.
నచ్చినట్టు బతకడం సులభమే… అన్నీ అనుకూలిస్తే… డబ్బు, అదృష్టం ఉంటే..! కానీ నచ్చినట్టు చావడం..?
క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలు కాదు… ఎలా మరణించాలని అనుకున్నారో ఒకటికి అనేకసార్లు ఆలోచించి, తాము అనుకున్న పద్ధతుల్లో ఆనందంగా మరణించడం..! అందరికన్నా భిన్నంగా మరణించాలని అనుకోవడం..! ఎప్పుడూ విని ఉండలేదు కదా…
Ads
ఓసారి మహాభారతంలోకి వెళ్దాం… ఇక ఈ లోకం నుంచి వెళ్లిపోవడానికి సమయం ఆసన్నమైందని గమనించాక ద్రౌపది సహా పాండవులు హిమాలయాల్లోకి మహాప్రస్థానం ఆరంభిస్తారు… తోడుగా ఓ కుక్క… సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కొక్కరే రాలిపోతారు… అవన్నీ ఇచ్ఛామరణాలు… అలాంటి పౌరాణిక మరణమే మనం చెప్పుకోబోయేది…
సరే, వర్తమానంలోకి వద్దాం… ప్రొతిమా గుప్త… 1948… ఢిల్లీలో పుట్టింది… తండ్రి హర్యానా వ్యాపారి, తల్లి బెంగాలీ… ముంబైలో చదువుతూ మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది… సంప్రదాయ కట్టుబాట్లను ఛేదించడంపై అనురక్తి…
సినీ బ్లిట్జ్ మ్యాగజైన్ లాంచింగ్ కోసం బోల్డ్ ఫోటో షూట్ చేసింది… 1974లో దాదాపు బరిబాతల జుహు బీచ్‌లో పరుగులు తీసింది… ఆమె అంతే… సంప్రదాయపు ప్రతి రూల్ బ్రేక్ చేసేది… అప్పట్లో బోలెడు విమర్శలు… వార్తలు… ఐకానోక్లాస్ట్ అంటారు… అంటే స్థిరపడిన నమ్మకాలు, నియమాలను బ్రేక్ చేసే వ్యక్తి…
జీవితం నిస్సారంగా, అర్థరహితంగా సాగుతున్నట్టు… శూన్యం ఆవరిస్తున్నట్టు అనిపించిన దశలో ఓ ఒడిస్సీ డాన్స్ చూసింది… ఆమె కనెక్టయిపోయింది… గురు కేలుచరణ్ మహాపాత్ర శిష్యురాలిగా మారిపోయింది… డాన్స్ నేర్చుకుంది… మరింత పరిపూర్ణ విద్య కోసం గురు కళానిధి నారాయణన్ నుంచీ నేర్చుకుంది…
తరువాత ప్రదర్శనలు… దేశవ్యాప్తంగా… ఒకప్పటి వ్యాంప్ తరహా కేరక్టరేనా ఈమె..? సర్వత్రా ఆశ్చర్యం… నృత్యగ్రామ్ అని ఓ నర్తనాశ్రమం కట్టింది… అది ఒడిస్సీ కోసమే కాదు, అన్నిరకాల శాస్త్రీయ నృత్యాల్లో ఉచిత శిక్షణ ఇచ్చే పాఠశాల… నర్తనశాల…
అంతేకాదు, చౌ, కలరియపట్టు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ… ప్రధాని వీపీసింగ్ ప్రారంభించాడు దీన్ని… ఏడు గురుకులాల్ని అక్కడే నిర్మించేదాకా కుటీరంలోనే ఉండేది… హఠాత్తుగా గుండు గీయించుకుని స్వస్ బాపతు ప్రత్యేక బ్రీడ్ కుక్కలతో కనిపించేది…
- మరి వ్యక్తిగత జీవితం… కబీర్ బేడీని పెళ్లి చేసుకుంది… తనకు బోలెడు అఫయిర్స్… విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు… అధికారికంగానే నాలుగు పెళ్లిళ్లు… ఇక ఓ దశలో నీ ఇష్టం వచ్చినవాళ్లతో తిరుగు అని స్వేచ్ఛ ఇచ్చి… కాదు, విరక్తితో విడిచిపెట్టేసింది… తన పేరులో నుంచి బేడీ తీసేసి గౌరి చేర్చుకుంది… ఇద్దరు పిల్లలు… పూజా బేడీ, సిద్ధార్థ్…
కొడుక్కి స్కిజోఫ్రేనియా… అమెరికాలో చదువుతూ ఆత్మహత్య చేసుకున్నాడు… ప్రొతిమాను వైరాగ్యం ఆవరించింది… అచ్చంగా ఓ సన్యాసినిలా మారిపోయింది… నేను నా భర్తకు ఓ సీతను కాను… నన్ను ప్రేమించేవాళ్లకు రాధను కూడా కాను… కనీసం నా పిల్లలకు ఓ యశోదను కూడా కాలేకపోయానేమో… అని రాసుకుంది ఎక్కడో…
ఏడు సంవత్సరాల వయసులో ఆమెకు మొదటిసారి మరణం ఎదురైంది… ఆమె చెల్లెలు చాక్లెట్ల పెట్టె స్థానంలో బ్రూక్లాక్స్ మాత్రలు వేసింది… అన్ని విరేచన మందులను ఒకేసారి తిన్న ప్రోతిమా కుప్పకూలిపోయింది… ఆమె చనిపోయిందని ఒక వైద్యుడు ప్రకటించాడు… ఆమె శరీరం కడిగి, చితికి సిద్ధం చేయబడింది…
ఆమె అకస్మాత్తుగా మేల్కొంది… ‘నేను యమధర్మరాజునే మోసగించి, మళ్లీ వచ్చేశాను… ఇది మరో జన్మ అనీ రాసుకుంది… ఆమె మరణానంతరం ఆమె వ్యాసాలు, లేఖలు, కాలమ్స్ సంకలనం చేసి పూజా బేడీ ఓ పుస్తకం రిలీజ్ చేసింది… దాని పేరు టైమ్‌పాస్… అందులో రాయబడ్డాయి ఈ అనుభవాలన్నీ…
కొడుకు మరణించిన ఒక సంవత్సరం తర్వాత, ఆమె నృత్యగ్రామ్‌ను త్యజించి, దానిని తన స్నేహితురాలు లిన్ ఫెర్నాండెజ్, శిష్యురాలు సురూప సేన్‌లకు వదిలేసింది.., జీవితంలో, ప్రొతిమాను అనేకులు ఆరాధించడంతోపాటు, ఎగతాళి చేశారు… ఆమే రాసుకుంది ఇలా…
- “మన సమాజం 2,000 సంవత్సరాలకు పైగా చాలా జాగ్రత్తగా నిర్మించిన ప్రతి నియమాన్ని నేను ఉల్లంఘించాను… నా యవ్వనాన్ని, నా లైంగికతను, నా తెలివితేటలను సిగ్గు లేకుండా ప్రదర్శించాను… నేను చాలా మందిని ప్రేమించాను, కొంతమంది నన్ను ప్రేమించారు… ప్రజలు నన్ను బహిష్కరించారు, అవమానించారు, కొందరు నన్ను ప్రశంసించారు… నో రిగ్రెట్స్… ఇప్పటి నా మానసిక స్థితి అన్నింటికీ అతీతంగా మారిపోయింది… ఇక జనం ఎవరో ఏదో అనుకుంటారనే భావనల నుంచి విముక్తం అయ్యాను… మగాడి అవసరం కూడా అస్సల్లేదు… సంపూర్ణ విముక్తి… Come What may… జీవితంలో ఏది జరగాలో అది జరుగుతుంది, సిద్ధంగా ఉండటం, ఆహ్వానించడమే మన పని’’
తరచూ హిమాలయ యాత్రలు చేసేది… ఓసారి కుంభమేళా సందర్భంగా చెప్పింది… నన్ను మళ్లీ హిమాలయాలు పదే పదే పిలుస్తున్నాయి అని… బిడ్డ పూజను పిలిచింది… తన ఆభరణాలు, వీలునామా పత్రాలు ఇచ్చింది… ఇక మళ్లీ నీకు కనిపించకపోవచ్చు బిడ్డా అని ఆలింగనం చేసుకుంది… 49 ఏళ్లు నిండాయి…
కులూ వెళ్లాక ఓ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది… తన పుట్టుక నుండి, తన బాల్యం నుండి, తన సంబంధాల నుండి, తన వివాహాల నుండి, తన పిల్లలకు, తన నృత్య ప్రయాణం వరకు, తన మరణానికి ముందు తాను ఉన్న చోటు వరకు… తన మొత్తం జీవితాన్ని సంగ్రహంగా రాసింది…
‘’నేను కులులో ఉన్నాను, కులు అంటే దేవతల లోయ.., నేను సంతోషంగా ఉన్నాను..’’ అని చెప్పిన ఆమె మానస సరోవర్ యాత్రకు బయల్దేరింది… కొన్నాళ్ల తరువాత మంచుచరియలు విరిగిపడి ఆ యాత్రికుల బృందం కూరుకుపోయింది… కొందరి అవశేషాలు దొరికాయి… కానీ ప్రొతిమా దొరకలేదు… ఆమె మహాప్రస్థానం ఎక్కడ ముగిసిందో ఎవరికీ తెలియదు…
బతికి ఉన్నరోజుల్లో… ‘‘నా దేహం నిరర్థకమైన పూజా తంతుతో ఏదో ఓ దహనయంత్రంలోకి తోయవద్దు… నా అస్థికల్ని గంగలో కలపడం కూడా వద్దు… అవన్నీ నాకు పడవు… అవేవీ వర్తించని మరణం కావాలి నాకు’’ అనేది… అలాగే రాలిపోయింది… ఇంట్రస్టింగ్ జీవితం… ఓ పౌరాణిక మరణం…
- ఆమె మరణించిన కొన్ని వారాల తర్వాత, మిత్రురాలు కర్కారియా మెయిల్‌బాక్స్‌లోకి నలిగిన, బురదతో నిండిన ఒక కవరు వచ్చింది… ఆ చేతిరాత స్పష్టంగా ఉంది… అందులో, ప్రొతిమా ఇలా రాసింది..: “నేను ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నట్లు భావిస్తున్నాను, చివరకు నాకు శాంతి కలిగింది…” ఈ వాక్యాల్లో మీకు అర్థమైంది..?!
(రెండు రోజుల క్రితం పూజా బేడీ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి చాలా వివరాలు చెప్పుకొచ్చింది... అందుకేే ఓసారి ప్రొతిమా గుప్త, అలియాస్ ప్రొతిమా బేడీ, అలియాస్ ప్రొతిమా గౌరి గురించి చెప్పుకోవడం ఇలా...)
Share this Article