.
మన దేశంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి… ఇక్కడి దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలతో వేధింపులకు భయపడి… ఈ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి కొందరు విదేశాలకు పారిపోతారు… చాలా ఉదాహరణలున్నయ్…
అలాంటి వాళ్లను తిరిగి దేశానికి తీసుకురావడానికి బోలెడు అడ్డంకులుంటయ్… ఏదో ఓ చిన్న దేశం నుంచి పాస్‌పోర్టు తీసుకుని, అక్కడి పౌరసత్వం పొందాక వాళ్లను తిరిగి తీసుకురావడం కష్టం… అంతెందుకు..? వెళ్లి అమెరికాలో దాక్కున్న ఫోన్ ట్యాపింగు పెద్ద తలకాయను ఈరోజుకూ తెలంగాణ తీసుకురాలేకపోయింది…
Ads
నిత్యానందుడితోసహా ఏదో ఓ చిన్నదేశాన్ని వెతుక్కుంటారు… లేదా తామే ఓ దీవి కొనేసి, సపరేట్ దేశాన్నే ప్రకటించుకుంటారు… డబ్బుతోనే సాధ్యం అంతా… అలా వెళ్లి, వనువాటు అనే ఓ ద్వీపదేశం పౌరసత్వాన్ని పొంది, కొనుక్కుని అనాలేమో… రక్షణ పొందుతున్న ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీకి ఇప్పుడు చుక్కెదురైంది…
ఆ దేశం తాజాగా తన పాస్‌పోర్టును రద్దు చేసింది… పరారీలో ఉన్నవారికి మేం పౌరసత్వం సమంజసం కాదని తాజాగా ఆ దేశ ప్రధాని జోథమ్ నపాట్ అంటున్నాడు… అబ్బే, ఆ నైతిక విలువల మాటల వెనుక ఓ కారణం ఉంది… ఇన్నాళ్లూ ఆ పౌరసత్వం మీదే కదా లలిత్ మోడీ ఉంటున్నాడు… ఇప్పుడే ఈ కళ్లు తెరుచుకోవడం ఏమిటి..? అంతర్జాతీయ మీడియా ఇటీవల వెలుగులోకి తెచ్చింది ఈ పౌరసత్వాలు తీసుకుని, అక్రమార్కులు రక్షణ పొందుతున్నారని…!
వనువాటు ఎక్కడ ఉంది?
వనువాటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప రాజ్యం… ఇది ఉత్తర ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల దూరంలో ఉంది… సోలమన్ దీవులకు ఆగ్నేయంగా, న్యూకాలెడోనియాకు ఈశాన్యంగా, ఫిజీకి పడమరగా ఉంటుంది… ఫిజీలో మన ఇండియన్ రూట్స్ ఉన్న జనాభా ఎక్కువ…
ఈ ద్వీపసమూహంలో మొత్తం 83 దీవులు… అవన్నీ “Y” ఆకారంలో ఉంటాయి… వనువాటు రాజధాని పోర్ట్ విలా ఎఫేట్ ద్వీపంపై ఉంది…
ఒకప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త పరిపాలనలో ఉండిన వనువాటు 1980లో స్వతంత్రత సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటకం, వ్యవసాయం, ఆఫ్‌షోర్ ఫైనాన్షియల్ సర్వీసులపై ఆధారపడి ఉంది…
వనువాటు ఒక ట్యాక్స్ హేవన్ (పన్ను స్వర్గమా)?
అవును, వనువాటు ట్యాక్స్ హేవన్‌గా పరిగణించబడుతుంది. ఈ దేశంలో ఆదాయపు పన్ను, మూలధన లాభాల పన్ను, వారసత్వ పన్ను, కరెన్సీ మార్పు నియంత్రణలు లేవు… దీని వల్ల విదేశీ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది…
ఈ కారణంగా వనువాటు అంతర్జాతీయ ఆర్థిక నియంత్రణ సంస్థల నుండి నిరంతరం పర్యవేక్షణలో ఉంటోంది…
వనువాటు – ఆర్థిక వివాదాల చరిత్ర
వనువాటులో ఆర్థిక అక్రమాల ఆరోపణలు కొత్తవి కావు. 2001లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ భారత వ్యాపారి అమరేంద్ర నాథ్ ఘోష్‌కు అనుమతుల్లేకుండా 23- 100 మిలియన్ డాలర్ల మధ్య అనుచిత ఆర్థిక హామీలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి… దీనితో ఆయనను పదవి నుంచి తొలగించారు…
అలాగే, వనువాటు యొక్క ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ వ్యవస్థ పలు వివాదాల్లో చిక్కుకుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వనువాటును “గ్రే లిస్ట్”లో ఉంచింది. 2017లో “పారడైజ్ పేపర్స్” లీక్ కారణంగా వనువాటు ఆర్థిక వ్యవస్థపై మరింతగా అంతర్జాతీయ సమాజం దృష్టి పడింది…
వనువాటు – ఆర్థిక పారదర్శకతపై స్పందన
ఈ ఆరోపణల నేపథ్యంలో, వనువాటు తన ఆర్థిక నియమాలను మార్చింది. అనేక అంతర్జాతీయ బ్యాంకులు మూసివేయబడ్డాయి. అయినప్పటికీ, వనువాటు ఇంకా “ట్యాక్స్ హేవన్” అనే పేరును పోగొట్టుకోలేకపోయింది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత OECD కింద 83 దేశాలు కొత్త పన్ను నియమాలను అంగీకరించాయి. అయితే, వనువాటు ఇంకా పూర్తిగా అమలు చేయాల్సిన దేశాల జాబితాలో ఉంది…
Share this Article