ఒక పత్రిక… అందులోనూ కొన్ని దశాబ్దాలుగా తెలుగులో అగ్రపత్రిక… నచ్చనివారిపై విరుచుకుపడే ఉగ్రపత్రిక… పడనివారిపై అక్షరాలా అది దుగ్ధపత్రిక… అది ఈరోజు సింపుల్‌గా భ్రష్టపత్రిక అనిపించుకుంది కూడా… అదే ఈనాడు… జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదట… ఒక ఫుల్ పేజీ వ్యాసం రాసుకొచ్చింది…
ఇది వార్త కాదు, నిలువెల్లా అక్షరవిషం… అలాగని నేనిక్కడ జగన్‌ను సమర్థించడం లేదు… అణగారిన వర్గాల ఆత్మగౌరవ సంకేతంలా కోట్ల మంది ఆరాధించే అంబేడ్కర్‌కు ఓ భారీ విగ్రహం స్థాపిస్తే సహించలేని కుళ్లు తత్వమే కనిపిస్తోందక్కడ… ఇదేం ద్వేషం..? ఇదేం విషం..? ఎస్, రామోజీరావుకు వైఎస్ అంటే పడేది కాదు, వైఎస్ కొడుకు జగన్ అన్నా పడదు… పైగా మొన్నటికిమొన్న రామోజీని ఎత్తుకెళ్లి జైలులో పడేయాలనీ చూశాడు…
ఆ మంట రామోజీరావు కడుపులో రగులుతోంది… పైగా చంద్రబాబు తన దత్త పుత్రుడాయె… చంద్రబాబు శతృవు, తనకూ శతృవేనాయె… ఇంకేముంది..? ముందు నుంచే జగన్ మీద మంట, తను అధికారంలోకి వచ్చాక అది మరింత పెట్రోల్ పోసినట్టయింది… అరెస్టు చేయాలనే ఆలోచనకు జగన్ వచ్చాక ఏదో కేసీయార్‌ను భజించిన పుణ్యమాని ఆ ప్రమాదం తప్పింది… ఇంకేముంది..? ఒక భవ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భం చూసుకుని, ఏమోయ్, నీకు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత ఉందా అంటూ శివాలూగిపోయాడు రామోజీరావు… మరి ఈయనకు ఉందా అర్హత..?
Ads
జగన్‌కు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు సరే, చంద్రబాబుకు ఎక్కడిది..? మరి ఇలాంటి సందర్భాల్లో ఎందుకు రాయలేదు..? ఎందుకంటే జగన్ మీద విషాన్ని కక్కుతూనే ఉండాలి, ఆ విషంలో నాణ్యత, ప్రచురించే విషయంలో (సబ్జెక్టు, కంటెంటు’ నాణ్యత లేకపోయినా సరే… తన అక్కసు వెళ్లగక్కాల్సిందే… చంద్రబాబు ఏం చేసినా జైకొట్టాల్సిందే… ఇదా పాత్రికేయం..? అటు అంబేడ్కర్ విగ్రహం గగనాన్ని అంటుతుంటే ఈనాడు స్థాయి పాతాళంలోకి కూరుకుపోయింది…
కనీసం సబ్ హెడింగయినా సరిచూసుకోలేనంతగా ఆ విషం ఈనాడు సంపాదకుల్ని ఆత్రపెట్టింది… ఆగం చేసింది… నాగలోకం అట… అది నాకలోకంరా నాయనా..? అంబేడ్కర్ చెప్పిందేమిటి..? నువ్వు చేస్తుందేమిటి..? నీకు ఆ విగ్రహం తాకే అర్హత ఎక్కడిది అని పోతురాజు విన్యాసం చేశాడు ఈ స్టోరీలో… మద్యపానం తగ్గించలేదట, రాష్ట్ర వనరుల సద్వినియోగం లేదట, పరిశ్రమలను తీసుకురాలేదట… పత్రికాస్వేచ్ఛను కాలరాచాడట, ప్రత్యర్థుల వోట్లను తీసేస్తున్నాడట, పాలనలో కులానికి పెద్ద పీట వేశాడట… ఇలా ఏదేదో రాస్తూ పోయాడు…
మరి చంద్రబాబు ఏమైనా శుద్ధ పూసా..? అసలు పాలనపరంగా వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు ఉంటే ఏకిపారేయండి తప్పులేదు, పత్రికలది ప్రతిపక్ష పాత్రే… కానీ మీకు పడని వాళ్లు అధికారంలో ఉంటేనే రకరకాల పైత్యప్రకోపాలు ప్రదర్శిస్తూ, మీకు నచ్చినవాళ్లు అధికారంలో ఉంటే మౌనంగా ఉంటూ, దాన్నే జర్నలిజం అనుకోవాలని జాతికి నీతులు చెబుతూ… ఇంకా ఎన్నాళ్లు ఈ బురద జర్నలిజం సార్..? జగన్ పేరు వినగానే టన్నల కొద్దీ చెత్తను గుమ్మరించే ఆంధ్రజ్యోతికీ మీకూ తేడా ఏముంది..?
ఆ పవన్ కల్యాణ్‌తో దోస్తీని ప్రజలు సహించకపోతే, మళ్లీ చంద్రబాబు గెలుస్తాడేమో అనే భయంతో ప్రజలు మళ్లీ జగన్‌ను గనుక గెలిపిస్తే… కసికసిగా కొట్టుకుంటున్న ఎన్ని ముసలి గుండెలు ఒక్కసారిగా ఏమైపోతాయో… ఇక్కడ ఆ కథనానిది జగన్ మళ్లీ గెలవాలని కాదు… ఏపీ పాలిటిక్స్‌లో కనిపిస్తున్న కులపోరాట తీవ్రత, విషప్రయోగాల గాఢతను సూచించే చిన్న ప్రయత్నం మాత్రమే… డిస్‌క్లెయిమర్ :: అలాగని జగన్ పాలన బాగుందని కాదు, సాక్షి దీనికి భిన్నమైన పత్రిక అని కూడా కాదు…
Share this Article