చేసేది లేక కన్విన్స్ అయ్యారట…..
నిన్న మనం చెప్పుకున్న ఎదురులేని మనిషి పోస్టుకు సంబంధించి… దోగిపర్తి సుబ్రహ్మణ్యం ఒరిజినల్ ఫేస్‌బుక్ పోస్టు కామెంట్లలో పైన కామెంట్ కూడా కనిపించింది… మరికొన్ని కామెంట్స్ కూడా ఇంట్రస్టింగు… (పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాముల్లో అప్పుడప్పుడూ ఎస్పీ బాలు చెప్పేవాడు… ఎన్టీయార్ ఇనుప లవ్వు అంటూ… ఇక చదవండి…)(ఆత్రేయను తరచూ ఇండస్ట్రీలో బూత్రేయ అని కూడా పిలిచేవారట ఇండస్ట్రీలో…)
హే కృష్ణా .. ముకుందా మురారీ.. అన్న పాట షూటింగ్ లో.. డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన.. డ్యాన్స్ చూసిన.. హీరోయిన్ వాణిశ్రీ.. నటరిటైర్మెంట్ .. ఆలోచనకు నాంది పలికిన సిన్మా… అని మరో కామెంట్… ఔనా..? వాణిశ్రీ ఈ సినిమా తరువాతే పిచ్చి గెంతులు, హీరోలతో కిందామీదా పొర్లుగింతలు మానేసిందట నిజమేనా..? తరువాత కూడా చాలా సినిమాలు చేసింది కానీ మరీ ఈ రేంజ్ పిచ్చి గెంతులైతే వేసినట్టు గుర్తులేదు… (ఎన్టీయార్ కూడా ఈ స్టెప్పులు వేయాలా అని మొదట్లో వెనుకాడినట్టు చెబుతారు)…
Ads
ఓరోరి యోగి నన్ను నమిలేయ్‌రో అనే ఓ పాట గుర్తుంది కదా… దానికి తాతలాంటి పాట ఇందులో… కసిగా ఉంది, కసికసిగా ఉంది పాట… నిజంగానే ఎన్టీయార్ నమిలేసినంత పని చేశాడు… అప్పట్లో సెన్సార్ చాలా కఠినంగా ఉన్నా, ఆత్రేయ పాటలు కొంచెం శృతి మించాయి.., కసిగా ఉంది, ఒక్కసారి వచ్చిపోరా అని కొంచెం బూతు అర్దాలున్నా నిర్మాతలు మేనేజ్ చేసి కత్తెర పడకుండా చూసుకున్నారట…
అప్పటిదాకా కాస్త క్లాస్, కాస్త మాస్ కలిపేసి సినిమాలు చేస్తున్న ఎన్టీయార్ ఇమేజీని పూర్తిగా ఊర మాస్‌లోకి మార్చేసింది ఈ సినిమాయే… తరువాత బోలెడు ఇలాంటివే మసాలా సినిమాలు చేశాడు తను… పాటలు సరేసరి… ఎన్టీఆర్, వాణిశ్రీ లకు అప్పటికున్న ఇమేజ్ మీద కాసింత మసి పూసింది… వాణిశ్రీ చేత సినిమాలకు గుడ్ బై చెప్పించే దిశగా నిర్ణయించుకునేలా చేసిన సినిమా ఇదే !… ఇది మరో కామెంట్…
(ఇందులో డ్యుయెట్ పాటల కంపోజింగ్ అభ్యంతరంగా ఉండి, మూమెంట్స్ నటీనటులకు కొత్తగా ఇబ్బందిగా ఉండడంతో ఎన్టీఆర్, వాణిశ్రీ ఇద్దరూ ఇబ్బంది పడ్డారట… ఎన్టీఆర్ దర్శకుల హీరో కావడంతో, ఆయన దర్శకుడు చెప్పినట్టు చెయ్యక తప్పదని మౌనంగా ఉండిపోయినా, వాణిశ్రీ అలా ఉండలేక.. నిర్మాత, దర్శకుడు, డాన్స్ మాస్టర్లకు తన ఇబ్బంది చెప్పి మూమెంట్స్ మార్చమని కోరిందట… వాళ్ళు వినక పోయేసరికి పెద్దాయన ఎన్టీఆర్ చెబితే వింటారేమోనని అన్న గారిని ఆమే నేరుగా అడిగినా.., ఆయన తనకూ బాధగా ఇబ్బందిగానే ఉందని, కానీ, ఏం చేస్తాం మనం నటీనటులం.. బొమ్మలం.. వారు కోరినట్టు నటించక తప్పదు.. మనం కాకుంటే వేరే వారు చేస్తారు. మనకు చెడ్డ పేరు. ఈసారికి ఓర్చుకోండి. తర్వాత చూసుకుందాం అన్నారట.. చేసేది లేక ఆమె ఇబ్బందిగానే పూర్తి చేసిందట…సెన్సార్ లో అయినా కట్ అవుతుందన్న ఆశతో.. కానీ ఆశ్చర్యమేమంటే ఒక్క కట్ కూడా లేకుండా ఆ పాటలు తీసింది తీసినట్టుగా సెన్సార్ వోకే అనేసింది.. రాబోయే రోజులు ఇంకెంత గడ్డుగా ఉండబోతున్నాయో అర్థం చేసుకున్న వాణిశ్రీ ఇక నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతూ, గ్యాప్ తీసుకుని తర్వాత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా, ప్రాణానికి ప్రాణం ద్వారా కారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది….. పోస్టు కామెంట్లలో వసుధా బి రావు వివరణ ఇదీ…) (నమక్ హలాల్ పాటలతో ఠారెత్తిపోయి కన్నీళ్లు పెట్టుకున్న స్మితా పాటిల్‌కు కూడా అమితాబ్ బచ్చన్ ఇలాంటి కర్తవ్య బోధే చేశాడు)
ఇది వైజయంతి మూవీస్ తొలి సినిమా… ఆ బ్యానర్‌లోనే ఎన్టీయార్ శ్రీకృష్ణుడి వేషంలో ఉంటాడు… దానికీ ఓ కథ ఉందట… అప్పట్లో అశ్వినీ దత్ ఓ సీత కథ అని ఓ సినిమా నిర్మాణంలో డబ్బు పెట్టాడట… విశ్వనాథ్ దర్శకుడు… ఐతే నిర్మాతలు ఆ లాభాన్ని సరిగ్గా పంచలేదు, దాంతో విజయవాడ మారుతి థియేటర్ వాళ్ల ద్వారా ఎన్టీయార్‌ను అప్రోచయ్యాడట దత్తుడు… ప్రాబ్లం సాల్వయింది…
అసలు తనే నిర్మాతగా ఎందుకు సినిమా తీయకూడదు అనుకుని, శోభన్ బాబుతో ఓ కథ ప్లాన్ చేసుకుంటే, దత్ తండ్రి ధర్మరాజు, వద్దురా బాబూ, ఎన్టీయార్‌తోనే తియ్యాలి, వాల్యూ ఎక్కువ అని చెప్పాడట… దాంతో ఈయన అమాంతం ఎన్టీయార్ దగ్గరకు వెళ్లి ‘కాల్ షీట్లు కావాలి బాబు గారూ’ అనడిగాడట…
కాల్ షీట్లు అంటే తెలియకుండా అడుగుతున్నాడేమో అనుకుని ఎన్టీయార్ దత్ తనను ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడేమో అనుకున్నాడట… నో, అన్నగారూ, కాల్ షీట్లే కావాలి అనడిగి, డేట్స్ తీసుకుని ఈ సినిమా తీశాడట అశ్వినీ దత్తుడు… తరువాత ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు… ఆయన కూతుళ్లు కూడా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు… 1100 కోట్ల కల్కి సినిమా వాళ్లదే…!!
Share this Article