.
ఏదో ఒక సంఘటన… మంచో చెడో… హఠాత్తుగా మనిషిలో అనుకోని మార్పుకు శ్రీకారం చుడుతుంది… అప్పటి జీవితానికి పూర్తి విరుద్ధ మార్గంలోకీ నడిపిస్తుంది… ఆస్తికుడు నాస్తికుడు కావచ్చు, వైభోగి అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించవచ్చు… విలన్ హీరో కావచ్చు… ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు…
వేల మంది సైనికుల మరణం తరువాత అశోకుడిలో మార్పు వచ్చినట్టు… సగటు మనుషుల కష్టాలు చూసిన బుద్ధుడు అలౌకిక జ్ఞానాన్వేషణలోకి వెళ్లినట్టు… ఏదో ఓ ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది జీవితంలో… అది మార్చేస్తుంది తనను…
Ads
అనిల్ అగర్వాల్… గనుల తవ్వకంలో ఘనాపాటీ తను… వేదాంత గ్రూప్ చైర్మన్… వేల కోట్ల ఆస్తులు… ఎప్పుడూ ‘సమాజానికి తిరిగి ఇచ్చే వితరణశీల ధనికుల ( Philanthropists ) జాబితాలో ఆయన పేరు కనిపించేది కాదు… అలాంటిది ఆయన ఒకేసారి 25 వేల కోట్ల రూపాయలను పేద పిల్లల విద్య కోసం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు… ఏమిటి ఈ హఠాత్ మార్పుకు కారణం..?
అదే మనం చెప్పుెకునేది… ఓ వేదన నుంచి పుట్టిన వేదాంతం… ఓ వైరాగ్యం నుంచి పుట్టిన ఔదార్యం… మైనింగ్ వ్యాపార ప్రపంచంలో ఆయనొక గనుల రారాజు… వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి… కానీ, విధి ఆయన్ని ఒక తీరని విషాదంలోకి నెట్టింది… కోట్లు ఉన్నా.. కొండంత ఆస్తి ఉన్నా.. కన్న కొడుకును కాపాడుకోలేకపోయాడు… ఆ తండ్రి గుండె పగిలిన వేదనలోంచి ఒక గొప్ప ‘వేదాంతం’ పుట్టుకొచ్చింది…

‘అగ్ని’ ఆరిపోయింది.. అక్షర దీపం వెలిగింది
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49) మరణం వ్యాపార ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది… 2026 జనవరిలో అమెరికాలో జరిగిన ఒక ప్రమాదం ఆయన ప్రాణాలను బలితీసుకుంది… మంచు కొండల్లో స్కీయింగ్ (Skiing) చేస్తున్న సమయంలో అగ్నివేశ్ తీవ్రంగా గాయపడ్డాడు…
న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో… అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటు (Cardiac Arrest) ఆయన్ని కన్నవారికి కాకుండా చేసింది…
“నా జీవితంలో ఇది అత్యంత చీకటి రోజు… నా కొడుకు అగ్ని మమ్మల్ని ఇంత త్వరగా విడిచి వెళ్ళిపోతాడని ఊహించలేదు… ఒక తండ్రి తన బిడ్డకు వీడ్కోలు చెప్పడం కంటే మించిన నరకం మరొకటి ఉండదు…” అని అనిల్ అగర్వాల్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న మాటలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి…
తన బిడ్డ జ్ఞాపకార్థం.. లక్షలాది బిడ్డల కోసం!
వారసుడిగా, స్నేహితుడిగా అండగా నిలిచిన కొడుకు దూరం కావడంతో ఆ తండ్రిలో వైరాగ్యం పుట్టుకొచ్చింది… తన ఆస్తిలో ఏకంగా 25 వేల కోట్ల రూపాయలను (దాదాపు 75 శాతం సంపాదన) పేద పిల్లల విద్య కోసం, ఆకలి తీర్చడం కోసం ధారపోస్తున్నట్లు ఆయన ప్రకటించారు…
-
అగ్నివేశ్ ప్రస్థానం..: 49 ఏళ్ల వయసుకే అగ్నివేశ్ ‘హిందుస్థాన్ జింక్’ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించాడు… తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు…
-
వైరాగ్యం నుంచి ఔదార్యం…: “మనం సంపాదించింది సమాజం ఇచ్చిందే… దాన్ని తిరిగి సమాజానికే ఇవ్వడం కనీస ధర్మం” అనే ఆలోచన పుట్టుకొచ్చి ఈ భారీ విరాళం ప్రకటించాడు తండ్రి…
-
భవిష్యత్ లక్ష్యం…: దేశవ్యాప్తంగా నిరుపేద విద్యార్థులకు అక్షర జ్ఞానాన్ని అందించి, ప్రతి పేద బిడ్డలోనూ తన కొడుకును చూసుకోవాలన్నదే ఆయన సంకల్పం….
సమాజానికి తిరిగి ఇవ్వడం (Giving Back)
లాభాల వేటలో పరుగెత్తే కార్పొరేట్ లోకానికి అనిల్ అగర్వాల్ ఒక గొప్ప పాఠం నేర్పాడు… సంపద శాశ్వతం కాదని, మనం వదిలివెళ్లే జ్ఞాపకాలు, మనం చేసిన సాయం మాత్రమే చిరకాలం నిలుస్తాయని ఆయనకు గుర్తొచ్చింది… కుమారుడి అకాల మరణం మిగిల్చిన శోకాన్ని, లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును వెలిగించే స్ఫూర్తిగా మలచుకున్నాడు…
ఆ తండ్రి ఆవేదన అక్షరమై.. రేపటి తరాన్ని నడిపించే స్ఫూర్తిదాయక శక్తిగా మారుతోంది... శుభం...
Share this Article