ఒకప్పుడు మల్లాది, యండమూరి, యద్దనపూడి, మధుబాబు, యర్రంశెట్టి శాయి వంటి రచయితల సీరియల్స్ మీద పాఠకుల్లో ఓ వెర్రి… నవల రాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి… వాటి కోసం నిరీక్షించేవారు… అది గత ప్రాభవం… ఏవి తల్లీ నిరుడు కురిసిన అన్నట్టుగా… ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే పబ్లిషర్ దొరకడు, దొరికినా మన సొంత ఖర్చు… ప్రింటింగ్ కాస్ట్ కూడా వెనక్కి రాదు… పబ్లిషర్ వచ్చిన ఆ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడు… తెలుగు రచయితలే అలా కేసులు వేసి, తిరిగి, వేసారి, చాలించుకున్నారు…
ఒకప్పుడు విరివిగా పుస్తకాలు వేసిన పబ్లిషర్లు కూడా వెనక్కి తగ్గారు… మొన్నటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఫెయిల్ చూశాక ఇంకా క్లారిటీ వచ్చింది అందరికీ… పుస్తకాలకు మంచి రోజులొచ్చాయి, పఠనం పెరిగింది అనే వ్యాసాలు, విశ్లేషణలు ఉత్త డొల్ల… బుక్ పబ్లిష్ చేసినవాడికి తెలుసు అసలు పెయిన్ ఏమిటో..! మల్లాది వారి ఉదాహరణ తీసుకుందాం…
తెలుగులో అగ్రరచయత ఒకప్పుడు… నిజానికి తన నవలలు బాగుంటయ్, రచనా శైలి కూడా బాగుంటుంది… ఈరోజుకూ రాసే ఓపిక ఉంది, ఆసక్తి ఉంది, రాస్తున్నాడు, కానీ కొనేవారేరీ… ఆమధ్య తెలిసిన వాళ్లకు వాట్సప్ మెసేజులు పెట్టాడు… పాఠకుల ఆసక్తి కనిపిస్తేనే పుస్తకాలు వేస్తాను, ఓ స్కీం పెట్టాను, కనీసం 500 మంది కొనుగోలుదార్లు కనిపిస్తే దీన్ని కొనసాగిస్తాను అనేది సారాంశం… తాజాగా ఆయనే ఓ మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నాడు… అదేమిటంటే..?
Ads
మల్లాది గారికే ఇటువంటి సమస్య అంటే మిగతావారి పరిస్థితి ఏమిటో, అంచనా వేయొచ్చు. అందుకే, నేను మూడు సీరియల్ నవలలు పబ్లిష్ అయి ఉన్నా, పుస్తక రూపంలోకి తేవడానికి భయపడుతున్నాను……. ఇది మిత్రుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత ప్రభాకర్ జైనీ స్పందన…
రచన ఒకెత్తు… ముద్రణ వ్యయం నుంచి అమ్మకాలు, పంపిణీ దాకా మరో ఎత్తు… చాలా సమస్యలున్నాయి… బిర్యానికి 500 ఖర్చుపెట్టే చాలా మందిమి.. పుస్తకం కొనుక్కోవటం మీద ఖర్చుపెట్టడం లేదు.. ఆ కల్చర్ ని చంపేసారు.. పుస్తకం చదవందే క్రియేటివిటి ఎలా వస్తుంది… క్రియేటివిటి లేనిదే జీవితంలో ఏ రంగంలో అయినా ఎలా రాణించగలరో నాకు అర్దం కాదు…… ఇది మిత్రుడు, సినిమా రచయిత, సమీక్షకుడు సూర్యప్రకాష్ జోశ్యుల అనుభవం.,.
సినిమాలకు పైరసీలాగే పుస్తకాలు మార్కెట్‌లోకి రాగానే టెలిగ్రాం గ్రూపుల్లో దర్శనమిస్తున్నాయి… కొందరు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు వెళ్లిపోయారు… అనేక మంది రాయడమే మానుకున్నారు… కానీ పుస్తకం మీద ప్రేమ తగ్గని కొందరు ఇంకా ఆ ప్రేమతోనే చేతులు కాల్చుకుంటున్నారు… అన్నట్టు, మల్లాది తాజా ‘యుద్ధ విరమణ’ ప్రకటనకు స్పందన ఏమిటో ఆయన మాటల్లోనే చదవండి…
డియర్ బుక్ లవర్, ఇవాళ మధ్యాహ్నం నా మెసేజ్ చూసిన కొందరి స్పందన ఇది. కొందరి అభిప్రాయాలు
*ఇది అన్యాయం సార్. తినని వాళ్ళ కోసం తినే వాళ్ళ కడుపు మాడ్చడం ఏమిటి ?
*…. నమస్తే సార్ ! సారీ , చాలా disappointment న్యూస్ మాకిది ఈ డిస్కౌంట్ స్కీం లు గట్రా లేకుండా అంతకుముందు ఉన్న పబ్లిషింగ్ సంస్థకి పుస్తకాలు సేల్ చేసే పద్దతికి వెళితే బావుంటుందేమో సార్.
* ఎంతో ఖర్చుచేస్తాం. అదేమిటో పుస్తకం వచ్చేసరికి… మీరు అన్నట్లు పుస్తకం కొనకుండా దాచింది పిల్లలకి ఇచ్చి వెళ్తాం. అదే పుస్తకమైతే జీవితాంతం ఉంటుంది.
* మీ ప్రకటన మాలాంటి నిజమైన అభిమానులకు షాక్ లాంటిది. మీ రచనా ప్రవాహం ఆగిపోవడం… 50 సంవత్సరాల పైగా సాహితీ ప్రయాణంలోని మాలాంటి వ్యక్తుల జీవితాలలో చాలా ప్రభావం చూపింది. పుస్తకం మన నిజమైన స్నేహితుడు. చివరి వరకు తోడుగా ఉంటాడు. అలాంటి స్నేహితులను అందించే మీలాంటి సృష్టికర్తలను కోల్పోవడం చాలా దురదృష్టకరం.
I miss you sir.
Bye sir.
Nice meeting online…’’
ఇన్ని లక్షల మంది తెలుగు వారు ఉండి 500 మంది కూడా పుస్తకాలు కొని చదవకపోవటం అన్యాయం కదా.
ఇది నేను నమ్మలేకపోతున్నాను, చాలా చెప్పాలని ఉంది, చాలా బాధగా కూడా ఉంది.
Sorry to know this, Sir. I may not get opportunity to read ‘Meghamaala’ again.
Very sad news. It’s our bad luck…
This is saddening.
* It’s a black day to me…
మల్లాది మెసేజ్ కొనసాగింపు ఇలా… ‘‘చాలామంది రాయడం మానొద్దు అన్నారు. మానను. చరిత్రలో ఓ రోజు, ఇంకా అనువాద కథా సంపుటి బేడ్ కేరక్టర్స్, ఏర్ పోర్ట్ టు ఏర్ పోర్ట్, పరమార్థ కథలు మొదలైన 14 పుస్తకాలు ప్రచురణకి సిద్ధంగా ఉన్నాయి. ధర్మాసనం అనే నవల సగం పూర్తి చేసాను. ముట్టడి, చిరునవ్వు వెల ఎంత? మరి కొన్ని నవలలు పూర్తిగా వర్కౌట్ చేసి రాయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాని పుస్తకంగా ప్రచురణ కాకుండా అవి మీకు చేరే విధానం లేదు.
ఒకరిద్దరు వెబ్సైట్ ని ఆరంభించమన్నారు. నో. నా పుస్తకాలు ప్రింట్ లోనే అన్నది మొదటినించి నా లక్ష్యం.
కొందరు పూర్వం కొననందుకు చింతిస్తూ, ఇప్పుడు మొత్తం సెట్ డిస్కౌంట్ లేకుండా కొంటామన్నారు. టూ లేట్.
పబ్లిషర్ పుస్తకాలని పంపడంలో నిర్లక్ష్యంగా, జాప్యంగా వ్యవహరించడం నాకు, మీలో కొందరికి ఇబ్బంది కలిగించింది. కొందరు నాకు హార్ష్ మెసేజ్ లని కూడా పంపారు. దాంతో మీకు, పబ్లిషర్ కి మధ్య గతంలోలాగా మధ్యవర్తిగా ఉండదలచుకోలేదు.
ప్రిజం బుక్స్ మూసేసారు. తెలుగు నవల లాభసాటి వ్యాపారం కాదు కాబట్టి కొత్త పబ్లిషర్ వస్తారనుకోను. నేను లిపి పబ్లికేషన్స్ ఎందుకు మూసేసానో నా నవల వెనక కథ లో చెప్పాను.
ప్రస్తుతం మహా భారతం వాడుక భాషలో నవలగా రాస్తున్నాను. ఆదిపర్వం సగం పూర్తయింది.
మరోసారి మీ అభిమానానికి ధన్యాదాలు.
మీ,
మల్లాది వెంకట కృష్ణమూర్తి
24-3-2024
Share this Article