ఈ రాంగోపాలవర్మ అనబడే దర్శకుడు గతంలో కాస్త చెప్పుకోదగిన సినిమాలు తీసి ఉన్నప్పటికినీ… తరువాత కాలంలో తనకుతానే భ్రష్టుపట్టిపోయి… జనం చీదరించుకుని… చివరకు ఆడవాళ్ల తొడలకే అంకితమైన తీరు… లేదా ఏవో దరిద్రపు వివాదాస్పద కథల్ని హడావుడిగా చుట్టేసి జనం మీదకు వదిలిన తీరు అందరికీ విదితమే… అసలు వర్మ అంటేనే ప్రస్తుతం టాలీవుడ్‌కు పట్టిన ఓ దెయ్యం… అది మంచి దెయ్యమా..? చెడ్డ దెయ్యమా అనే మీమాంస, చర్చ, మథనం ఇక్కడ అప్రస్తుతం కావు… ఎందుకనగా… మళ్లీ ఒక దెయ్యం సినిమాను జనం మీదకు వదిలాడు… సినిమా పేరు కూడా దెయ్యమే… కాకపోతే ‘వర్మ దెయ్యం’… అంటే వర్మ వదిలిన దెయ్యం అని కాదేమో… బహుశే వర్మే దెయ్యమని అర్థం చేసుకోవాలేమో… కానీ అచ్చుగుద్దినట్టు సరిపోయెను… వాస్తవానికి ఇది అప్పుడెప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం ప్రారంభించబడిన చిత్రమట… అప్పట్లో పట్టపగలు అని పేరు పెట్టినారట… కానీ ఎందువల్లనో ఆ సినిమా ఆగిపోయి… ఇప్పుడిక వర్మ సీసా మూత తీసి దెయ్యాన్ని లోకం మీదకు వదిలెను… జనం ఖర్మ… కరోనాకు మాస్క్ వలె… దీనికీ విరుగుడు స్వీయనియంత్రణ, ముందుజాగ్రత్తలే… అనగా ఆ థియేటర్ల వైపు వెళ్లకపోవడమే…
చివరకు వర్మ ఎంత భ్రష్టుపట్టెను అనగా… తను ఎంతటి దరిద్రగొట్టు సినిమాల్ని తీసినా సరే… పాత్రలకు తగిన నటుల ఎంపికలో మంచి ప్రతిభను కనబరిచేవాడు… టెక్నికల్ వాల్యూస్ విషయంలో క్రియేటివిటీ కనిపించేది… ప్రత్యేకించి కెమెరా యాంగిల్స్, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగు మున్నగు అంశాల్లో స్టాండర్డ్స్ కనిపించేవి… చివరకు ఈ సినిమా చూస్తే, ఆ విషయాల్లో కూడా వర్మ నేలబారు ప్రమాణాలకు దిగిపోయాడు అని మనకు అవగతమవును… మరీ ఎంత దరిద్రమనగా… ఒకే వాయిస్ ఓవర్ ఆర్టిస్టుతో వేర్వేరు పాత్రలకు డబ్బింగ్ చెప్పించినట్టుగా మనకు తోచును… మిగతా విషయాలూ అలాగే సినిమా చూస్తున్నంతసేపూ కొరడా పట్టుకుని చెళ్లుచెళ్లుమని మనల్ని బాదుతూనే ఉండును…
Ads
ఎవరో పిల్ల… ఏదో దెయ్యం వచ్చి ఆవహించడం… నేరాలు చేయడం…. ప్రపంచ సినిమా ఈ కథతో కొన్ని వందల సినిమాలు తీసి ఉంటుంది కదా… జాబితాలో మరొకటి… వర్మ ఏదో హారర్ సినిమాను చూసి ఉంటాడు… ఇంకేముంది..? అలాంటి సీన్లను చకచకా రాయించి, ఈ సినిమా తీయించి ఉండును… ఫాఫం, రాజశేఖర్ అనబడు హీరో అడ్డంగా బుక్కయిపోయాడు… (ఈ సినిమా విడుదలకు జీవిత ఎలా అంగీకరించెను…) స్వాతి దీక్షిత్ దగ్గర నటనా ప్రతిభ ఉన్ననూ ఫలితమేమి..? దెయ్యం కాచిన వెన్నెల అయిపోయినది… ఒక్క ముక్కలో చెప్పాలంటే… నేటి దినమున బోలెడు మంది పిల్లలు ఇంతకుమించి మంచి ప్రమాణాలతో షార్ట్ ఫిలిమ్స్ తీయుచుండిరి… అసలే కరోనా పీడదినాలు… ఇది దాన్ని మించిన ఇన్ఫెక్షన్… కనుక ప్రజలు రిస్క్ తీసుకొనుట పాడి కాదు… జెర పైలం… ఇంతకుమించిన స్పేస్ కూడా ఈ రివ్యూకు అనవసరం… వర్మ గారూ… తమరు సినిమాలు తీయడం ఆపేయడం యావత్ ప్రజానీకానికీ శ్రేయస్కరం… లేదా ప్రభుత్వాలే పూనుకుని నిషేధం విధిస్తే ఒకింత మేలు…!!
Share this Article