.
ఇలా ఓ ఇద్దరు పోలీసులు వెళ్లి, ఎవరో ఓ చిన్న నేరగాడిని పట్టుకుని, పోలీస్ వాహనంలో తీసుకునిపోయినట్టు… అంత అలవోక ఆపరేషన్ అన్నట్టుగా… అమెరికా బలగాలు ఏకంగా ఓ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను అరగంటలో అరెస్టు చేసి తీసుకుపోయాయి…
ఆయన పేరు మదురో, భార్య పేరు సిలియా… ఇక న్యూయార్క్‌లో వాళ్లను విచారిస్తుందట ఈ ప్రపంచ పోలీసు..! ఆదుకుంటాయి అనుకున్న చైనా, రష్యాలు సైలెంటుగా ఉండేసరికి షాక్‌లో మునిగిపోయింది మదురో సర్కారు…
Ads
హ్యూగో చావెజ్ బతికి ఉన్నంతకాలం వెనిజులాను ఏమి చేయలేకపోయిన అమెరికా ఇప్పుడు అదును చూసి వెనెజులాను తన ఆధీనంలోకి తీసుకున్నట్టే ఇక… ఓ బస్సు డ్రైవర్ నుంచి ఓ దేశాధ్యక్షుడిగా ఎదిగిన మదురో ప్రస్థానం ముగిసినట్టే…
ప్రపంచంలో అత్యంత ఎక్కువ చమరు ఉంది వెనెజులాలో… చమురు అంటే ఎనర్జీ, ఆ ఎనర్జీ కోసమే సాగుతున్న జియో పాలిటిక్స్… ఎవడికి బడితె బలం ఉందో వాడు ఆక్రమించుకుంటున్నాడు… గల్ఫ్ సంక్షోభాలన్నీ ఆ చమురు రాజకీయాలే కదా…

- సరే, ఏకంగా తమ అధ్యక్షుడిని అమెరికా లిఫ్ట్ చేసిందీ అనే విషయం మొత్తం ఆపరేషన్ అయ్యాక గానీ తెలియలేదు ఆ దేశ ఆర్మీకి… వెనెజులా వద్ద చైనాకు చెందిన అత్యాధునిక నిఘా వ్యవస్థలు (Surveillance Systems), రష్యాకు చెందిన శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థలు (Air Defense Systems) ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది… అంత సులువుగా ఆపరేషన్ పూర్తి చేసింది…
(ఈ చైనా సరుకు మొన్నటి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌ను ఎలా ముంచేసిందనేది వేరే కథ)… ఈ వెనెజులా ఆపరేషన్ తీరు ఓసారి చెప్పుకుందాం…
ఆపరేషన్ పేరు “ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్” (Operation Absolute Resolve)… దీన్ని నిర్వహించింది డెల్టా ఫోర్స్… గతంలో ఒసామా బిన్ లాడెన్ ఆపరేషన్ వల్ల ‘నేవీ సీల్స్’ పేరు బాగా వినిపించేది… కానీ ఇప్పుడు డెల్టా ఫోర్స్ వార్తల్లోకి వచ్చింది…
దీని అసలు పేరు 1 st Special Forces Operational Detachment-Delta (1st SFOD-D)… ఇది అమెరికా సైన్యంలోని (US Army) అత్యంత రహస్యమైన, శక్తివంతమైన ఎలైట్ యూనిట్… 1970లలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిటన్ కు చెందిన SAS (Special Air Service) స్ఫూర్తితో దీనిని ఏర్పాటు చేశారు…
వ్యత్యాసాలు… సాధారణంగా ఈ రెండు దళాలు అత్యంత ప్రమాదకరమైన మిషన్లను చేపడతాయి, కానీ వీటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి… డెల్టా ఫోర్స్ అమెరికా ఆర్మీకి చెందింది, నేవీ సీల్స్ నేవీకి చెందింది… డెల్టా ఫోర్స్ దాడులు ఎక్కువగా నేల మీద జరిపే మెరుపు దాడులు, హై వేల్యూ టార్గెట్స్‌ను వేటాడుతాయి… నేవీ సీల్స్ ఎక్కువగా సముద్రం, నీటిలో జరిగే ఆపరేషన్లు (మారిటైమ్), కొన్నిసార్లు గ్రౌండ్ అటాక్స్ కూడా…
డెల్టా ఫోర్స్ అత్యంత రహస్య విభాగం… ప్రభుత్వం కూడా దీని ఉనికిని త్వరగా అంగీకరించదు… ఒక “సర్జికల్ స్కేల్పల్” లాగా చాలా సున్నితంగా, నిశ్శబ్దంగా పని పూర్తి చేస్తారు… నేవీ సీల్స్ ఓ “సుత్తి” లాగా భారీ బలగంతో విరుచుకుపడి శత్రువును మట్టుబెడతారు…

వెనెజులా ఆపరేషన్ విశేషాలు…
ఈ మిషన్ కోసం సుమారు 150 యుద్ధ విమానాలు, డ్రోన్లు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ఉపయోగించారు… నగరం మొత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఈ దాడికి ప్లాన్ చేశారు… డెల్టా ఫోర్స్ గతంలో ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌ను పట్టుకోవడంలో, అలాగే 2019లో ISIS చీఫ్ అబు బకర్ అల్-బగ్దాదీని హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది…
చైనా సరుకు ఎక్కడ ఫెయిల్..?
ఈ ఆపరేషన్‌లో కేవలం కమెండోలు మాత్రమే కాదు, US Cyber Command కూడా కీలక పాత్ర పోషించింది… డెల్టా ఫోర్స్ హెలికాప్టర్లు వెనెజులా సరిహద్దుల్లోకి ప్రవేశించే ముందే, అమెరికా హ్యాకర్లు వెనెజులాలోని చైనా నిర్మిత రాడార్ వ్యవస్థలను, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను స్తంభింపజేశారు… దీనివల్ల వారి రాడార్ తెరలపై ఏమీ కనిపించలేదు (Electronic Blackout)…
బ్లాక్ అవుట్ వ్యూహం
రాజధాని కరాకస్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది… చైనా అందించిన నిఘా కెమెరాలు, ముఖ గుర్తింపు (Facial Recognition) సాఫ్ట్‌వేర్లు అన్నీ విద్యుత్ లేకపోవడంతో పని చేయకుండా పోయాయి… చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగే అత్యాధునిక ‘నైట్ విజన్’ పరికరాలు అమెరికా దళాల వద్ద ఉండటం వారికి కలిసొచ్చింది…
స్టీల్త్ టెక్నాలజీ (Stealth Technology)
ఈ మిషన్‌లో ఉపయోగించిన MH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు సాధారణమైనవి కావు… ఇవి రాడార్లకు చిక్కకుండా ఉండే ‘స్టీల్త్’ కోటింగ్‌తో ఉంటాయి… చైనాకు చెందిన ‘Buk-M2E’ వంటి రక్షణ వ్యవస్థలు వీటిని పసిగట్టలేకపోయాయి…
నిర్వహణ లోపాలు
మరో ప్రధాన కారణం ఏమిటంటే, వెనెజులా వద్ద ఉన్న రష్యా, చైనా పరికరాలకు సరైన నిర్వహణ (Maintenance) లేదు… ఆర్థిక సంక్షోభం కారణంగా స్పేర్ పార్ట్స్ కొరత ఉండటంతో, చాలా వ్యవస్థలు కేవలం కాగితాల మీద మాత్రమే బలంగా ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో పని చేయలేదు…
ప్రపంచ రాజకీయాల్లో ఇదొక కీలకమైన మలుపు కాబోతోంది… అమెరికాకు చమురు పెత్తనం దక్కబోతోంది… కానీ లాటిన్ అమెరికా దేశాలు ఏకమైతే… అమెరికా, వియత్నాం దేశాల్లో అమెరికా భంగపాటు ఈసారి వెనెజులాలో కూడా దీర్ఘకాలంగా జరగబోతోందా… లేక సింపుల్‌గా దేశం తన గుప్పిట్లోకి వచ్చేసినట్టేనా కాలం చెప్పాలి…
ఏమో… ఇది తైవాన్ విషయంలో చైనాకు సిగ్నల్ అవుతుందేమో… పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) తిరిగి సాధించే భారత వ్యూహాత్మక లక్ష్యానికి ఇదే సరైన టైమింగ్ కూడా కావచ్చునేమో… జియో పాలిటిక్స్ మారుతూ ఉంటాయి… సో, వెనిజులా కథ — ప్రపంచ భవిష్యత్తు కథ…

మారియా కొరినా మచాడో (María Corina Machado)… మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటోంది ఈ ప్రతిపక్ష నేత… ఈమె వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా 2025 నోబెల్ శాంతి బహుమతి వరించింది…
వెనెజులా ప్రతిపక్ష పార్టీ ‘వెంటే వెనెజులా’ (Vente Venezuela) వ్యవస్థాపకురాలు… 2024 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది… మదురో ప్రభుత్వం ఆమెను బంధించడానికి ప్రయత్నించడంతో, ఏడాది కాలంగా ఆమె వెనెజులాలో అజ్ఞాతంలో (Hiding) ఉండి తన పోరాటాన్ని కొనసాగించింది…
మదురో బందీ అయిన వార్త తెలియగానే, ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “స్వేచ్ఛా సమయం వచ్చేసింది” (The hour of liberty has arrived) అని ప్రకటించింది… మదురో పతనం తర్వాత వెనెజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఆమె అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నదని అంటున్నారు… ప్రస్తుతానికి ఇదీ వెనెజులా కథ..!!
Share this Article