అదేమిటీ… తోకకూ తొండేనికీ ముడేస్తున్నారేమిటి అని అప్పుడే మొహం చిట్లించకండి… వేణుస్వామి ఈమధ్య పాపులర్… కంట్రవర్సీలకు వెరవకుండా తను అనుకున్నది తను చెబుతున్నాడు… ఇప్పుడు కొత్తేమిటి..? తను మొదటి నుంచీ అంతే… తన జ్యోస్యాలు నిజమవుతాయా, అబద్దాలవుతాయా పట్టించుకోడు… తను నమ్మింది, తన విద్య నేర్పింది తను చెబుతాడు…
జనం సెలబ్రిటీల మీద ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాళ్లనే ప్రస్తావిస్తాడు… తద్వారా తను కోరుకున్నట్టే ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాడు… నెగిటివా, పాజిటివా… ట్రోలింగా, అప్రెసియేషనా… జానేదేవ్… ఎప్పుడూ తెర మీద ఉన్నామా లేదా..? ఎప్పుడూ ఏదో సెన్సేషన్ వార్త కోరుకునే మీడియా తన ట్రాప్‌లో పడింది తప్ప, తనకు అప్పనంగా ప్రచారం వస్తున్నది తప్ప… నో మైనస్… అదొక భీకరమైన ఇమేజ్ బిల్డింగ్ బాట… ఆ బాట అందరికీ చేతకాదు…
రీసెంటుగా ప్రభాస్ కెరీర్ ఖతం అన్నాడు… కృష్ణంరాజు భార్యకూ ప్రభాస్‌కు రిలేషనే లేదన్నాడు… నయనతార జాతకభయంతోనే సరోగసీని ఆశ్రయించింది అన్నాడు… చెప్పిన తీరు ఎలా ఉన్నా… ప్రభాస్ తన అనారోగ్యం కారణంగా తీవ్ర సమస్యల్లో ఉన్నాడనేది నిజం… మోకాలికి వరుస సర్జరీలు నిజం… ఆదిపురుష్ ప్రమోషన్ల వేళ నడవలేని పరిస్థితి కూడా తనది… కృష్ణంరాజు భార్య వేణుస్వామి మీద ఏదో నెగెటివ్ కామెంట్ చేసింది కాబట్టే, మరి నా దగ్గరకు భర్త జాతకం కోసం వచ్చినప్పుడు నేను తెలియలేదా అనడిగాడు…
Ads
నయనతార సరోగసీ నిజమే… కడుపు నిలవదనే జాతక భయమా, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తనే పిల్లల్ని కనొద్దనే మార్కెటింగ్ తెలివా తెలియదు గానీ… సరోగసీ నేరమైతే కాదు, అనైతికత అనేది ఎవడికీ అర్థం కాని భ్రమపదార్థం కాబట్టి అదీ ఆమెకు వర్తించదు… టీఆర్ఎస్ గెలిస్తే కేటీయార్ సీఎం అవుతాడు తప్ప కేసీయార్ సీఎం కాడు అన్నాడు తను… అదీ వివాదమే…
తన జోస్యాలు తప్పు అనేది ఓ విమర్శ… జ్యోతిష్యం అంటేనే అది… అది శాస్త్రమని అనేకులు నమ్మరు… దేవుడిలాగే ఇదీ నమ్మకం మీద ఆధారపడిందే… సక్సెస్ రేట్ బట్టి పాపులారిటీ… తను క్షుద్రపూజలు చేస్తాడనేది మరో విమర్శ… అది క్షుద్రం కాదు, వామాచారం… మనం గ్రామ దేవతల దగ్గర పోసే కల్లుసాగ, బలి, మాంస ప్రసాదం, మద్య నైవేద్యం కామాఖ్య వంటి పెద్ద ఆలయాల్లో కూడా అనుమతించబడినవే… వేణుస్వామి చేసేవి కూడా దశమహావిద్య పూజలు గ్రామదేవతలే… నల్లనువ్వులు అయితే ఆత్మలకు, అక్షింతలు అయితే దేవుళ్ళకు…
బయటికి అందరూ ఏవేవో చెప్పినా… కేసీయార్, చంద్రబాబు, జగన్ వంటి నాయకులు సైతం రాజశ్యామల యాగాలు చేయించుకున్నవారే… అధికారం కోసం… చేయించేవాళ్ళు ఉంటే చేసేవాళ్ళు ఉంటారు… అంతే…
యండమూరి విషయానికి వద్దాం… తనను క్షుద్ర రచయిత అన్నారు… అంటే ఏమిటి..? రచనల్లో క్షుద్రం అంటే..? మనుషుల్ని అనైతిక, అసాధారణ బాటల వైపు పురికొల్పాడా..? బూతు, హింస, అశ్లీలం, వెగటుతో తన సాహిత్యాన్ని దట్టించాడా..? ఏమీ లేదు… తులసిదళంలో క్షుద్రపూజల గురించి రాశాడు, అంతే ఇక, క్షుద్ర రచయిత అవుతాడా..? ఆ పూజలు నిజం, ఆ నమ్మకాలు నిజం… వేరే భాషల్లో బోలెడు నవలలు వచ్చాయి… ఐనా ఆ నవలలో మ్యాజిక్కులు, మెడిసిన్, హిప్నాటిజం మీద కూడా బోలెడంత కంటెంట్ ఉంది కదా… చేతబడి, బాణామతి మీదే దృష్టి పెడితే ఎలా..?
తనూ వేణుస్వామి టైపే… ఎవరెన్ని విమర్శలు చేసినా సరే, వంటింటి రచయిత్రుల పోచుకోలు సాహిత్యాన్ని తొక్కుకుంటూ, కిచెన్ లిటరేచర్‌ను పక్కకు నెట్టేస్తూ… తనదైన యూనిక్ పంథాలో సాగిపోయాడు… తెలుగు నవలా సాహిత్యాన్ని దాదాపు ఓ దశాబ్దంపాటు ఎదురులేకుండా ఏలాడు… తన మీద చేసిన విమర్శలన్నీ తననే పాపులర్ చేశాయి తప్ప తనను పాఠకుల నుంచి దూరం చేయలేదు… క్షుద్ర రచనలు అనే విమర్శ ద్వారా ఒక్క పుస్తకం సేల్ కూడా తగ్గలేదు… (రచయితలందరూ భైరప్పలు కాలేరు… సినిమాల్లో పుష్పలు ఉంటయ్, భ్రమయుగాలూ ఉంటయ్… అంతెందుకు ఇదే యండమూరి అంతర్ముఖం కూడా రాశాడు కదా…)
జగన్, రేవంత్ మీద కూడా చిన్న ప్రస్తావన అవసరం ఇక్కడ… జగన్‌ను లక్ష కోట్ల అవినీతి అంటూ ఒక సెక్షన్ మీడియా టాంటాం చేసింది… జైలులో పడ్డాడు, నెలలకొద్దీ… తరువాత జనంలోకి వెళ్లాడు… ఒకవైపు తన మీద నెగెటివ్ ప్రచారం సాగేకొద్దీ బలపడిపోయాడు, పాపులరయ్యాడు, జనంలో యాక్సెప్టెన్సీ పెరిగింది… సీన్ కట్ చేస్తే, సీఎం… ఆ సెక్షన్‌కు చుక్కలు చూపించాడు… వాట్ నెక్స్ట్… ఏమిటనేది చెప్పలేకపోయినా సరే, నెగెటివ్ క్యాంపెయిన్ మనిషిని ఆపలేదు అని చెప్పడానికి ఇది…
రేవంత్ మీద వోటుకునోటు కేసు అని ముద్ర… కేసీయార్ బ్యాచ్ కేసులు పెట్టింది, తననూ జైలులో వేసింది… మీడియాలో నెగెటివ్ టాంటాం… టీడీపీని వదిలేశాడు, సీనియర్ గ్రహాలతో గ్రహణాల బెడద ఉంటుందని తెలిసీ కాంగ్రెస్‌లో చేరాడు, జనంలో తిరిగాడు… మీడియా నెగెటివ్ రాతలన్నీ తననే పాపులర్ చేశాయి, సీన్ కట్ చేస్తే… ప్రస్తుతం తెలంగాణ సీఎం…
సినిమా ఫీల్డే తీసుకుందాం… విజయ్ దేవరకొండ మీద కావాలనే విపరీతమైన నెగెటివిటీని వ్యాప్తి చేస్తోంది మీడియా, దాని వెనుక ఏవో శక్తులు… భయపడితేనే ఆగిపోతాడు… తన బాటలో తను పరుగు తీయడమే శరణ్యం… సో, నెగెటివ్ క్యాంపెయిన్ మనుషుల్ని ఆపగలదు అనుకోవడం, పర్టిక్యులర్‌గా మీడియా ప్రాపగాండా తాత్కాలిక చికాకుల్నే తప్ప ఇంకేమీ సాధించలేదు..!! ఈ ఉదాహరణలు చెప్పింది దాన్ని చెప్పడం కోసమే..!!
Share this Article