ఈమె పేరే కే వాసుకి… కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… పినరై విజయన్ ప్రభుత్వం తాజాగా ఈమెకు విదేశాంగ బాధ్యతలు అప్పగించింది… ప్రస్తుతం ఉన్న స్కిల్, లేబర్ విభాగాల కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న ఆమెకు విదేశాంగ కార్యదర్శిగా ఈ అదనపు బాధ్యత అప్పగించారు…
ప్రతిపక్షం అంటే ఆలోచనరహితంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అన్నట్టుగా ఉంది కదా వర్తమాన రాజకీయం… కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా… ఇంకేముంది..? కేరళ బీజేపీ లెఫ్ట్ నిర్ణయంపై మండిపడింది…
‘‘ అసలు ఈ సీఎంకు రాష్ట్రాలు- కేంద్రాల అధికారాల గురించి తెలుసా..? విదేశాంగం కేంద్రం అధికార పరిధి, బాధ్యత… ఓ ఐఏఎస్‌ను విదేశాంగ బాధ్యతల్లో నియమించడం ఏమిటి..? అంటే కేరళను ఓ ప్రత్యేక దేశం చేయాలనుకుంటున్నారా..? ఇది రాజ్యంగ ఉల్లంఘన…’’ అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కే సురేంద్రన్ విరుచుకుపడ్డాడు…
Ads
శశిధరూర్ తన అయోమయం భాషలాగే అటూఇటూ ఏదీ అర్థం గాకుండా ఏదో స్పందించాడు… నిజానికి ఇక్కడ కేరళ ప్రభుత్వాన్ని నిందించాల్సిన పనేమీ లేదు… పైగా ఓ పాజిటివ్ చర్య…
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లోనే డిల్లీలోని కేరళ రెసిడెంట్ కమిషనర్ సహకారంతో, కేంద్ర విదేశాంగ శాఖతో, వివిధ దేశాల ఎంబసీలతో కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత అని స్పష్టంగా చెప్పారు… ఇక ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏముంది..? అనవసర విమర్శలు తప్ప..!
అవసరం… దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భారీ సంఖ్యలో కేరళ నుంచి బయటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు… గల్ఫ్ దేశాల్లో మరీ అధికం… ఆయా దేశాల చట్టాలు, స్థానిక దళార్ల మోసాలతో అనేకమంది బాధితులు… ఆయా దేశాలకు వెళ్లాక అక్కడి ఎంప్లాయర్స్ చేసే మోసాలు, వేధింపులు దారుణంగానే ఉంటాయి పలుసార్లు…
రీసెంటుగా విడుదలైన మలయాళ చిత్రం ఆడు జీవితం (ది గోట్ లైఫ్) ఆ వెతలకే దృశ్యరూపం… చివరకు అక్కడ జైళ్ల పాలయితే సహకారం దొరకదు, ఏళ్ల తరబడీ జైళ్లలోనే మగ్గుతుంటారు, మరణిస్తే శవాలు స్వదేశం చేరడానికీ ప్రయాసే…
ఈ స్థితిలో ప్రభుత్వం తరఫున అత్యున్నత స్థాయిలో వివిధ ఎంబసీలు, విదేశాంగ శాఖలతో కోఆర్డినేట్ చేయడానికి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణిని నియమించడం ఆహ్వానించదగిన చర్యే అవుతుంది… ఎక్కువ సంఖ్యలో గల్ఫ్‌లో కార్మికులు పనిచేసే తెలంగాణ కూడా ఈ దిశలో ఓ సానుకూల, సరైన నిర్ణయం తీసుకోవాలి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆవైపు అడుగులు వేయాలి..! ఇక్కడ బండి సంజయ్ ఏదో అంటాడని అనుకోవాల్సిన అవసరం లేదు..!!
Share this Article