రామాయణం మొత్తం చదివినా మనకు రావణుడు, రాముడు, సీత, కైకేయి, హనుమంతుడు, లక్ష్మణుడు తదితరుల పేర్లే పదే పదే తగుల్తుంటాయి… వాటి గురించే ప్రవచనకారులు బాష్యాలు చెబుతుంటారు… కానీ కొన్ని పాత్రలు ప్రాధాన్యమైనవే అయినా పెద్దగా ప్రాచుర్యంలోకి రావు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది మెయిన్ విలన్ రావణుడి పట్టమహిషి మండోదరి…
మండూకం అంటే కప్ప… కప్పలాంటి కడుపు కలిగినది అని ఏవేవో పిచ్చి విశ్లేషణలు చేస్తారు గానీ… ఆమె సౌందర్యవతి… సీత ఛాయలు ఉంటాయి… హనుమంతుడు సైతం సీతను రావణుడు అంతఃపురంలో దాచి ఉంటాడనే అంచనాతో అక్కడే వెతికితే మండోదరిని చూసి సీతే అనుకుని భ్రమపడతాడు… అంతటి పోలిక… రావణుడికి ఎందరు భార్యలున్నా సరే, మండోదరి మాత్రమే పట్టమహిషి అయ్యింది… రావణుడికి మంచీచెడూ బోధించగల చొరవ, ధైర్యం ఉన్నది కూడా కేవలం మండోదరికి మాత్రమే…
గణేషుడికి కడుపు పెద్దగా ఉంటుంది కాబట్టి లంబోదరుడు… కృష్ణుడు ఇల్లు కదలకుండా తల్లి ఓ తాడుతో తాటిచెట్లకు కట్టేస్తుంది, కాబట్టి దామోదరుడు… చాటల్లా చెవులుంటాయి కాబట్టి కుంభకర్ణుడు… దవడ పగిలిపోయి ఉంటుంది కాబట్టి హనుమంతుడు… కేకయ రాజ్య యువరాణి కాబట్టి కైకేయి… ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో లక్షణాన్ని బట్టి పేర్లు పెట్టారు పురాణకర్తలు… కానీ జన్మనామం వేరే ఉంటుంది కదా… వాటిని మాత్రం ప్రాచుర్యంలోకి తీసుకురారు…
Ads
సేమ్, మండోదరి కూడా… మనకు మండోదరి అనగానే గుర్తొచ్చేది ఏమిటి..? ఏముంది..? పెద్దగా ఏమీ లేదు… ఆమె రావణుడి భార్య, సీతను ఎత్తుకురావడం వినాశనానికే అని చెబుతుంది, భయపడుతుంది, సీతను రాముడి దగ్గరకు పంపించెయ్ అని హితవు చెబుతుంది… రావణుడు వినడు… ఆఫ్టరాల్ నరులు, వానరులు అని రావణుడు ఛీత్కరిస్తే ఒక వానరుడు లంక మొత్తాన్ని కాలబెట్టాడు కదా అంటుంది… చివరకు యుద్ధ ఫలితంగా ముగ్గురు కొడుకుల్ని, భర్తను కోల్పోయి, ఒంటరిది అయిపోతుంది…
ఒక కథ మనకు వినిపిస్తుంది… యుద్ధానంతరం రాముడి సలహా మేరకు విభీషణుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడని, లంక చట్టాల ప్రకారం అది సమ్మతమేననీ ఆ కథ సారాంశం… చాలామంది నమ్మరు, కొట్టేస్తారు… మరో కథ ఉంది… రావణుడి మనసు చంచలం కదా… ఓసారి పార్వతిని చూసి మోహిస్తాడు, తనకు ఆమె కావాలని పోరుపెడతాడు… కైలాసం నిర్ఘాంతపోతుంది… శివుడి త్రిశూలం రావణుడి మెడలో దిగినట్టే అని ఎదురుచూస్తుంటారు… విచిత్రంగా శివుడు సరేనంటాడు… కైలాసం ఈసారి మరింత విస్తుపోతుంది…
రావణుడిని శపించకుండా… రావణుడిని వధించేందుకు ఓ ఉపకరణంగా ఆడ బిడ్డను పుట్టించాలని కోరుతూ ఓ కప్పను సృష్టిస్తుంది… ఆ కప్ప సముద్రంలోకి విసిరేయబడుతుంది… అక్కడి నుంచి భూఉపరితలంపైకి చేరి, ఓ బిడ్డను కంటుంది… ఆ బిడ్డ జనకుడి రాజ్యాన్ని చేరుతుంది… ఆమే సీత… ఇదీ మరో జానపద కథ…
మరో కథ ఇంట్రస్టింగు… నిజానికి మండోదరి ఓ అప్సరస… ఓ ఖగోళ మహిళ… మాయ అనే రాక్షసుడు లంకను, ఆమెను కట్నంగా ఇస్తాడు… ఆమెకు మేఘనాథుడు, అతికాయుడు, అక్షయకుమారుడు అని ముగ్గురు కొడుకులు… తనకు లొంగని మహిళల్ని రావణుడు చిత్రవధ చేస్తే, వాళ్లంతా పెట్టిన శాపాలే ఇప్పుడు సీతరూపంలో ఫలించబోతున్నాయని మండోదరి వారిస్తుందని ఒక కథ… కాదు, శాంతి కోసం రావణుడిని అంగీకరించాలని సీతను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుందని మరో కథ… ఇలా అనేక కథల్లో అనేక రకాల కేరక్టరైజేషన్ ఆమెది…
కశ్మీరీ రామాయణం ప్రకారం… సీతను చూసిన మరుక్షణం మండోదరి వక్షోజాల నుంచి పాలు కారడం మొదలవుతుంది… దాంతో ఆమె సీతే తనకు జన్మించిన బిడ్డగా గుర్తిస్తుంది… బెంగాలీ రామాయణం ఇంకోరకంగా చెబుతుంది… రావణ వధ తరువాత సీతను ఆమే రాముడికి అప్పగిస్తుంది… కానీ దుఃఖంతో రాముడికి శాపం పెడుతుంది… నాలాగే మీరూ విరహ వేదనను అనుభవించాల్సి ఉంటుందని శాపం… అస్సామీ రణక చరిత్రలో మరోరకం… రావణుడు ఫేక్ రాముడిని, లక్ష్మణుడిని సృష్టించి, వారితో రావణుడిని పెళ్లి చేసుకోవాల్సిందిగా సీతకు చెప్పిస్తాడు…
ఇంకో కథ ఏమిటంటే… హనుమంతుడు తేనెటీగగా మారి మండోదరి నివాసంలోకి వెళ్తాడు… పిల్లిగా మారతాడు… ఆమె ఆ పిల్లికి ఏదో ఆహారం పెట్టబోయే నిరాకరించి ఆమె రొమ్ములను రక్కుతాడు… ఆమె హారాన్ని దొంగిలిస్తాడు… దాన్ని రావణుడి ఎదుటకు విసిరేస్తాడు… ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంది, నువ్వే పరీక్షించి రుజువు చేసుకో అంటాడు రావణుడితో…
రావణుడు మరో స్త్రీతో తప్పుగా ప్రవర్తించడం వల్లే ఓ అపరిచితుడు మాయారూపంలో తనను తాకగలిగాడని ఆమె రావణుడిని నిందిస్తుంది… అవసరమైతే అగ్నిపరీక్షకు సిద్ధమనీ అంటుంది… ఒక పాత్ర చుట్టూ ఎన్ని కథనాలో కదా… ఇంతటి సంక్లిష్టమైన పాత్ర రామాయణంలో మరొకటి కనిపించదు… చాలామంది విశ్వసించే కథ ఏమిటంటే… ఆమె విశ్వకర్మ పుత్రుడు మయబ్రహ్మకు, హేమ అనే అప్సరసకూ పుట్టిన బిడ్డ… రావణుడి కోరిక మేరకు మయబ్రహ్మే తనకు మండోదరిని ఇచ్చి పెళ్లి చేస్తాడు… చివరగా…
మన పురాణాల్లో పంచకన్యలు అనే ప్రస్తావన వస్తుంది తరచూ… వాళ్లు మండోదరి, అహల్య, తార, సీత, ద్రౌపది… వీళ్లందరి వివాహాలు ఏదోలా చెడగొట్టబడినవే… అహల్యను గౌతమరుషి వెళ్లగొడతాడు… తార పెళ్లి వాలి, సుగ్రీవుల నడుమ అటూఇటూ మొగ్గుతుంటుంది… సీత చెప్పుడుమాటల కారణంగా రాజ్యబహిష్కృతురాలు అవుతుంది… ద్రౌపదిని మొగుళ్లు జూదంలో ఓడిపోతారు… మండోదరి మాత్రమే మినహాయింపు… మరో ఇంట్రస్టింగ్ కథేమిటంటే… తనకు పుట్టిన బిడ్డ వల్ల రావణుడు మరణిస్తాడని మండోదరికి ఆకాశవాణి చెబుతుంది… ఓరోజు నీరు అనుకుని ఓ కుండలోని రక్తాన్ని తాగుతుంది… అది రావణుడితో వధింపబడిన రుషుల రక్తం…
ఆ రక్తం గర్భంగా మారి, ఓ ఆడపిల్లగా మండోదరి జన్మనిస్తుంది… రావణుడికి తెలిస్తే బతకనివ్వడని అనుకుని, ఓ నదిలో విడిచిపెడుతుంది శిశువును… ఆ శిశువు సముద్రుడి ద్వారా భూదేవికి, భూదేవి ద్వారా జనకుడి పొలంలోకి చేరి, ఆయనకు దొరికి, సీతగా పెరుగుతుందనీ, అందుకే సీతను చూడగానే మండోదరి తన బిడ్డగా గుర్తించి, రావణుడి అంతం సమీపించింది గుర్తిస్తుంది… ఎంతటి సంక్లిష్టమైన పాత్రో కదా…!!
Share this Article