పాయింట్ ఫైవ్ కాదు… 10 పర్సెంట్… కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. 2018 ఎన్నికల్లో అక్కడ రెండో స్థానంలో నిలిచిందిన జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతానని వనమా వెంకేటేశ్వర్ రావు చెప్పారు. పదవీకాలం ఇంకో మూడున్నర నెలలు ఉన్నది. ఈ కాలం అక్కడ ఎవరు ఎమ్మెల్యే అనేది కోర్టు నిర్ణయించనున్నది.
ఇప్పటికైతే హైకోర్టు తీర్పు అంతిమం. ఈ తీర్పుతో తెలంగాణ శాసనసభలో లెక్కలు ఛేంజ్ అయినయి. తెలంగాణ శాసనసభలో 119 స్థానాలు, ఒక అంగ్లో ఇండియన్‌తో కలిపి మొత్తం 120 మంది సభ్యులు ఉంటారు. కొత్తగూడెంలో జలగం వెంకటరావు ఎమ్మెల్యేగా ఉంటారని కోర్టు చెప్పడంతో ఇప్పుడు తెలంగాణ శాసనసభలో వెలమ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 12 అయ్యింది. తెలంగాణ శాసనసభలో ఇప్పుడు వెలమ వర్గం ఎమ్మెల్యేలు సరిగ్గా 10 శాతానికి పెరిగారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (గజ్వేల్), మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), తన్నీరు హరీష్‌రావు (సిద్ధిపేట), ఎరబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి)లతోపాటు నడిపెల్లి దివాక్‌రావు (మంచిర్యాల), మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్‌గిరి), మాధవరం కృష్ణా రావు (కూకట్‌పల్లి), కల్వకుంట విద్యాసాగర్‌రావు (కోరుట్ల), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), మాకునూరు సంజయ్‌కుమార్ (జగిత్యాల), మాధవనేని రఘునందన్‌రావు (దుబ్బాక) ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో వెలమ వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
Ads
హైకోర్టు తీర్పుతో జలగం వెంకటరావు (కొత్తగూడెం) కొత్తగా ఈ జాబితాలో చేరారు. రఘునందన్‌రావు (బీజేపీ) మినహా 11 మంది టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారే కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా ఉన్నది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సరిగ్గా 12 మంది వెలమలకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), జలగం వెంకటరావు (కొత్తగూడెం)లో ఓడిపోయారు. హైకోర్టు తీర్పుతో వెంకటరావు ఎమ్మెల్యే అయ్యారు…
సామాజిక న్యాయం, జనాభా దామాషా మాట ఏదైనా పార్లమెంటు, అసెంబ్లీలలో ప్లేస్ దక్కితేనే ఇవన్నీ నెరవేరినట్లు. చట్టసభల్లోని తమ వాళ్ల లెక్కలు చూసుకునే ఆయా వర్గాలు నిమ్మలపడతాయి. ప్రజాస్వామ్యంలో తాము భాగమైనట్లు భావిస్తాయి. ఎన్నికలప్పుడు మతం, కులం లెక్కలు టాపిక్ అవుతాయి. ఇంత మంది ఉన్నం, ఇన్ని టిక్కెట్లు ఇయ్యాలె అని కుల సంఘాల నేతలు వార్నింగులు ఇస్తుంటారు. కర్ణాటకతోపాటు కొన్ని రాష్ట్రాల్లో మత గురువులు ఆదేశిస్తరు.
75 ఏండ్ల కిందటి స్వతంత్ర భారతంలో రిజర్వుడు సీట్లు మినహా 90 శాతం వరకు అగ్రవర్ణాల వారే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండేవారు. కులాలు, పైసల ప్రభావం పెరుగుతున్న కొద్ది చట్టసభల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల రిజల్టులో సామాజిక రూపు మారుతున్నది. రాజకీయ అధికార పోరాటంలో మెజారిటీగా ఉన్న వర్గాలు తమ లెక్కను గట్టిగా చెప్పుకుంటాయి. అందరం కలిసి ఉండాలని ఆ వర్గం నాయకుడు అంటాడు. ఒకవేళ తక్కువ సంఖ్యలో ఉన్న వర్గం వారు అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీగా ఉన్న వర్గం నాయకుడు తమ లెక్కను ఇంకా గట్టిగా చెబుతాడు.
ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్లో చేరక ముందు నుంచీ పాయింట్ ఫైవ్ (0.5) శాతం ఉన్న వెలమ వర్గం తెలంగాణలో అధికారం ఉండడం కరెక్టు కాదని చెబుతుంటాడు. పాయింట్ ఫైవ్ అనే లెక్కల ప్రామాణికత ఎలా ఉన్నా జనాభా, చట్టసభలు వంటి గొట్టు అంశాలపై చర్చ జరిగినప్పుడల్లా ఇదీ ఒక టాపిక్ గా ఉంటున్నది. వెలమ వర్గం జనాభా ఎంతన్నది పక్కనబెడితే అసెంబ్లీలో వీరికి 10 శాతం ప్రాతినిథ్యం ఉండేలా ప్రజల తీర్పు చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కులాల ఆధిపత్యంపై చర్చ బాగా జరిగేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని అధికారం నుంచి దూరం చేసేందుకే తెలంగాణ ఉద్యమంలో వెలమలు, సమైక్యాంధ్ర అని సీమాంధ్రలో కమ్మలు క్రియాశీలంగా ఉంటున్నారని కొందరు గట్టిగా చెప్పేవారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో(2014) ఫలితాల లెక్కలను గుర్తు చేస్తూ… తాము చెప్పిందే రాష్ట్ర విభజన తర్వాత జరిగిందని అనేవారు.
తెలంగాణలో కేసీఆర్ (వెలమ), ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు (కమ్మ) ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో వెల్కమ్ (వెలమ ప్లస్ కమ్మ) బ్రాండ్ వాదన మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బలపడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఆరుగురు కమ్మలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది.
తుమ్మల నాగేశ్వర్‌రావు (పాలేరు) ఓడిపోయారు. పువ్వాడ అజయ్ (ఖమ్మం), కోనేరు కోనప్ప (సిర్పూరు), నలమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాగంటి గోపినాథ్ (బంజరాహిల్స్) గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్మలలో ఒక్కరికీ టిక్కెట్ ఇవ్వలేదు. రాజకీయం అంటేనే మతాలు, కులాలు. గులాబీ బాసుకు ఈ లెక్కలు అందరికంటే బాగా తెలుసు. గత ఎన్నికల్లో ఆ లెక్కలు పని చేశాయి. వచ్చే ఎన్నికల్లో ఏ లెక్కలు కుదురుతాయో మరి! … – ప్రహ్లాద్ (హలో జీవన్ రెడ్డి గారూ… ఓసీలు టెన్ పర్సెంట్ కాదు, జస్ట్ వెలమలే టెన్ పర్సెంట్…)
Share this Article