Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరూ డబుల్ రోల్ అంటారు గానీ… నిజానికి వాణిశ్రీ ట్రిపుల్ రోల్ ..!!

August 6, 2024 by M S R

చూసారా ! తప్పకుండా చూసే ఉంటారు . చూసినా చూడొచ్చు . ఎన్ని సార్లయినా చూడొచ్చు . అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ . వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి . అందరూ ఆమె ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను .

పల్లెటూరి అల్లరి చిన్నదిగా – చాదస్తపు గృహిణిగా నటించింది ఒక పాత్ర . తోడికోడలు కొడుకు చనిపోయాక పిచ్చిదానిగా నటించింది ఒక పాత్ర . కూతురుగా ఒక పాత్ర . అంత వైవిధ్యాన్ని ప్రస్ఫుటంగా చూపింది .

తన బిడ్డను తల్లికి ఇచ్చేందుకు నిర్ణయించుకుని , రావణుడిగా పులిగా తన తల్లిగా నటించి తన బిడ్డని నమ్మించే క్రమంలో వాణిశ్రీ నటనను ప్రత్యేకంగా అభినందించాలి . సినిమాలో అన్ని పాటలూ ఆమె చుట్టూనే ఉంటాయి . ఒక్కొక్క పాటలో ఒక్కొక్క తరహా నటనను ప్రదర్శించింది .

Ads

తర్వాత మెచ్చుకోవలసింది శోభన్ బాబునే . యువకుడిగా , ముసలి భర్తగా చాలా బాగా నటించారు . సత్యనారాయణ , శుభల నటన కూడా బాగుంటుంది . ముఖ్యంగా సత్యనారాయణ నటన . ఆ తర్వాత చెప్పుకోవలసింది రాజబాబు- రమాప్రభ జోడీ . వీరిద్దరిలో రాజబాబు బాగా నటించారు . ఇతర పాత్రల్లో బేబీ వరలక్ష్మి , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ , ముక్కామల అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు .

కె విశ్వనాథ్ కెరీర్లో ఒక కళాఖండం ఈ జీవనజ్యోతి సినిమా . ప్రముఖ రచయిత కె రామలక్ష్మి మూలకధకు సినిమానుగుణంగా కూర్పులు మార్పులు చేసుకుని , బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారుచేసుకోవటమే ఈ సినిమా విజయానికి ఒక కారణం . ప్రకృతి అందాలకు చిరునామా అయిన గోదావరి గ్రామాలను ఎంచుకుని , అద్భుతమైన దర్శకత్వాన్ని అందించారు .

కాబట్టే అవార్డుల , రివార్డుల , చప్పట్ల , డబ్బుల వర్షం కురిసింది . 12 సెంటర్లలో వంద రోజులు ఆడింది . ఉత్తమ చిత్రంగా చిత్రానికి , ఉత్తమ నటుడిగా శోభన్ బాబుకి నంది అవార్డులు వచ్చాయి . అలాగే ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకత్వం , ఉత్తమ నటుడు , ఉత్తమ నటి ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి . సంజోగ్ అనే టైటిల్ తో హిందీ లోకి రీమేక్ అయింది . విశ్వనాధే డైరెక్ట్ చేసారు . జయప్రద , జితేంద్రలు నటించారు . బలినజ్యోతి అనే టైటిల్ తో కన్నడంలో ఆమని హీరోయిన్ గా రీమేక్ అయింది . అక్కడా హిట్టయింది .

ఇంక ఎంత సేపయినా చెప్పుకున్నా తనివి తీరనిది కె వి మహదేవన్ సంగీతం . చిన్నివో చిన్నీ సన్నజాజుల చిన్నీ , ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు , ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో , ఎందుకంటే ఏం చెప్పను , ఎవరనుకున్నావురా పాటలు సూపర్ హిట్టయ్యాయి . ముఖ్యంగా ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు , చిన్నివో చిన్నీ పాటలు ఎంత శ్రావ్యంగా ఉంటాయో !

అప్పటికి ఏడు సినిమాలు NTR హీరోగా తీసిన డి వి యస్ ప్రొడక్షన్స్ రాజు గారు ఈ సినిమాకు నిర్మాత . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఓ మూడు నాలుగు సార్లు చూసి ఉంటానేమో ! అంత ఇష్టమైన సినిమా నాకు . ఈ సినిమాతో నాకు మరో గుర్తు కూడా ఉంది . ఈ సినిమాలో శోభన్ బాబు వైట్ టై చూసి నేనూ వైట్ టై కుట్టించుకున్నాను . ఇటిక రాయి రంగు పేంట్ వేస్తాడు శోభన్ . అలాంటి రంగు పేంటే కుట్టించుకున్నా . మా ఫ్రెండ్స్ వైట్ టై , ఇటిక రాయి రంగు పేంటు చూసి గోల చేసేవారు . ఎవడి పిచ్చి వాడికి ఆనందం .

సినిమా యూట్యూబులో ఉంది . ఈతరంలో చూడనివారు ఉంటే అర్జెంటుగా చూసేయండి . చూసినోళ్ళు మళ్ళీ మళ్ళీ చూసేయండి . అంత గొప్ప దృశ్య , సంగీత కావ్యం ఈ సినిమా . షడ్రసోపేత భోజన సమానం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……   [ దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా చానెల్ పై BRS దాడి, విధ్వంసం ఖండనీయం..!
  • ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…
  • ఆ స్నైపర్ ‘వాలి’ మరణించాడా..? ‘వైట్ డెత్’ గురించి తెలుసా మీకు..?
  • మర్రిచెట్టు అరెస్ట్… 120 ఏళ్లుగా బేడీలతోనే… ఇలాగే ఓ బెంచీ కథ కూడా…
  • దర్శకుడికి స్వేచ్ఛ- నో కాంప్రమైజ్… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
  • NTR కొడుకుతో ANR … అదొక్కటే దీని విశేషం..!
  • ఫక్తు రొటీన్ మూస కథతో భానుప్రియ డబుల్ యాక్షన్
  • ఓ రబ్బరు బొమ్మ… ఏ లగ్జరీ బంకర్‌లో దాగున్నదో… ఎక్కడుందో… పెద్ద మిస్టరీ..!!
  • పోరాటశీల జర్నలిస్టు స్వేచ్ఛ వెళ్ళిపోయింది..!
  • ప్రభాస్ పాత్ర, క్లైమాక్స్… కన్నప్పను బలంగా నిలబెట్టాయి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions