ఆశ్చర్యం అనిపించింది… మన తెలుగులో చాలామంది దర్శకులు, సంగీత దర్శకులకు పాత పాపులర్ బాణీల్ని, విదేశీ బాణీల్ని కాపీ కొట్టడం అలవాటే… వాటి మీద వివాదాలు చూస్తూనే ఉన్నాం… కథలు, సీన్ల మీద కూడా ఈ వివాదాలు ఉన్నవే… కానీ వర్మ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నా సరే, ఒకప్పటి మంచి దర్శకుడు ఇప్పుడు పాతాళ స్థాయికి పడిపోయిన తీరు మీద తనపై జాలి, సానుభూతి కూడా వ్యక్తమవుతున్న తీరు కూడా చూస్తున్నదే… అయితే కథ, ట్యూన్లు, సీన్ల విషయంలో తను ఏ సినిమాలోనూ ఎవరినీ కాపీ కొట్టినట్టు ఈరోజుకైతే విమర్శల్లేవు… తనకు ఆ అవసరం కూడా లేదు… కానీ తొలిసారి కనిపిస్తోంది… అవునూ, తనకు ఏమైంది..? ఓసారి ఈ వీడియో చూడండి…
తను కొండా మురళి మీద బయోపిక్ సినిమా తీస్తున్నాడు… తెలుసు కదా… సరే, అది తనిష్టం… గతంలోనూ పాలిటిక్స్ బేస్డ్ సినిమాలు తీశాడు, వివాదాలు సహజమే… అసలు వివాదమే లేకపోతే, జనం నోళ్లలో రచ్చ జరగకపోతే సక్సెస్ ఏముంది అనుకునే కేరక్టర్ వర్మది… ఆ పాత సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే… ఇప్పుడు తన సినిమా కోసం మంగ్లితో ఓ పాట పాడించాడు… అది తనే ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకున్నాడు… (https://www.instagram.com/tv/CYB6etpv1t_/?utm_medium=copy_link) వోకే, మంగ్లీ బాగానే పాడుతుంది, ఆ విషయంలో ఏ విమర్శా అక్కర్లేదు… వర్మ షేర్ చేసిన బిట్‌లో లేదు గానీ, ఆ పాటను మంగ్లీతో నల్గొండ గద్దర్ నర్సన్న కలిసి పాడిండు… ఇ ది పోలీసుల గురించిన పాట… పొట్టకూటి కోసం పోలీసన్నా, మా పొట్టలు కొడుతున్నావా అంటూ గతంలో గద్దర్ బోలెడుసార్లు పాడిండు… బహూశా అది పీపుల్స్‌వార్ (ఇప్పుడు మావోయిస్టు పార్టీ) అనుబంధ జననాట్యమండలి ఓన్ చేసుకున్న పాట… తమ మీదకు మరీ దూకుడుగా విరుచుకుపడకుండా పోలీసులను ప్లీజ్ చేయడానికి రూపొందించిన స్ట్రాటజిక్ సాంగ్ అది…
అందులో మంత్రీ వెనుక మంత్రీ మారె, మారలేదు నీ బతుకు… బుడ్డ పైసా పెంచినారు, పెద్ద పైసా గుంజినారు… టోపీ నెక్కరు మార్చినారురో, ఓ పోలీసన్నా, నీకు టోపి పెట్టినారురో…. వంటి వాక్యాలన్నీ ఆ పాత ఒరిజినల్ పాటలోనివే… వర్మ షేర్ చేసుకున్న చిన్న బిట్‌లోనే ఈ వాక్యాలు పాత పాటలోనివే వినిపిస్తున్నవి… మొత్తం పాట ఎలా ఉందో మరి..! దిగువ స్థాయి ఖాకీల బతుకు వెతల్ని ఆ పాట ఏకరువు పెడుతుంది… మనమంతా ఒకటేరా భయ్, కలిసి పోరు చేద్దాం రా అన్నా… అన్నట్టుగా పాట సాగుతుంది… “FIR రాయానోడు SI గా రానేవచ్చె, SI గా వొచ్చినోడు SP గాడై పోయే, 30 ఏండ్లు గడిచిపోయెరో ఓ పోలీసన్నా, మూడు పట్టీలు రాకపోయేరో ఓ పోలీసన్నా (మూడు పట్టీలు అంటే హెడ్ కానిస్టేబుల్)’’ అంటూ చేదు నిజాల్ని వెల్లడిస్తుంది పాట… ఓసారి ఈ ఒరిజినల్ పాట, యూట్యూబ్‌లో ఉన్నదే, చూడండి…
Ads
సరే, కొండా మురళి జీవితాన్ని వివరించే క్రమంలో ఈ పాటను తీసుకుని ఉంటారు… కానీ పాటలో పోలీసోడా, గోలీసోడా అనే పదాలు వాడటం మరీ డెరగేటివ్… అప్పట్లో పీపుల్స్ ఎన్‌కౌంటర్ అని రామోజీరావు ఓ సినిమా తీశాడు… అది నక్సలైట్ల మీద తీసిందే… అందులో కొన్ని నక్సల్ పాటల్ని వాడిన తీరు మీద నక్సలైట్లు అప్పట్లో మండిపడ్డారు, కొన్నిచోట్ల సినిమా పెట్టెల్ని కాలబెట్టినట్టు వార్తలొచ్చినయ్… అంతెందుకు, తమ భావజాలాన్ని అభిమానించే నారాయణమూర్తి ఈ పాటలు వాడుకున్నా నక్సలైట్లు ఇష్టపడేవాళ్లు కాదు… పోరాట అవసరం కోసం తప్ప ఆ పాటలు ఇక దేనికీ ఉపయోగించరాదనేది వాళ్ల భావన… ఈ పోలీసోడా, గోలీసోడా పదాల్ని పోలీసులు ఏమేరకు అనుమతిస్తారో చూడాలి… అలాగే ఈ పాటను ఆ సినిమాలో వర్మ ఎక్కడ, ఏ సందర్భంలో ఎంత కన్వీనియెంట్‌గా వాడుకున్నాడో కూడా చూడాల్సి ఉంది…!!
Share this Article