Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ – ఇచ్క పోతున్న ‘బతుకమ్మ’ : సింగరేణి జిందాబాద్….
మలిదశ తెలంగాణా ఉద్యమంలో త్వరితంగా ఎదిగి వచ్చిన నేతల్లో కల్వకుంట్ల కవితకు విశిష్ట స్థానం ఉన్నది. నిన్న మొన్నటిదాకా బతుకమ్మ అంటే ఆమె మారుపేరుగా నిలిచారు. కానీ, వారి రాజకీయ ప్రస్థానంలో నిన్నటి సింగరేణి ఎన్నికల ఫలితం మామూలు కుదుపు కాదు. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సంస్థ చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాదు, ఒక డివిజన్ లో ఒకే ఒక ఓటు వచ్చిందంటే పరిస్థితి ఊహించవచ్చు. ఆలాస్యమైనా రాజకీయ జోక్యాన్ని అవినీతిని ఓడించి నిలిచిన సింగరేణి కార్మిక శక్తి అజేయం. వారి విజ్ఞత అపూర్వం. వర్ధిల్లాలి సకల జనుల బతుకమ్మ. వారి సమరశీల పోరాటాలు.
నలభై ఐదేళ్ళ కల్వకుంట్ల కవిత గారు పిన్న వయసులోనే సాధించింది ఎక్కువ. నిజానికి మలిదశ తెలంగాణా ఉద్యమంలో ఒక దశాబ్దం తర్వాత ఆమె వచ్చి చేరారు. 2006 నుంచి తెలంగాణ రాజకీయాల్లో కాలీడారు. ముందు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. తర్వాత జాగృతి వ్యవస్థాపకురాలిగా ప్రత్యేకతను సంతరించుకున్నారు. తాను చాలా కాలం అప్రతిహతంగా ముందుకే సాగారు. చక్కటి చరిష్మా గల నేతగా, కెసిఆర్ కూతురిగా ఆమెకు జనం నీరాజనాలే పలికారు. మంచి వక్త, సబ్జెక్టు నాలెడ్జి ఉంటుంది… మూడు భాషల్లోనూ ప్రసంగించగలరు… ఒక మారు పార్లమెంట్ కు ఎంపికయ్యారు. అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యులుగానూ ఉన్నారు. కానీ అదంతా గతం.
ఇప్పటి పరిస్థితి మారింది. గతంతో పోలిస్తే వారు మున్నెన్నడూ ఎదుర్కొని సంకట పరిస్థితిని నేడు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఒక రకంగా సకల జనుల చేతనతో ఎదిగిన తెలంగాణా ఉద్యమంలో ఆమె తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి, చక్కగా ఆడుకునే స్థితిలో ఉండినారు. అక్కడి నుంచి నేడు తన ఆటా పాటా అంతా ఆగిపోయే స్థితికే చేరుకున్నారు.
తండ్రి నీడలో భద్రంగా ఉన్నప్పటికీ తనంతట తాను ఎదిగిన కవిత తనదైన శైలిలో కార్యక్షేత్రం పెంచుకుంటూ ముందుకు సాగినప్పటికీ మెల్లగా తన ప్రతిష్టను తానే దెబ్బ తీసుకునే స్థాయికి వచ్చారనే చెప్పాలి. ప్రతిదీ కావాలి అనే ధోరణి వారి స్వభావం అంటారు. అలా అనేవారే, ఒక రంగాన్ని నిలబెట్టుకునే ఓర్పు ఆమెకు లేకపోవడమే వారిని దెబ్బతీసిందనీ చెప్పారు. ఏమైనా, ‘అధికారం’ కోసం తాపత్రయమే ఉండగానే సరిపోదని కవిత ప్రస్థానాన్ని విశ్లేషించిన వారెవరైనా చెబుతారు. ఒక సమీక్షగా చెబితే, ఆమె లేచి విరిగిన కెరటం.
అంతేకాదు, బలమైన పునాది లేని పనులు ఎప్పటికైనా వీగిపోతాయనడానికి, నిజాయితీ నిబద్దతా లేని రాజకీయాలు ఎల్లకాలం మనలేవనడానికి నిన్నటి సింగరేణి ఎన్నికల్లో తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కార్మిక సంఘం చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాదు, ఒక చోట కేవలం ఒకే ఒక ఓటు సంపాదించుకోవడమే నిదర్శనం. ఇక్కడి నుంచి కవిత తిరిగి ప్రజల్లో నిలదొక్కుకోవాలంటే జాగృతం కావలసింది ప్రజలు కాదు, ఆమె, వారి బలగం, ముఖ్యంగా ఉద్యమ పంథాను వీడి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన పార్టీ.
ఇక ఎన్నికల విషయాన్ని, ఫలితాలను పరిశీలిస్తే, ఈ సారి సింగరేణి ఎన్నికల్లో తమ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజీకెఎస్) నామ మాత్రం ఓట్లు అని కూడా చెప్పరాదు. ఇల్లెందు నియోజకవర్గంలో ఒకటి మాత్రమే సాధించింది. బెల్లంపల్లి డివిజన్ లో మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. అదీ పరిస్థితి. ఇక అన్నిటి గురించి చెబితే, 11 డివిజన్లలో మొత్తం ఓట్ల సంఖ్య 39, 773 ఉండగా వీరు సాధించిన ఓట్లు 1298 మాత్రమే.
నిజానికి ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సంస్థగా పుట్టింది. 2012లో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒకసారి, మళ్ళీ 2017 లో రెండోసారి అత్యధిక డివిజన్లలో గెలిచి గుర్తింపు సంఘంగా పని చేసింది.
కాగా, సింగరేణిలో ఎన్నికలు మొదలైన తర్వాత సిపిఐ అనుబంధ కార్మిక సంఘం (ఎఐటియూసి) ఇది వరకు మూడు సార్లు, ఈ దఫాతో కలిస్తే నాలుగు సారి గుర్తింపు సంఘంగా ఎంపిక కాగా కాంగ్రెస్ అనుబంధ సంఘం (ఐఎస్టీయూసి ) ఒక సారి గుర్తింపు సంఘంగా నిలిచింది. కానీ ఉద్యమ సంఘంగా మొదలైన టిబిజీకెఎస్ ఈ పదకొండేళ్ళ కాలంలో అనుసరించిన విధానాలు, మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి కారణంగా సంస్థ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది. అందుకు మొదట నిందించ వలసింది ఎవరూ అంటే దాని గౌరవ అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత అని చెప్పక తప్పదు.
నిజానికి కవిత గారి ఉజ్వల ప్రభ రోజురోజుకూ తరగిపోవడం మొదలై చాలా ఏళ్లయింది. మొదటగా చెప్పుకోదగినది, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు. రెండో సారి ఇక్కడ నుంచి పోటీచేసినప్పుడు వారు ఓడిపోవడంతో ప్రజాక్షేత్రంలో తన ప్రతిష్ట మసక బారడం మొదలైంది. దాన్నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మధ్యే మార్గంగా ఆమె శాసన మండలికి వెళ్ళారు. ఆ నిర్ణయం ఆమె గౌరవాన్ని మరింత తగ్గించింది. ఆ తర్వాత నిజనిజాలేమైనా లిక్కర్ స్కాం తన ప్రతిష్టను మరింత దెబ్బ తీసింది.
తాజాగా తాను గౌరవ అధ్యక్షులుగా ఉన్న కార్మిక సంఘం ఓటమి పాలవడమే కాకుండా కనీస గౌరవమైన ఓట్లను గెలుచుకోలేక పోవడంతో ఒకనాడు బతుకమ్మకు తానే అనధికార అంబాసిడర్ గా ఉన్న కవిత నేడు నిమజ్జనం అనంతరం చెరువులో ఇచ్కపోయిన బతుకమ్మగా మిగిలిందీ అనడంలో సందేహం లేదు.
ఐతే, ఇదంతా స్వయంకృతమే అనాలి. ఆమె ప్రధానంగా బతుకమ్మతో సాంస్కృతిక రంగంలోకి ప్రవేశించి దాన్ని చివరికంటా కొనసాగించలేదు. విస్తృత పరచలేదు. మలిదశ ఉద్యమంలో ప్రధానంగా సాగినది మన భాషా యాస …ఆటా పాటా…మొత్తంగా స్వీయ అస్తిత్వం, ఆత్మ గౌరవం ప్రధానంగానే అన్నది మరచిపోరాదు. బతుకమ్మ వీటన్నిటికీ ప్రతీక. కానీ బతుకమ్మ అంటే కేవలం ఆ పండుగ రోజుల్లో వేడుకలు కాదు, అది నిత్య జీవన సంబురం అన్నది కవిత గానీ వారి తండ్రి గానీ గుర్తించలేదు. అభివృద్ధి కన్నా ఆత్మ గౌరవం మిన్న అన్న సొయి వారికి లేకుండా పోయింది. దాంతో నేల ఫిడిచి సాము చేసినట్లు పాలన – ఒక వేడుకగా జరిగింది. ప్రజల మౌలిక ఆకాంక్షలు నెరవేరలేదు.
ఈ పదేళ్ళ పాటు పునర్నిర్మాణం అన్నది తమ ఇష్టానుసారమే గానీ ప్రజలు క్షేత్రంగా సాగలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కన్నా తమ కుటుంబం స్థిరపడటం ప్రజలు కళ్ళారా చూశారు. తాను స్వయగా ఒకసారి పార్లమెంట్ కు వెళ్లారు. ఓడిపోయాక మళ్ళీ శాసన మండలికి తిరిగి వచ్చారు. అంతా తమకు పని కోసం జరిగినట్లే జరిగింది తప్ప ప్రజల వేదన వినిపించుకోలేదు. దేశ దేశాల్లో బతుకమ్మ వేడుకలు జరిపి వచ్చారు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ఎగరేశారు.
ఇటు జిల్లా స్థాయిలో జాగృతి పేరిట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు. ఇలా అనేక దిశలా పనిచేసినప్పటికీ సంస్కృతి అంటే అది శిఖరాయమానంగా ఎదగడం కాదు, మైదానాలుగా విస్తరించడం అన్నది మరచిపోయారు. కార్మిక సంఘం అంటే రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులను నిలపడమే తప్ప ఆ బతుకులతో లబ్ది పొందడం కాదని గ్రహించినట్లు లేదు. ఆఖరికి కార్మికుల జీవితాలతో ఆడుకున్న విమర్శకు గురయ్యారు.
కాలేరు కాలనీల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేసుకున్నారు. అక్కడ అవినీతి అక్రమాలకు తావిచ్చేలా పని చేశారనే పరిస్థితి ఏర్పడింది. అది సింగరేణిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, మొత్తానికి సింగరేణి ఎన్నికల్లో మొన్నటిదాకా గుర్తింపు సంఘంగా మొదటి వరసలో ఉన్న టిబిజీకెఎస్ – నేడు ఒక చోట ఒక్కే ఒక్క వోటు తెచ్చుకుని, పోటీ చేసిన పదమూడు సంఘాలు తెచ్చుకున్న ఓట్లతో పోలిస్తే నాలుగో స్థానానికి పడిపోవడం నైతికంగా ఎంత అవమానకరమూ అంటే దీన్ని కార్మిక విజయం అనేకంటే ఇది ప్రభుత్వ (బిఆర్ ఎస్ ) /ఉద్యమ సంఘం వైఫల్యానికి మంచి దృష్టాంతం అనక తప్పదు.
విశేషమేమిటంటే, కార్మికులు ఈ సారి అధికార కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసికి కూడా మెజారిటీ ఓట్లు వేయలేదు. సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియూసికే గుర్తింపు సంఘంగా ఏర్పడేందుకు మద్దతు నిచ్చారు. ఇందుకు కారణం కూడా ఈ పదేళ్ళ/పదకొండేళ్ళ కాలంలో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘం ఎలా వ్యవహరించిందో కళ్ళారా చూసిన ఫలితమే అనాలి. ఆ మేరకు కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు మంచి సందేశమే ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీ అనుబంధ సంఘానికి ఓటు వేసి గెలిపించ వద్దని తెలియజేప్పినట్టు అయింది. అలా ఒక రకంగా చెడ్డ ఉదాహరణకు మంచి దృష్టాంతంగా ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం’ నిలవడం విచారకరం.
చిత్రమేమిటంటే, తమ సంఘం ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయమని మొదట, ఆ తర్వాత చేస్తామని చెప్పడమే కాక, పోటీ చేసిన ప్రధాన నాయకత్వం ప్రచారంలో పాల్గొనకపోవడం మరో చిత్రం. అంతేకాదు, కొన్ని చోట్ల తమకు ఓటు వేయకున్నా పరవాలేదు, ఇతర సంఘాలకు ఓటు చేయమని చెప్పడం చివరి రోజున జరిగిన మరో విశేషం. అలాగే, చాలా మంది నేతలు సిపిఐ అనుబంధ కార్మిక సంఘాల్లో చేరిపోవడం కూడా జరిగింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఉద్యమ కార్మిక సంఘంగా పుట్టిన ఈ సంఘం దశాబ్దం కాలం అనంతరం కార్మికులకు పూర్తిగా దూరమవడం ఎంతలేదన్నా విచారకరం. ఇది కవితకే కాదు, ఉద్యమ నేత, రాష్ట్ర సాధకులుగా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి కూడా తీరని నష్టం. వీరి సంఘం ఇక కోలుకొని కార్మికుల ఆదరణ పొందడం చాలా కష్టం.
ముఖ్యంగా పోరాట శీలతను నిలుపుకునేందుకు గానూ సింగరేణి ఈ సారి ప్రభుత్వ అనుబంధ సంఘానికి కాకుండా సిపిఐ అనుబంధ సంఘానికే గుర్తింపు వచ్చేలా చేయడాన్ని బట్టి కార్మిక శక్తి అజేయంగా ఉండేది విపక్షంలో ఉన్నపుడే, నిత్య పోరాట శీలత కాపాడుకున్నప్పుడే అని తాజా తీర్పుతో స్పష్ట మవుతున్నది. దాన్ని గ్రహించి ఎవరైనా మండే బొగ్గుతో పెట్టుకోకపోవడమే విజ్ఞత. ఇదే అసలైన ‘కవితా న్యాయం’. ఈ వాణి వినిపించాలనే ‘కవిత’ పేరిట రాసిన ఈ సింగరేణి కథనం, మరి, సింగరేణి జిందాబాద్. కాళోజీ అన్నట్టు, “బతుకమ్మా… బతుకు”…
Share this Article